Saturday, November 28, 2015

ప్రహ్లాద చరిత్ర - నిన్నున్

 
7-164-శార్దూల విక్రీడితము
నిన్నున్ మెచ్చరు నీతిపాఠమహిమన్ నీతోటి దైత్యార్భకుల్
కన్నా రన్నియుఁ జెప్ప నేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై
యన్నా! యెన్నఁడు నీవు నీతివిదుఁ డౌ దంచున్ మహావాంఛతో
నున్నాడన్ ననుఁ గన్నతండ్రి భవదీయోత్కర్షముం జూపవే.”
7-165-వచనము
అనినం గన్నతండ్రికిఁ బ్రియనందనుం డయిన ప్రహ్లాదుం డిట్లనియె.
            కుమారా! నా కన్న తండ్రీ! నీ తోడి దైత్య విద్యార్థులు నీతిశాస్త్రం నీకంటే బాగా చదువుతున్నారు అట కదా! అందుచేత నిన్ను లెక్కచేయటం లేదుట కదా! మరి నువ్వెప్పుడు గొప్ప నీతికోవిదుడవు అవుతావు? నేను ఎంతో కోరికతో ఎదురుచూస్తున్నాను. ఏదీ చదువులో నీ ప్రతిభపాటవాలు నాకొకసారి చూపించు.”
            అలా అన్న తండ్రి హిరణ్యకశిపుడితో ఇష్ట పుత్రుడైన ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.
           నిన్నున్ = నిన్ను; మెచ్చరు = మెచ్చుకొనరు; నీతి = నీతిశాస్త్రమును; పాఠ = చదివిన; మహిమన్ = గొప్పదనమును; నీ = నీ; తోటి = సహపాఠకులైన; దైత్య = రాక్షస; అర్భకుల్ = బాలకులు; కన్నారు = నేర్చుకొన్నారు; అన్నియున్ = అన్నిటిని; చెప్పన్ = చెప్పుట; నేర్తురు = నేర్చుకొంటిరి; కదా = కదా; గ్రంథ = గ్రంథముల; అర్థముల్ = అర్థములను; దక్షులు = నేర్పరులు; ఐ = అయ్యి; అన్నా = నాయనా; ఎన్నడున్ = ఎప్పుడు; నీవు = నీవు; నీతి = నీతిశాస్త్రమున; కోవిదుడవు = విద్వాంసుడవు; ఔదు = అయ్యెదవు; అంచున్ = అనుచు; మహా = మిక్కలి; వాంఛ = కోరిక; తోన్ = తో; ఉన్నాడను = ఉన్నాను; నను = నను; కన్నతండ్రి = కన్నతండ్రి; భవదీయ = నీ యొక్క; ఉత్కర్షమున్ = గొప్పదనమును; చూపవే = చూపించుము.
          అనినన్ = అనగా; కన్న = తనకు జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రియ = ఇష్ట; నందనుండు = సుతుడు; అయిన = ఐన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; అనియె = పలికెను.
७-१६४-शार्दूल विक्रीडितमु
निन्नुन् मेच्चरु नीतिपाठमहिमन् नीतोटि दैत्यार्भकुल्
कन्ना रन्नियुँ जेप्प नेर्तुरु गदा ग्रंथार्थमुल् दक्षुलै
यन्ना! येन्नँडु नीवु नीतिविदुँ डौ दंचुन् महावांछतो
नुन्नाडन् ननुँ गन्नतंड्रि भवदीयोत्कर्षमुं जूपवे.
७-१६५-वचनमु
अनिनं गन्नतंड्रिकिँ ब्रियनंदनुं डयिन प्रह्लादुं डिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, November 27, 2015

ఈ వారం అనుయుక్తం - విరాడ్విగ్రహ లక్షణాలు

మన తెలుగు భాగవతంలో మనకు దొరికే ఆణిముత్యాలు:
===>> ఈ వారం అనుయుక్తం - విరాడ్విగ్రహ లక్షణాలు << ===

(పోతన తెలుగుభాగవతం 2వ స్కంధ, 16వ వచనం)
విరాడ్విగ్రహ వర్ణనలోని లక్షణాలు - 8
1. దంతములు – స్నేహ వాత్సల్యములు
2. నవ్వులు – మాయ అను ప్రకృతి
3. కటాక్షములు – సృష్టి దొంతరలు
4. పెదవులు – లజ్జా లోభములు
5. స్తనములు – ధర్మమునకు మార్గాలు
6. వీపు – అధర్మము
7. హృదయము – ప్రధానము అనబడు మూలప్రకృతి
8. చిత్తము – మహత్తు అను తత్వము

http://www.telugubhagavatam.org/…
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

ప్రహ్లాద చరిత్ర - అడుగడ్గునకు

7-160-సీస పద్యము
అడుగడ్గునకు మాధవానుచింతనసుధా; మాధుర్యమున మేను మఱచువాని;
నంభోజగర్భాదు లభ్యసింపఁగ లేని; హరిభక్తిపుంభావ మైనవాని;
మాతృగర్భముజొచ్చి మన్నది మొదలుగాఁ; జిత్త మచ్యుతుమీఁదఁ జేర్చువాని;
నంకించి తనలోన నఖిలప్రపంచంబు; శ్రీవిష్ణుమయ మని చెలఁగువాని;
7-160.1-తేటగీతి
వినయకారుణ్యబుద్ధివివేకలక్ష
ణాదిగుణముల కాటపట్టయినవాని;
శిష్యు బుధలోకసంభావ్యుఁ జీరి గురుఁడు
ముందఱికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కు మనుచు.
            ప్రహ్లాదుడు ప్రతిక్షణమూ, అడుగడుక్కీ విష్ణువును ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మాధుర్యంలో తన్ను తాను మైమఱుస్తూ ఉంటాడు. అతను బ్రహ్మా వంటి వారికైనా కూడా అలవి కాని “హరి భక్తి రూపందాల్చిన బాలకుని”లా ఉంటాడు. తల్లి కడుపులో ప్రవేశించి నప్పటినుంచీ కూడా అతని మనస్సు అచ్యుతుడు విష్ణువు మీదే లగ్నం చేసి ఉంటోంది. అతడు చక్కగా విచారించి “ఈ లోకములు అన్నీ విష్ణుమయములే” అని తన మనస్సు లో ధృఢంగా నమ్మేవాడు. అతడు అణకువ, దయ మొదలగు సర్వ సుగుణములు నిండుగా ఉన్న వాడు. జ్ఞానులుచే చక్కగా గౌరవంతో తలచబడేవాడు. అంతటి ఉత్తముడైన తన శిష్యుడు ప్రహ్లాదుడిని పిలిచి, తండ్రి ముందుకు నెట్టి, నమస్కారం చెయ్యమని చెప్తూ, హిరణ్యకళిపుడితో ఇలా అన్నారు.
          అడగడ్గున్ = ప్రతిక్షణము; కున్ = నందును; మాధవ = నారాయణుని; అనుచింతనా = ధ్యానించుట యనెడి; సుధా = అమృతము యొక్క; మాధుర్యమున్ = తీయదనముచే; మేను = శరీరమును; మఱచు = మరిచిపోవు; వానిన్ = వానిని; అంభోజగర్భ = బ్రహ్మదేవుడు {అంభోజగర్భుడు - అంభోజము (పద్మము)నందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఆదుల్ = మొదలగువారుకూడ; అభ్యసింపగలేని = నేర్చుకొనలేని; హరి = నారాయణుని; భక్తి = భక్తి; పుంభావము = పురుషరూపుదాల్చిన; వానిన్ = వానిని; మాతృ = తల్లి యొక్క; గర్భమున్ = గర్భములో; చొచ్చి = ప్రవేశించి; మన్నది = జీవంపోసుకున్నది; మొదలుగాన్ = నుండి మొదలెట్టి; చిత్తమున్ = మనసును; అచ్యుతు = నారాయణుని {అచ్యుతుడు - చ్యుతము (జారిపోవుట) లేనివాడు, విష్ణువు}; మీదన్ = పైన; చేర్చు = లగ్నముచేయు; వానిన్ = వానిని; అంకించి = భావించి; తన = తన; లోనన్ = అందే; అఖిల = సమస్తమైన; ప్రపంచంబున్ = విశ్వమును; శ్రీ = సంపత్కరమైన; విష్ణు = నారాయణునితో; మయము = నిండినది; అని = అని; చెలగు = చెలరేగెడి; వానిన్ = వానిని.
          వినయ = అణకువ; కారుణ్య = భూతదయ; బుద్ధి = మంచిబుద్ధులు; వివేకలక్షణ = వివేచనాశక్తి; ఆది = మొదలగు; గుణముల్ = సుగుణముల; కున్ = కు; ఆటపట్టు = విహారస్థానము; అయిన = ఐన; వానిన్ = వానిని; శిష్యున్ = శిష్యుని (ప్రహ్లాదుని); బుధ = జ్ఞానులు; లోక = అందరిచేతను; సంభావ్యున్ = గౌరవింపదగినవానిని; చీరి = పిలిచి; గురుడు = గురువు; ముందఱి = ముందరి; కిన్ = కి; ద్రొబ్బి = తోసి, గెంటి; తండ్రి = తండ్రి; కిన్ = కి; మ్రొక్కుము = నమస్కరించుము; అనుచున్ = అనుచు.
७-१६०-सीस पद्यमु
अडुगड्गुनकु माधवानुचिंतनसुधा; माधुर्यमुन मेनु मर्रचुवानि;
नंभोजगर्भादु लभ्यसिंपँग लेनि; हरिभक्तिपुंभाव मैनवानि;
मातृगर्भमुजोच्चि मन्नदि मोदलुगाँ; जित्त मच्युतुमीँदँ जेर्चुवानि;
नंकिंचि तनलोन नखिलप्रपंचंबु; श्रीविष्णुमय मनि चेलँगुवानि;
७-१६०.१-तेटगीति
विनयकारुण्यबुद्धिविवेकलक्ष
णादिगुणमुल काटपट्टयिनवानि;
शिष्यु बुधलोकसंभाव्युँ जीरि गुरुँडु
मुंदर्रिकि द्रोब्बि तंड्रिकि म्रोक्कु मनुचु.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :