Saturday, April 26, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 271

యవ పద్మాంకుశ

1-344-మ.
యవ పద్మాంకుశ చాప చక్ర ఝష రేఖాలంకృతంబైన మా
ధవు పాదద్వయ మింక మెట్టెడు పవిత్రత్వంబు నేఁ డాదిగా
నవనీకాంతకు లేదు పో? మఱి మదీయాంగంబు వామాక్షి బా
హువు లాకంపము నొందుచుండు నిల కేయుగ్రస్థితుల్ వచ్చునో
          నాయనా! భీమసేనా! గింజ-చక్ర-చాప-పద్మ-అంకుశాది శుభరేఖలతో అలంకృత మైన వాసుదేవుని పాదపద్మాల ముద్రలతో పావనమయ్యే అదృష్టం ఇక పైన ఈ భూదేవికి లేదేమో? నా అవయవాలు, ఎడం కన్నూ, ఎడం భుజం మాటిమాటికీ అదురుతున్నాయి. ఈ లోకానికి ఇంకా ఎలాంటి భీకర పరిస్థితులు రానున్నాయో కదా.
ధర్మరాజు దుర్నిమిత్త దుశ్శకునాలను కనుగొని భీమసేనునితో మాట్లాడుతున్నాడు.
1-344-ma.
yava padmaaMkuSa chaapa chakra jhasha raekhaalaMkRtaMbaina maa
dhavu paada dvaya miMka meTTeDu pavitratvaMbu nae@M Daadigaa
navaneekaaMtaku laedu pO? maRi madeeyaaMgaMbu vaamaakshi baa
huvu laakaMpamu noMduchuMDu nila kaeyugrasthitul vachchunO
          యవ = యవలు వంటి (ధాన్యంగింజ వంటి); పద్మ = పద్మముల వంటి; అంకుశ = అంకుశమువం టి {అంకుశము - ఏనుగు కుంభ స్థలమును పొడచుటకు వాడు ఆయుధము}; చాప = ధనుస్సు వంటి; చక్ర = చక్రము వంటి; ఝష = చేప వంటి; రేఖా = రేఖలతో; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐన = అయినట్టి; మాధవు = మాధవిభర్త / కృష్ణుని {మాధవుడు – మాధవి భర్త, హరి }; పాద = పాదముల; ద్వయము = జంట; ఇంకన్ = ఇంక; మెట్టెడు = త్రొక్కుట వలని; పవిత్రత్వంబున్ = పవిత్రత కలుగుటలు; నేఁడు = ఈ దినము; ఆదిగాన్ = మొదలెట్టి; అవనీకాంత = భూదేవి; కున్ = కి; లేదు పోమఱి = లేదేమో మరి; మదీయ = నా యొక్క; అంగంబున్ = అవయవములును; వామ = ఎడమ ప్రక్క; అక్షి = కన్నును; బాహువులు = బాహువును; ఆకంపము = అదురుట; ఒందుచుండున్ = కలుగుచున్నది; ఇల = భూమి; కున్ = కి; ఏ = ఏ; ఉగ్ర = భయంకరమైన; స్థితుల్ = పరిస్థితులు; వచ్చునో = వచ్చునో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

తెలుగు భాగవత తేనె సోనలు – 270

వరచేలంబులొ


8-550-మ.

వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!
          ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుర్రాలా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా?
 అంటు బలిచక్రవర్తి తనను అడగటానికి వచ్చిన వామనుని అడుగుతున్నాడు.
8-550-ma.
varachaelaMbulo maaDalO phalamulO vanyaMbulO gOvulO
harulO ratnamulO rathaMbulO vimRshTaannaMbulO kanyalO
karulO kaaMchanamO nikaetanamulO graamaMbulO bhoomulO
dharaNee khaMDamo kaaka yae maDigedO dhaatreesuraeMdrOttamaa!
          వర = మంచి; చేలంబులో = బట్టలు కాని; మాడలో = సువర్ణ నాణెములు కాని {మాడ – అర వరహా, ఒక సువర్ణనాణెము}; ఫలములో = పళ్ళు కాని; వన్యంబులో = వనములు కాని; గోవులో = పశువులు కాని; హరులో = గుర్రములు కాని; రత్నములో = మణులు కాని; రథంబులో = రథములు కాని; విమృష్టాన్నంబులో = మంచి ఆహారములు కాని; కన్యలో = స్త్రీలు కాని; కరులు = ఏనుగులు కాని; కాంచనమో = బంగారము కాని; నికేతనములో = ఇళ్ళు కాని; గ్రామంబులో = ఊళ్ళు కాని; భూములో = పొలములు కాని; ధరణీఖండమో = భూభాగము కాని; కాక = కాకపోతే; ఏమి = ఏది; అడిగెదో = అడిగెదవు; ధాత్రీసుర = బ్రాహ్మణ; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమా = ఉత్తముడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Friday, April 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 269

లేమా

10.2-172-క.

లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్.
          ఓ లేత వయసు చినదానా! సత్యభామా! మేము రాక్షసులను గెలవ లేమా ఏమి? నీ వెందుకు యుద్ధానికి సిద్ధపడుతున్నావు? ఇటురా. యుద్ధప్రయత్నం మానెయ్యి. మానకపోతే పోనీలే ఇదిగో ఈ విల్లు విలాసంగా అందుకో.
నరకాసుర వధ ఘట్టంలో శ్రీ కృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక, లేమా అనే పదంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన యిద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యనుప్రాస, రెండు అంతకన్న ఎక్కువ హల్లులు అర్థబేధంతో అవ్యవధానంగా వేస్తే  ఛేక. శబ్ద బేధం లేకుండా అర్థ బేధంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా రెండు అంత కన్నా ఎక్కువ హల్లులు అర్థబేధం శబ్దబేధం లేకుండా తాత్పర్య బేధంతో వేస్తే లాట.
10.2-172-ka.
laemaa! danujula geluva@Mga
laemaa? nee vaela kaDa@Mgi laechiti? viTu raa
lae maanu maana vaenin
lae maa villaMdikonumu leelaM gaelan.
          లేమా = చిన్నదానా {లేమ – లేత వయస్కురాలు, స్త్రీ}; దనుజులన్ = రాక్షసులను; గెలువగ = జయింప; లేమా = సమర్థులము కామా; నీవు = నీవు; ఏల = ఎందుకు; కడగి = యత్నించి; లేచితివి = నిలబడితివి; ఇటు = ఈ వైపునకు; రా = రమ్ము; లే = లెమ్ము; మాను = వదలివేయుము; మానవు = మానని; ఏనిన్ = పక్షమున; లే = లెమ్ము; మా = మా యొక్క; విల్లున్ = ధనుస్సు; అందికొనుము = పుచ్చుకొనుము; లీలన్ = విలాసముగా; కేలన్ = చేతితో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, April 24, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 268

లోపలి సౌధంబులోన

10.1-1709-సీ.

లోపలి సౌధంబులోన వర్తింపఁగాఁ
 దేవచ్చునే నిన్నుఁ దెత్తునేని
గావలివారలఁ గల బంధువులఁ జంపి
 కాని తేరా దని కమలనయన!
భావించెదేని యుపాయంబు చెప్పెద
 నాలింపు కులదేవయాత్రఁ జేసి
నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ
 బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతుఁ
తే.
నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
సతికి మ్రొక్కంగ నీవు నా సమయమందు
వచ్చి గొనిపొమ్ము నన్ను నవార్యచరిత!
          ఓ కమలాల వంటి కన్నులున్న కన్నయ్యా! “నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా, రుక్మిణీ ! నిన్నెలా తీసుకుపోవాలి. అలా తీసుకెళ్ళాలంటే కాపలావాళ్ళను, అప్పు డక్కడ యున్న బంధుజనాలను చంపాల్సివస్తుంది కదా” అని నీవు అనుకుంటే, దీనికి యొక యుపాయం మనవి చేస్తాను. చిత్తగించు. పెళ్ళికి ముందు మా వారు పెళ్ళికూతురును  మా యిలవేల్పు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేనుకూడ అలాగే అంతఃపురం వెలువడి మొక్కుచెల్లించడానికి ఊరి వెలుపల యున్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. అడ్డగింపరాని నడవడిక కలవాడా! కృష్ణా! ఆ సమయానికి వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొనిపో!
10.1-1709-see.
lOpali saudhaMbulOna vartiMpaMgaa@M
 daevachchunae ninnu@M dettunaeni
gaavalivaarala@M gala baMdhuvula@M jaMpi
 kaani taeraa dani kamalanayana!
bhaaviMchedaeni yupaayaMbu cheppeda
 naaliMpu kuladaevayaatra@M jaesi
nagaraMbu veluvaDi nagajaatakunu mrokka@M
 beMDliki munupaDa@M beMDlikoo@Mtu@M
tae.
nelami maavaaru paMpudu raenu naTlu
puramu veluvaDi yaeteMchi bhootanaathu
satiki mrokkaMga neevu naa samayamaMdu
vachchi gonipommu nannu navaaryacharita!
          లోపలి = లోపలికి ఉన్న; సౌధంబు = అంతఃపురము; లోనన్ = అందు; వర్తింపంగా = తిరుగుచుండగా; తేవచ్చునే = తీసుకురాగలమా; నిన్నున్ = నిన్ను; తెత్తునేని = తీసుకొచ్చినను; కావలివారలన్ = కాపలాదారులను; కల = అక్కడున్న; బంధువులన్ = చుట్టములను; చంపి = సంహరించి; కాని = కాని; తేరాదు = తీసుకురాలేము; అని = అని; కమలనయన = పద్మాక్షుడా, కృష్ణా; భావించెదేని = తలచెడి పక్షమున; ఉపాయంబు = సుళువు మార్గమును; చెప్పెదన్ = తెలిపెదను; ఆలింపు = వినుము; కులదేవ = ఇలవేల్పుని కొలుచుట కైన; యాత్ర = ప్రయాణము; చేసి = అయ్యి; నగరంబు = అంతఃపురము; వెలువడి = బయలుదేరి; నగజాత = పార్వతీదేవి; కును = కి; మ్రొక్కన్ = పూజించుటకు; పెండ్లి = వివాహమున; కిన్ = కు; మునుపడన్ = ముందుగా; పెండ్లికూతున్ = పెళ్ళికూతురును; ఎలమి = ప్రీతితో; మావారు = మావాళ్ళు; పంపుదురు = పంపించెదరు; ఏనున్ = నేనుకూడ; అట్లు = ఆ విధముగనే; పురము = అంతఃపురము; వెలువడి = బయలుదేరి; ఏతెంచి = వచ్చి; భూతనాథుసతి = పార్వతీదేవి {భూతనాథుసతి - భూతనాథు (శివు)ని సతి, పార్వతి}; కిన్ = కి; మ్రొక్కగన్ = పూజించుచుండగా; నీవున్ = నీవు; ఆ = ఆ యొక్క; సమయము = సమయము; అందున్ = అందు; వచ్చి = చేరవచ్చి; కొనిపొమ్ము = తీసుకెళ్ళుము; నన్నున్ = నన్ను; అవార్యచరిత = అడ్డగింపరాని వర్తన గల వాడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~