11-35-వ.
ఆ యాగ్నీధ్రునకు నాభి యను ప్రాజ్ఞుం డగు తనూభవుం డుదయించి బలిచక్రవర్తితో మైత్రింజేసి ధారుణీభారంబు పూని యాజ్ఞా పరిపాలనంబున నహితరాజన్య రాజ్యంబులు స్వవశంబులు గావించుకొని యుండె; నంతట నాభికి సత్పుత్రుం డయిన ఋషభుండు పుట్టె; నతండు హరిదాసుండై సుతశతకంబుఁ బడసె; నందగ్రజుండయిన భరతుం డను మహానుభావుఁడు నారాయణపరాయణుండై యిహలోకసుఖంబులం బరిహరించి, ఘోరతపం బాచరించి జన్మ త్రితయంబున నిర్వాణసుఖపారవశ్యంబున సకలబంధ విముక్తుం డై వాసుదేవపదంబు నొందె; నాతని పేర నతం డేలిన భూఖండంబు భారతవర్షం బను వ్యవహారంబున నెగడి జగంబులఁ బ్రసిద్ధం బయ్యె; మఱియు నందుఁ దొమ్మండ్రు కుమారులు బల పరాక్రమ ప్రభావ రూప సంపన్నులయి నవఖండంబులకు నధిష్ఠాతలైరి; వెండియు వారలలో నెనుబది యొక్కండ్రు కుమారులు నిత్య కర్మానుష్ఠాన పరతంత్రులై విప్రత్వం బంగీకరించి; రందుఁ గొందఱు శేషించిన వారులు కవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయ నావిర్హోత్ర ద్రమిళ చమస కరభాజను లనం బరఁగు తొమ్మం డ్రూర్ధ్వరేతస్కు లయి బ్రహ్మవిద్యావిశారదు లగుచు, జగత్త్రయంబును బరమాత్మ స్వరూపంబుగాఁ దెలియుచు ముక్తులై యవ్యాహతగమను లగుచు, సుర సిద్ధ సాధ్య యక్ష గంధర్వ కిన్నర కింపురుష నాగలోకంబు లందు స్వేచ్ఛావిహారంబు సేయుచు నొక్కనాఁడు.
భావము:
ఆ అగ్నీధ్రుడికి నాభి అనే కుమారుడు జన్మించాడు ప్రాజ్ఞుడైన అతడు బలిచక్రవర్తితో స్నేహంచేసి భూభారాన్ని వహించి ప్రజలను పాలించాడు. తన ఆజ్ఞాపాలన చేయ అంగీకరించని సకల శత్రురాజుల రాజ్యాలను తన వశం చేసుకున్నాడు. ఆ నాభికి సత్పుత్రుడైన ఋషభుడు పుట్టాడు హరిభక్తుడైన ఋషభుడు వందమంది కొడుకులను కన్నాడు. వారిలో పెద్దవాడు భరతుడు అనే మహానుభావుడు. అతడు నారాయణభక్తుడై ఈ లోకపు సుఖాలను వదలి భయంకరమైన తపస్సుచేసి మూడు జన్మలలో సకలబంధాల నుండి విముక్తిచెంది నిర్వాణ సుఖపారవశ్యంతో పరమపదాన్ని అందుకోగలిగాడు. భరతుడు పాలించిన భూఖండానికి “భరతవర్షము” అనే పేరు జగత్ప్రసిద్ధంగా వచ్చింది. ఋషభుని వందమందిలో తొమ్మిదిమంది కుమారులు బలం పరాక్రమం ప్రభావం రూపసంపద కలిగినవారై తొమ్మిది భూఖండాలకు ఏలికలయ్యారు. ఇంకా వారిలో ఎనభైఒక్కమంది కుమారులు నిత్యకర్మలలోను అనుష్ఠానములలోను ఆసక్తికలవారై బ్రాహ్మణత్వాన్ని గ్రహించారు. మిగిలినవారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రమీళుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్లు కలగిన తొమ్మిదిమంది ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మవిద్యా విశారదులై మూడులోకాలు పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ముక్తులై అడ్డులేని గమనాలతో సురల, సిద్ధుల, యక్షుల, గంధర్వుల, కిన్నరుల, కింపురుషుల, నాగుల యొక్క లోకములందు తమ ఇచ్చానుసారంగా విహరింప సాగారు. అలా విహరిస్తూ ఒకనాడు...
1. హరి, 2. కవి, 3. అంతరిక్షుడు, 4. ప్రబుద్ధుడు, 5. పిప్పలాహ్వయుడు, 6. అవిర్హోత్రుడు, 7. ద్రమిళుడు, 8. చమనుడు, 9. కరభాజనుడు యను వీరు వృషభరాజు నూఱుగురి కుమారులలో ఆకాశగమనాది సిద్ధులను పొందిన చివరివారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=35
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment