Thursday, May 28, 2015

కుంతి స్తుతి - నిను జింతించుచు

1-198-మ.
నినుఁ జింతించుచుఁ బాడుచుం బొగడుచున్ నీ దివ్యచారిత్రముల్
వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్ప దాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా!
              నినున్ = నిన్ను; చింతించుచున్ = ధ్యానముచేస్తూ; పాడుచున్ = భజనలు పాడుతూ; పొగడుచున్ = కీర్తిస్తూ; నీ = నీ; దివ్య = దివ్యమైన; చారిత్రముల్ = కథలు; వినుచున్ = వింటూ; చూతురున్ = దర్శించగలుగుతారు; కాక = అంతే తప్ప; లోకులు = మానవులు; ఇతర = ఇతరమైన; అన్వేషంబులన్ = వెతుకులాటలవలన; చూతురే = దర్శించగలరా; ఘన = కరడుగట్టిన; దుర్జన్మ = చెడ్డజన్మల; పరంపరా = వరుసలను; హరణ = కృశింపజేయుటకు; దక్షంబు = సామర్థ్యము గలవి; ఐ = అయి; మహా = గొప్ప; యోగి = యోగుల; వాక్ = వాక్కులచే; వినుతంబు = స్తోత్రము చేయబడునవి; ఐన = అయినట్టి; భవత్ = నీయొక్క; పద = పాదములనే; అబ్జ = పద్మముల; యుగమున్ = జంటను; విశ్వేశ = విశ్వేశుడు - కృష్ణా {విశ్వమునకు ఈశ్వరుడు, కృష్ణ}; విశ్వంభరా = కృష్ణా {విశ్వంభరుడు - విశ్వమును భరించువాడు, కృష్ణ}.
            ఎల్లప్పుడు నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రాలే వింటూ ఉండే వారు మాత్రమే, విశ్వేశ్వరా! విశ్వంభరా! శ్రీకృష్ణా! దురంతాలైన జన్మపరంపరలను అంతం చేసేవీ, పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవీ అయిన నీ పాదపద్మాలను, దర్శించగలుగుతారు. అంతేతప్ప మరింకే ఇతర ప్రయత్నాలు ఫలవంతాలూ కావు.
1-198-mattEbha vikreeDitamu
ninuM~ jiMtiMchuchuM~ baaDuchuM bogaDuchun nee divyachaaritramul
vinuchuM jooturugaaka lOku litaraanvEShaMbulaM jooturE
ghana durjanma paraMparaa haraNa dakShaMbai mahaayOgi vaa
gvinutaMbaina bhavatpa daabjayugamun vishvEsha! vishvaMbharaa!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, May 27, 2015

కుంతి స్తుతి - మఱచి యజ్ఞాన

1-197-తే.
మఱచి యజ్ఞాన కామ కర్మములఁ దిరుగు
వేదనాతురులకుఁ దన్నివృత్తిఁ జేయ 
శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు
కొఱకు నుదయించి తండ్రు నిన్ గొంద ఱభవ!
              మఱచి = మర్చిపోయి; అజ్ఞాన = అజ్ఞనముతో; కామ = ఫలితమును కోరి చేయు; కర్మములన్ = కర్మములందు; తిరుగు = తిరుగుతుండే; వేదన = బాధలు; ఆతురులు = ఆతృతలు గలవారు; కున్ = కి; తత్ = వానినుండి; నివృత్తిన్ = నివారించుటను; చేయన్ = చేయు నిమిత్తము; శ్రవణ = (తన గురించి) వినుట; చింతన = ధ్యానించుట; వందన = నమస్కారము చేయుట; అర్చనములు = పూజించుటలు; ఇచ్చు = ఇచ్చుట; కొఱకున్ = కోసము; ఉదయించితి = అవతరించితివి; అండ్రు = అంటారు; నిన్ = నిన్ను; కొందఱు = కొందరు; అభవ = పుట్టుక లేనివాడా, కృష్ణా.
            కర్తవ్యం విస్మరించి, కామ్యకర్మలలో మునగి తేలుతూ, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తి పోగొట్టి, వారికి శ్రవణం, చింతనం, వందనం, అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం, పుట్టుకే లేని పురుషోత్తమ! శ్రీకృష్ణా! నీవు అవతరించావని కొందరి అభిప్రాయం.
1-197-tETageeti
maRrachi yaGyaana kaama karmamulaM~ dirugu
vEdanaaturulakuM~ dannivRittiM~ jEya
shravaNa chiMtana vaMdanaarchanamu lichchu
koRraku nudayiMchi taMDru nin goMda Rrabhava!

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, May 26, 2015

కుంతి స్తుతి - జలరాశినడుమ

1-196-క.
జలరాశి నడుమ మునిగెఁడు
కలము క్రియన్ భూరిభారకర్శితయగు నీ
యిలఁ గావ నజుఁడు గోరినఁ
గలిగితి వని కొంద ఱండ్రు, గణనాతీతా!
          జలరాశి = సముద్రము; నడుమ = మధ్యన; మునిగెఁడు = మునిగిపోతున్న; కలము = ఓడ; క్రియన్ = వలె; భూరి = అత్యంత; భార = భారముతో; కర్శిత = పీడితము; అగు = అయినట్టి; ఈ = ఈ; ఇలన్ = భూమిని; కావన్ = కాపాడుటంకోసం; అజుఁడు = బ్రహ్మ {అజుఁడు - భౌతిక జన్మము లేనివాడు, బ్రహ్మ}; కోరినన్ = కోరగా; కలిగితివి = అవతరించావు; అని = అని; కొందఱు = కొందరు; అండ్రు = అంటారు; గణనాతీతా = కృష్ణా {గణనాతీత - ఎంచుటకు అతీతమైన వాడు, కృష్ణుడు}.
            బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నట్టనడి సముద్రంలో మునిగిపోతున్న నావలాగ భరింపరాని బరువుతో క్రుంగిపోతున్న భూమండలాన్ని ఉద్ధరించటం కోసం, అంచనాలకి అందని అనంతా! శ్రీకృష్ణా! నీవు అవతారం ఎత్తావంటారు మరికొందరు.
1-196-kaMda padyamu
jalaraashi naDuma munigeM~Du
kalamu kriyan bhooribhaarakarshitayagu nee
yilaM~ gaava najuM~Du gOrinaM~
galigiti vani koMda RraMDru gaNanaateetaa!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, May 25, 2015

కుంతి స్తుతి - వసుదేవదేవకులు

1-195-క.
వసుదేవదేవకులు తా
పసగతి గతభవమునందుఁ బ్రార్థించిన సం
తసమునఁ బుత్త్రత నొందితి
వసురుల మృతి కంచుఁ గొంద ఱండ్రు, మహాత్మా!
          వసుదేవ = వసుదేవుడు; దేవకులు = దేవకీదేవులు; తాపస = తాపసుల యొక్క; గతిన్ = వృత్తితో; గత = పూర్వ; భవమునందున్ = జన్మలో; ప్రార్థించినన్ = ప్రార్థించుటవలన; సంతసమునన్ = సంతోషముతో; పుత్త్రతన్ = పుత్రుడుగా ఉండుట; ఒందితివి = వహించితివి; అసురుల = రాక్షసుల; మృతి = మృతి; కిన్ = కోసము; అంచున్ = అనుచు; కొందఱు = కొందరు; అండ్రు = అందురు; మహాత్మా = గొప్ప ఆత్మకలవాడా, కృష్ణా.
         పూర్వజన్మంలో అపూర్వమైన తపస్సు చేసి దేవకీ వసుదేవులు ప్రార్థించగా, మహానుభావా! శ్రీకృష్ణా! రాక్షస సంహారం కోసం ఆ పుణ్యదంపతులకు పుత్రుడవై పుట్టావని కొందరు చెబుతారు.
1-195-ka.
vasudEvadEvakulu taa
pasagati gatabhavamunaMduM~ braarthiMchina saM
tasamunaM~ buttrata noMditi
vasurula mRiti kaMchuM~ goMda RraMDru, mahaatmaa!

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :