Sunday, October 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౭(667)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-36-క.
జగదేకనాథు గుణములు
మిగులఁగ సంస్మరణతోడ మీఱిన భక్తిం
బగలును రాత్రియు సంధ్యలుఁ
దగిలి జితేంద్రియులు నైన తపసులు ధాత్రిన్‌.
11-37-క.
ఊహింపఁ బుణ్యుఁ డైన వి
దేహుని యజ్ఞాంతమందు నేతెంచినచో
గేహము వెడలి యెదుర్కొని
మోహవివర్జితులఁ బుణ్యమునిసంఘములన్‌.

భావము:
ఆ కవి మున్నగు ఆ తొమ్మండుగురు తపస్వులు సకల లోకాలకు ప్రభువైన శ్రీహరి గుణగణాలను మిక్కిలి తలచుకుంటూ, అతిశయించిన భక్తితో పగలు రాత్రీ ఉభయ సంధ్యలు అని లేకుండా సకల వేళలా సర్వదా ఆ భగవంతుని యందే ఆసక్తి కలవారై జితేంద్రియులైన వారు. భూలోకంలో పుణ్యాత్ముడైన విదేహుడు చేస్తున్న యజ్ఞం ముగింపుకు వచ్చిన సమయానకి అక్కడకి ఆ మహా తాపసులు విచ్చేశారు. విదేహరాజు గృహం లోపలి నుంచి వచ్చి మోహవిసర్జించిన ఆ పుణ్య మునీశ్వరులకు ఎదురువెళ్ళి....

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=37

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: