Monday, October 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౮(668)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-38-తే.
అర్ఘ్యపాద్యాదివిధులను నర్థితోడఁ
బూజ గావించి, వారలఁ బొలుపు మిగుల
నుచితపీఠంబులందును నునిచి, యెలమి
నవమునిశ్రేష్ఠులను భూమినాయకుండు.
11-39-క.
వారల కిట్లను "మీరలు
గారవమున విష్ణుమూర్తిఁ గైకొనిన మహా
భూరితపోధనవర్యులు
సారవిహీనంబు లైన సంసారములన్‌.
11-40-క.
ఏ రీతి గడప నేర్తురు?
క్రూరులు బహుదుఃఖరోగకుత్సిత బుద్ధుల్‌
నీరసులు నరులు గావున
నారయ సుజ్ఞానబుద్ధి నానతి యీరే?

భావము:
అర్ఘ్యం పాద్యం మొదలైన శాస్త్రవిధులతో ప్ఱ్ఱార్థనా పూర్వకంగా పూజించి ఆ విదేహ మహారాజు ఆ తొమ్మిది మంది మునివరులను సముచిత పీఠాలపై కూర్చుండ బెట్టాడు. అలా ఆసీనులైనవారితో విదేహరాజు ఇలా అన్నాడు. “మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో భజించే గొప్ప తపోనిధులు. ఈ సంసారాలు పరమ సారం లేనివి. క్రూరులు; అనేక రకాల దుఃఖాలు, రోగాలు, అల్ప బుద్ధులు కలవారు; నీరసులు అయిన మానవులకు ఈ సారహీనమైన సంసారాలను దాటటానికి ఏదైనా మార్గం ఏదో సుఙ్ఞాన పూరకమైన మీ బుద్ధి కుశలతతో చెప్పండి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=40

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, October 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౭(667)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-36-క.
జగదేకనాథు గుణములు
మిగులఁగ సంస్మరణతోడ మీఱిన భక్తిం
బగలును రాత్రియు సంధ్యలుఁ
దగిలి జితేంద్రియులు నైన తపసులు ధాత్రిన్‌.
11-37-క.
ఊహింపఁ బుణ్యుఁ డైన వి
దేహుని యజ్ఞాంతమందు నేతెంచినచో
గేహము వెడలి యెదుర్కొని
మోహవివర్జితులఁ బుణ్యమునిసంఘములన్‌.

భావము:
ఆ కవి మున్నగు ఆ తొమ్మండుగురు తపస్వులు సకల లోకాలకు ప్రభువైన శ్రీహరి గుణగణాలను మిక్కిలి తలచుకుంటూ, అతిశయించిన భక్తితో పగలు రాత్రీ ఉభయ సంధ్యలు అని లేకుండా సకల వేళలా సర్వదా ఆ భగవంతుని యందే ఆసక్తి కలవారై జితేంద్రియులైన వారు. భూలోకంలో పుణ్యాత్ముడైన విదేహుడు చేస్తున్న యజ్ఞం ముగింపుకు వచ్చిన సమయానకి అక్కడకి ఆ మహా తాపసులు విచ్చేశారు. విదేహరాజు గృహం లోపలి నుంచి వచ్చి మోహవిసర్జించిన ఆ పుణ్య మునీశ్వరులకు ఎదురువెళ్ళి....

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=37

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, October 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౬(666)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-35-వ.
ఆ యాగ్నీధ్రునకు నాభి యను ప్రాజ్ఞుం డగు తనూభవుం డుదయించి బలిచక్రవర్తితో మైత్రింజేసి ధారుణీభారంబు పూని యాజ్ఞా పరిపాలనంబున నహితరాజన్య రాజ్యంబులు స్వవశంబులు గావించుకొని యుండె; నంతట నాభికి సత్పుత్రుం డయిన ఋషభుండు పుట్టె; నతండు హరిదాసుండై సుతశతకంబుఁ బడసె; నందగ్రజుండయిన భరతుం డను మహానుభావుఁడు నారాయణపరాయణుండై యిహలోకసుఖంబులం బరిహరించి, ఘోరతపం బాచరించి జన్మ త్రితయంబున నిర్వాణసుఖపారవశ్యంబున సకలబంధ విముక్తుం డై వాసుదేవపదంబు నొందె; నాతని పేర నతం డేలిన భూఖండంబు భారతవర్షం బను వ్యవహారంబున నెగడి జగంబులఁ బ్రసిద్ధం బయ్యె; మఱియు నందుఁ దొమ్మండ్రు కుమారులు బల పరాక్రమ ప్రభావ రూప సంపన్నులయి నవఖండంబులకు నధిష్ఠాతలైరి; వెండియు వారలలో నెనుబది యొక్కండ్రు కుమారులు నిత్య కర్మానుష్ఠాన పరతంత్రులై విప్రత్వం బంగీకరించి; రందుఁ గొందఱు శేషించిన వారులు కవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయ నావిర్హోత్ర ద్రమిళ చమస కరభాజను లనం బరఁగు తొమ్మం డ్రూర్ధ్వరేతస్కు లయి బ్రహ్మవిద్యావిశారదు లగుచు, జగత్త్రయంబును బరమాత్మ స్వరూపంబుగాఁ దెలియుచు ముక్తులై యవ్యాహతగమను లగుచు, సుర సిద్ధ సాధ్య యక్ష గంధర్వ కిన్నర కింపురుష నాగలోకంబు లందు స్వేచ్ఛావిహారంబు సేయుచు నొక్కనాఁడు.

భావము:
ఆ అగ్నీధ్రుడికి నాభి అనే కుమారుడు జన్మించాడు ప్రాజ్ఞుడైన అతడు బలిచక్రవర్తితో స్నేహంచేసి భూభారాన్ని వహించి ప్రజలను పాలించాడు. తన ఆజ్ఞాపాలన చేయ అంగీకరించని సకల శత్రురాజుల రాజ్యాలను తన వశం చేసుకున్నాడు. ఆ నాభికి సత్పుత్రుడైన ఋషభుడు పుట్టాడు హరిభక్తుడైన ఋషభుడు వందమంది కొడుకులను కన్నాడు. వారిలో పెద్దవాడు భరతుడు అనే మహానుభావుడు. అతడు నారాయణభక్తుడై ఈ లోకపు సుఖాలను వదలి భయంకరమైన తపస్సుచేసి మూడు జన్మలలో సకలబంధాల నుండి విముక్తిచెంది నిర్వాణ సుఖపారవశ్యంతో పరమపదాన్ని అందుకోగలిగాడు. భరతుడు పాలించిన భూఖండానికి “భరతవర్షము” అనే పేరు జగత్ప్రసిద్ధంగా వచ్చింది. ఋషభుని వందమందిలో తొమ్మిదిమంది కుమారులు బలం పరాక్రమం ప్రభావం రూపసంపద కలిగినవారై తొమ్మిది భూఖండాలకు ఏలికలయ్యారు. ఇంకా వారిలో ఎనభైఒక్కమంది కుమారులు నిత్యకర్మలలోను అనుష్ఠానములలోను ఆసక్తికలవారై బ్రాహ్మణత్వాన్ని గ్రహించారు. మిగిలినవారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రమీళుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్లు కలగిన తొమ్మిదిమంది ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మవిద్యా విశారదులై మూడులోకాలు పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ముక్తులై అడ్డులేని గమనాలతో సురల, సిద్ధుల, యక్షుల, గంధర్వుల, కిన్నరుల, కింపురుషుల, నాగుల యొక్క లోకములందు తమ ఇచ్చానుసారంగా విహరింప సాగారు. అలా విహరిస్తూ ఒకనాడు...

1. హరి, 2. కవి, 3. అంతరిక్షుడు, 4. ప్రబుద్ధుడు, 5. పిప్పలాహ్వయుడు, 6. అవిర్హోత్రుడు, 7. ద్రమిళుడు, 8. చమనుడు, 9. కరభాజనుడు యను వీరు వృషభరాజు నూఱుగురి కుమారులలో ఆకాశగమనాది సిద్ధులను పొందిన చివరివారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=35

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౬౫(665)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-33-వ.
అట్లు గావున పరమేశ్వరభక్తిజనకంబై కైవల్యపదప్రాప్తికరంబయి యొప్పుచున్న విదేహర్షభసంవాదంబు నాఁ బరగు నొక్క పురాతన పుణ్యకథావిశేషం బెఱింగించెద సావధాన మనస్కుండవై యాకర్ణింపు” మని యిట్లనియె
11-34-తే.
"వినుము; స్వాయంభువుండను మనువునకును
రమణ నుదయించె నఁట ప్రియవ్రతుఁ డనంగఁ
దనయు; డాతని కాగ్నీధ్రుఁ డనఁగ సుతుఁడు
జాతుఁ డయ్యెను భువనవిఖ్యాతుఁ డగుచు.

భావము:
అందుకని పరమేశ్వరుని మీద భక్తిని కలిగించేది మోక్షాన్ని అందించేది అయిన విదేహఋషభ సంవాదము అనే ప్రసిద్ధమైన ఒక పురాతన పుణ్యకథను చెప్తాను ఏకాగ్ర చిత్తంతో విను." అని ఇలా చెప్పసాగాడు. “శ్రద్ధగా విను. స్వాయంభువుడనే మనువుకు ప్రియవ్రతుడనే కుమారుడు ఉదయించాడు. అతనికి అగ్నీధ్రుడనే కొడుకు పుట్టి, లోకప్రసిద్ధుడు అయ్యాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=34

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, October 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౪(664)

( వాసుదేవ ప్రశ్నంబు ) 

11-31-క.
"నను నీవు సేయు ప్రశ్నము
జనసన్నుత! వేదశాస్త్రసారాంశంబై
ఘనమగు హరిగుణకథనము
విను" మని, వినిపింపఁ దొడఁగె వేడ్క దలిర్పన్‌.
11-32-క.
"అతిపాపకర్ములైనను
సతతము నారాయణాఖ్యశబ్దము మదిలో
వితతంబుగఁ బఠియించిన
చతురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే?

భావము:
“సచ్చరిత్ర! నీవు వేసిన ప్రశ్న వేదశాస్త్రముల సారాంశమైనది. ఘనమైన ఆ శ్రీహరి గుణకథనాలను వినవలసింది.” అని వేడుక చిగురించగా వినిపించడం మొదలు పెట్టాడు. ఎంతటి పాపంచేసిన వారైనా సరే నారాయణుని నామాన్ని విడువక నిత్యం మనస్సులో స్మరించేవాళ్ళు పరమ ధన్యులు. అట్టి వారిని పొగడుట బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=32

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౬౩(663)

( కృష్ణ సందర్శనంబు ) 

11-30-వ.
అట్లు దేవముని కృష్ణసందర్శనార్థం బరుగుదెంచి తద్గృహాభ్యంతరమున కరిగిన, వసుదేవుం డమ్మునీంద్రుని నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, కనకాసనాసీనుం గావించి, యుచిత కథావినోదంబులం బ్రొద్దుపుచ్చుచు నిట్లనియె; “యే నరుండు నారాయణచరణసరసీరుహ భజనపరాయణత్వంబు నిరంతరంబు నొందం; డట్టివానికి మృత్యువు సన్నిహితంబై యుండు; నీ దర్శనంబునం గృతార్థుండ నైతి; నచ్యుతానంత గోవింద నామస్మరణైకాగ్రచిత్తులైన మీవంటి పుణ్యపురుషుల సమాగమంబున లోకులు సుఖాశ్రయులయి యుండుదురు; దేవతాభజనంబు సేయువారిని గీర్వాణులు ననుగ్రహింతు; రట్లు సజ్జనులును దీనవత్సలులు నగు వారలు పూజనాది క్రియలచే నా దేవతలను భక్తి సేయుదురు; కావున శ్రీ మహా భాగవత కథాసమూహంబులఁ గల ధర్మంబు లడిగెద; నేయే ధర్మంబులు శ్రవణ సుఖంబులుగా వినిన దండధరకింకర తాడనంబులం బడక, ముకుందచరణారవింద వందనాభిలాషులయి పరమపదప్రాప్తు లగుదు; రా ధర్మంబు లానతిమ్ము; తొల్లి గోవిందునిం బుత్రుఁగాఁ గోరి ముక్తిమార్గం బెఱుంగలేక దేవతామాయం జేసి చిక్కి చిత్తవ్యసనాంధకారం బగు సంసారంబునం దగులువడి యున్నవాఁడ; హరికథామృతంబు వెల్లిగొల్పు; మట్లయిన సుఖంబు గలుగు" ననిన వసుదేవ కృతప్రశ్నుండైన నారదుండు వాసుదేవ కథా ప్రసంగ సల్లాపహర్ష సమేతుండై సంతసంబంద నిట్లనియె.

భావము:
అలా శ్రీకృష్ణ దర్శనం కోసం వచ్చిన దేవమునీంద్రుని వసుదేవుడు ఆర్ఘ్యం పాద్యం ఆదులతో యథావిథిగా పూజించి, బంగారపు ఆసనం మీద కూర్చుండపెట్టి సముచిత కథా వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ ఇలా అన్నాడు. “మునీంద్రా! నిరంతరం నారాయణ పాదపద్మాలను భజించని వానికి చావు సమీపంలోనే ఉంటుంది. నీ దర్శనంవలన కృతార్ధుడనైనాను. అచ్యుత, అనంత ఆది గోవిందనామాలను నిత్యం స్మరించే ఏకాగ్ర చిత్తం గల మీవంటి సుకృతాత్ములను కలియుట వలన లోకులు సుఖాశ్రయులై ఉంటారు. దేవతలను భజించే వారిని వేల్పులు అనుగ్రహిస్తారు. అటువంటి సజ్జనులు దీనవత్సలలు పూజలు మున్నగు సత్కార్యాలతో దేవతల యందు భక్తి చూపిస్తూ ఉంటారు. కనుక, శ్రీ మహా భాగవతం అందలి కథలలో ఉన్న ధర్మాలను అడుగుతాను.
వీనులవిందుగా వింటే, యమభటులచేత దెబ్బలు తినకుండా ముకుందుని పాదపద్మాలకు నమస్కరించే కోరిక కలిగి, పరమపదాన్ని పొందగల ధర్మాలను ఆనతీయండి. పూర్వము గోవిందుడిని కుమారునిగా కోరినప్పటికి మోక్షమార్గం తెలియలేక దైవమాయలో చిక్కి వ్యసనాల చీకటితో నిండిన సంసారంలో చిక్కుకుని ఉన్నాను. హరికథాసుధారసాన్ని ప్రవహింప చేయండి. అలా అయితే నాకు సుఖం కలుగుతుంది.” అని వసుదేవుడు ప్రార్థించగా నారదుడు వాసుదేవుని కథల ప్రస్తావన వచ్చినందుకు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=30

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, October 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౨(662)

( కృష్ణ సందర్శనంబు ) 

11-28-వ.
అని యడిగిన రాజునకు శుకుం డిట్లనియె.
11-29-క.
"వినుము నృపాలక! సెప్పెద
ఘనమై విలసిల్లు పూర్వకథ గల దదియున్‌
మును ద్వారక కేతెంచియు
నొనరఁగ నారదుఁడు గృష్ణు నొయ్యనఁ గాంచెన్‌.

భావము:
ఇలా అడిగిన మహారాజుతో శుకమహర్షి ఈ విధంగా అన్నాడు. “ఓ మహారాజా! శ్రద్ధగా వినవయ్యా! దీనికి ఒక గొప్ప పూర్వగాథ ఉన్నది. ఒకప్పుడు నారదుడు ద్వారకకు వచ్చి ముకుందుడిని దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=29

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :