104-
వ.
అంత న
య్యాదవేంద్రుని నగరంబు సమారబ్ద వివాహ కృత్యంబును బ్రవర్తమాన గీత వాద్య నృత్యం బును, బ్రతిగృహాలంకృ తాశేష నరనారీ వర్గంబును, బరిణయ
మహోత్సవ సమాహూయ మాన మహీపాల గజఘటా గండమండల దానసలిలధారా సిక్త రాజమార్గంబును
బ్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక కదళికా కర్పూర కుంకుమాగరు ధూపదీప
పరిపూర్ణకుంభంబును, విభూషిత సకల గృహవేదికా కవాట దేహళీ
స్తంభంబును, విచిత్ర కుసుమాంబర రత్నతోరణ విరాజితంబును,
సముద్ధూత కేతన విభ్రాజితంబును నై యుండె; నయవ్వసరంబున.
అంతట ద్వారకానగరంలో పెళ్ళి
పనులు మొదలయ్యాయి. పాటలు, వాయిద్యాలు, నాట్యాలు చెలరేగాయి. ప్రతి ఇంటి నిండా అలంకరించుకున్న
స్త్రీ పురుషులు గుంపులు గూడుతున్నారు. కల్యాణ మహోత్సవానికి ఆహ్వానించబడిన
ఎంతోమంది రాజులు వస్తున్నారు. వారి వారి ఏనుగుల గండభాగాల నుండి కారుతున్న మదజలంతో
రాజమార్గాలు కళ్ళాపిజల్లినట్లు తడుస్తున్నాయి. ప్రతి ద్వారానికి రెండు పక్కల
మంగళాచారంకోసం పోకమొక్కలు అరటిబోదెలు కట్టారు. కర్పూరం, కుంకుమ, అగరుధూపాలు,
దీపాలు, పూర్ణకుంభాలు ఉంచారు. ఇంటి అరుగులు, తలుపులు, గడపలు, స్తంభాలు చక్కగా
అలంకరించారు. రంగురంగుల పూలు, బట్టలు, రత్నాలుతో తోరణాలు కట్టారు. జండాలు
ఎగరేసారు. అప్పుడు.
అంతన్ = అటుపిమ్మట; ఆ = ఆ యొక్క; యాదవేంద్రుని = కృష్ణుని {యాదవేంద్రుడు
- యాదవులలో ఉత్తముడు,
కృష్ణుడు}; నగరంబు = పట్టణము; సమారబ్ద = ప్రారంభింపబడిన; వివాహ = పెండ్లి; కృత్యంబునున్ = పనులుకలది; ప్రవర్తమాన = జరుగుచున్న; గీత = పాటలుపాడుట; వాద్య = వాద్యములు వాయించుట; నృత్యంబున్ = నృత్యములాడుటలు కలది; ప్రతి = అన్ని; గృహ = ఇళ్ళలోను; అలంకృత = అలంకరింపబడిన; అశేష = ఎల్ల; నర = పురుషుల; నారీ = స్త్రీల; వర్గంబును = సమూహములు కలది; పరిణయ = పెండ్లి యొక్క; మహా = గొప్ప; ఉత్సవ = వేడుకకు; సమాహూయమాన = పిలువబడుచున్న; మహీపాల = రాజుల యొక్క; గజ = ఏనుగుల; ఘటా = సమూహము యొక్క; గండమండల = చెక్కిలి ప్రదేశములందలి; దాన = మద; సలిల = జల; ధారా = ధారలచేత; సిక్త = తడిసిన; రాజమార్గంబునున్ = ప్రధాన వీధులు కలది; ప్రతి = ఎల్ల; ద్వార = గుమ్మములందు; మంగళాచార = శుభకార్యమునకై; సంఘటిత = కట్టబడిన; క్రముక = పొకమానులు; కదళికా = అరటిచెట్లు; కర్పూర = కర్పూరము; కుంకుమ = కుంకుమ; అగరు = అగరు (సుగంధ ద్రవ్యము); ధూప = ధూపములు; దీప = దీపములు; పరిపూర్ణ =
నిండు; కుంభంబును = కుంభములు కలది; విభూషిత
= అలంకరింపబడిన; సకల = సమస్తమైన; గృహ =
ఇండ్లయొక్క; వేదికా = అరుగులు; కవాట = తలుపులు;
దేహళీ = ద్వారబంధములు; స్తంభంబును = స్తంభములు
కలది; విచిత్ర = విశేషమైన; కుసుమ =
పూలు; అంబర = వస్త్రములు; రత్న = మణులు;
తోరణ = తోరణములచేత {తోరణము - వరుసగా కట్టిన
ఆకులు పూలు వంటివి కట్టిన పొడుగైన తాడు}; విరాజితంబును
= విలసిల్లుచున్నది; సముద్ధూత = మిక్కలిమీదికెగురుతున్న;
కేతన = జండాలచేత; విభ్రాజితంబును =
మిక్కలిప్రకాశించుచున్నది; ఐ = అయ్యి; ఉండెన్
= ఉండెను; ఆ = ఆ యొక్క; అవసరంబునన్ =
సమయమునందు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment