త్రిజగన్మోహన నీలకాంతి
1-219-మ.
త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు
నెల్లప్పుడున్.
ముల్లోకాలకు మోహనమైన నీలవర్ణ కాంతులతో
నిగనిగలాడే మనోహరమైన దేహంతో, పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని
ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రంతో, నల్లని ముంగురులు కదలాడుతు ముద్దులు
మూటగట్టుతున్న ముఖ పద్మంతో, మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు మా
శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.
భక్తి రసావేశంతో, సాహిత్య సౌరభాలతో, ఆధ్యాత్మిక విలువల
ఔన్నత్యంతో, మంత్రపూరిత మహత్యంతో తొణికిసలాడుతుండే భీష్మస్తుతి మధురాతి మధురమైనది అంటారు.
అట్టి భీష్మ స్తుతిలోని ఒక ఆణిముత్య మిది. నీలవర్ణం సర్వవ్యాపక ఆకాశానికి ప్రతీక,
ప్రాభాతం ఆత్మజ్ఞానోదయానికి, ముఖారవిందం ప్రధానమైన హృదయపద్మానికి, నీలాలకాలు మానవభావలకు,
అతిసేవ్యంబు దైవదర్శనానికి, ఎల్లప్పుడున్ శాశ్వతత్వానికి సూచికలు అనుకుంటే
భీష్ముని విజ్ఞానం అబ్బురంగా అనిపిస్తుంది. ప్రాసగా ‘జ’
ప్రయోగిస్తు మా విజయునికి దగ్గరగా ఉండే వాడు అంటు మత్తేభం విక్రీడితం ప్రయోగించిన
పోతనగారి చమత్కారం మనోహరం.
1-219-ma.
trijaganmOhana
neelakaaMti@M danu vuddeepiMpa@M braabhaata nee
rajabaMdhuprabhamaina
chaelamu payin raMjilla neelaalaka
vraja
saMyukta mukhaaraviMda matisaevyaMbai vijRMbhiMpa maa
vijayuM
jaereDu vannelaa@MDu madi naavaeSiMchu nellappuDun.
త్రి = మూడు;
జగత్ = లోకములను; మోహన = మోహింప చేయగల; నీల = నీలమైన; కాంతిన్ = కాంతితో; తనువు = శరీరము; ఉద్దీపింపన్ = బాగా ప్రకాశిస్తుండగ; ప్రాభాత = ఉదయ కాలపు; నీరజ = పద్మములకు; బంధు = బంధువు / సూర్యుని; ప్రభము = కాంతి కలది; ఐన = అయిన; చేలము = వస్త్రము; పయిన్ = పైన; రంజిల్లన్ = ఎర్రగా ప్రకాశిస్తుండగ; నీల = నల్లని; అలక = ముంగురుల యొక్క; వ్రజ = సమూహముతో; సంయుక్త = కూడిన; ముఖ = మఖము అనే; అరవిందము = పద్మము; అతి = మిక్కిలి; సేవ్యంబు = సేవింపదగినది; ఐ = అయ్యి; విజృంభింపన్ = చెలరేగుతూ; మా = మా యొక్క; విజయున్ = అర్జునుని; చేరెడు = చేరి యుండు; వన్నెలాఁడు = విలాసవంతుడు; మదిన్ = మనస్సును; ఆవేశించున్ = ప్రవేశించును గాక; ఎల్లప్పుడున్ = ఎల్లప్పుడూ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment