Friday, November 27, 2015

ప్రహ్లాద చరిత్ర - అడుగడ్గునకు

7-160-సీస పద్యము
డుగడ్గునకు మాధవానుచింతనసుధా; మాధుర్యమున మేను ఱచువాని;
నంభోజగర్భాదు భ్యసింపఁగ లేని; రిభక్తిపుంభావ మైనవాని;
మాతృగర్భముజొచ్చి న్నది మొదలుగాఁ; జిత్త మచ్యుతుమీఁదఁ జేర్చువాని;
నంకించి తనలోన ఖిలప్రపంచంబు; శ్రీవిష్ణుమయ మని చెలఁగువాని;
7-160.1-తేటగీతి
వినయకారుణ్యబుద్ధివివేకలక్ష
ణాదిగుణముల కాటపట్టయినవాని;
శిష్యు బుధలోకసంభావ్యుఁ జీరి గురుఁడు
ముందఱికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కు మనుచు.
            ప్రహ్లాదుడు ప్రతిక్షణమూ, అడుగడుక్కీ విష్ణువును ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మాధుర్యంలో తన్ను తాను మైమఱుస్తూ ఉంటాడు. అతను బ్రహ్మా వంటి వారికైనా కూడా అలవి కాని హరి భక్తి రూపందాల్చిన బాలకునిలా ఉంటాడు. తల్లి కడుపులో ప్రవేశించి నప్పటినుంచీ కూడా అతని మనస్సు అచ్యుతుడు విష్ణువు మీదే లగ్నం చేసి ఉంటోంది. అతడు చక్కగా విచారించి ఈ లోకములు అన్నీ విష్ణుమయములే అని తన మనస్సు లో ధృఢంగా నమ్మేవాడు. అతడు అణకువ, దయ మొదలగు సర్వ సుగుణములు నిండుగా ఉన్న వాడు. జ్ఞానులుచే చక్కగా గౌరవంతో తలచబడేవాడు. అంతటి ఉత్తముడైన తన శిష్యుడు ప్రహ్లాదుడిని పిలిచి, తండ్రి ముందుకు నెట్టి, నమస్కారం చెయ్యమని చెప్తూ, హిరణ్యకళిపుడితో ఇలా అన్నారు.
          అడగడ్గున్ = ప్రతిక్షణము; కున్ = నందును; మాధవ = నారాయణుని; అనుచింతనా = ధ్యానించుట యనెడి; సుధా = అమృతము యొక్క; మాధుర్యమున్ = తీయదనముచే; మేను = శరీరమును; మఱచు = మరిచిపోవు; వానిన్ = వానిని; అంభోజగర్భ = బ్రహ్మదేవుడు {అంభోజగర్భుడు - అంభోజము (పద్మము)నందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఆదుల్ = మొదలగువారుకూడ; అభ్యసింపగలేని = నేర్చుకొనలేని; హరి = నారాయణుని; భక్తి = భక్తి; పుంభావము = పురుషరూపుదాల్చిన; వానిన్ = వానిని; మాతృ = తల్లి యొక్క; గర్భమున్ = గర్భములో; చొచ్చి = ప్రవేశించి; మన్నది = జీవంపోసుకున్నది; మొదలుగాన్ = నుండి మొదలెట్టి; చిత్తమున్ = మనసును; అచ్యుతు = నారాయణుని {అచ్యుతుడు - చ్యుతము (జారిపోవుట) లేనివాడు, విష్ణువు}; మీదన్ = పైన; చేర్చు = లగ్నముచేయు; వానిన్ = వానిని; అంకించి = భావించి; తన = తన; లోనన్ = అందే; అఖిల = సమస్తమైన; ప్రపంచంబున్ = విశ్వమును; శ్రీ = సంపత్కరమైన; విష్ణు = నారాయణునితో; మయము = నిండినది; అని = అని; చెలగు = చెలరేగెడి; వానిన్ = వానిని.
          వినయ = అణకువ; కారుణ్య = భూతదయ; బుద్ధి = మంచిబుద్ధులు; వివేకలక్షణ = వివేచనాశక్తి; ఆది = మొదలగు; గుణముల్ = సుగుణముల; కున్ = కు; ఆటపట్టు = విహారస్థానము; అయిన = ఐన; వానిన్ = వానిని; శిష్యున్ = శిష్యుని (ప్రహ్లాదుని); బుధ = జ్ఞానులు; లోక = అందరిచేతను; సంభావ్యున్ = గౌరవింపదగినవానిని; చీరి = పిలిచి; గురుడు = గురువు; ముందఱి = ముందరి; కిన్ = కి; ద్రొబ్బి = తోసి, గెంటి; తండ్రి = తండ్రి; కిన్ = కి; మ్రొక్కుము = నమస్కరించుము; అనుచున్ = అనుచు.
७-१६०-सीस पद्यमु
अडुगड्गुनकु माधवानुचिंतनसुधा; माधुर्यमुन मेनु मर्रचुवानि;
नंभोजगर्भादु लभ्यसिंपँग लेनि; हरिभक्तिपुंभाव मैनवानि;
मातृगर्भमुजोच्चि मन्नदि मोदलुगाँ; जित्त मच्युतुमीँदँ जेर्चुवानि;
नंकिंचि तनलोन नखिलप्रपंचंबु; श्रीविष्णुमय मनि चेलँगुवानि;
७-१६०.१-तेटगीति
विनयकारुण्यबुद्धिविवेकलक्ष
णादिगुणमुल काटपट्टयिनवानि;
शिष्यु बुधलोकसंभाव्युँ जीरि गुरुँडु
मुंदर्रिकि द्रोब्बि तंड्रिकि म्रोक्कु मनुचु.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: