Monday, June 9, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 312

దివిజగణశరణ్యా


3-1054-మా.
దివిజగణశరణ్యా! దీపితానంతపుణ్యా!
ప్రవిమలగుణజాలా! క్తలోకానుపాలా!
తిమిరదినేశా! భానుకోటిప్రకాశా!
కులయహితకారీ! ఘోరదైత్యప్రహారీ!
          శ్రీరామా! దేవత లందరికి శరణ్యుడవు; పుణ్యపురుషులలో అగ్రగణ్యుడవు; నిర్మలమైన సుగుణాలు గలవాడవు; భక్తులను వెంటనంటి ఉండి కాపాడువాడవు; సంసారమనే కటిక చీకటిని రూపుమాపే భాస్కరుడవు; కోటి సూర్యుల కాంతితో ప్రకాశించెడివాడవు; భూమండలాని కెల్ల మేలు చేకూర్చు వాడవు; దుష్ట రాక్షసులను తునుమాడు వాడవు. అయిన నీకు వందనము.
తృతీయ స్కంధాంత ప్రార్థన పద్య మిది.
3-1054-maa.
divijagaNaSaraNyaa! deepitaanaMtapuNyaa!
pravimalaguNajaalaa! bhaktalOkaanupaalaa!
bhavatimiradinaeSaa! bhaanukOTiprakaaSaa!
kuvalayahitakaaree! ghOradaityaprahaaree!
          దివిజ = దేవతల; గణ = సమూహమునకు; శరణ్యా = శరణ మగువాడ; దీపిత = ప్రకాశించెడి; అనంత = అనంత మైన; పుణ్యా = పుణ్యములు కలవాడ; ప్రవిమల = మిక్కిలి స్వచ్ఛమైన; గుణ = సుగుణముల; జాలా = సమూహములు కలవాడ; భక్త = భక్తులగు; లోకాన్ = జనులను; అనుపాలా = పరిపాలించువాడ; భవ = సంసారము అనెడి; తిమిర = చీకటికి; దినేశ = సూర్యుడ {దినేశుడు - దినము (పగలు)నకు ఈశుడు (ప్రభువు), సూర్యుడు}; భాను = సూర్యులు; కోటి = కోటిమందికి సమానమైన; ప్రకాశా = ప్రకాశము కలవాడ; కువలయ = భూమండలమునకు; హిత = మేలు; కారీ = చేయువాడ; ఘోర = భయంకరమైన; దైత్య = రాక్షసులను; ప్రహారీ = సంహరించువాడ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: