Wednesday, September 25, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 66



aTamaTamayye

1-374-చ.
అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు సూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటం
బటుతర దేహలోభమునఁ బ్రాణము లున్నవి వెంటఁబోక నేఁ
గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో?
1-374-cha.
aTamaTamayye naa bhajana maMtayu bhoovara! nae@MDu sooDumaa
yiTuvale gaaraviMchu jagadeeSu@MDu gRshNu@MDu laeni pimmaTaM
baTutara daehalObhamuna@M braaNamu lunnavi veMTa@MbOka nae@M
gaTakaTa! poorvajanmamuna@M garmamu leTTivi chaesinaa@MDanO?
          అర్జునుడు అన్న ధర్మరాజుకి కృష్ణ నిర్యాణం చెప్తున్నాడు – అయ్యయ్యో నా సేవ అంతా నిరర్థకం అయిపోయింది మహాప్రభో! చూడు ఇవాళ, ఇలా ఆప్యాయంగా నన్ను ఆదరించే విశ్వేశ్వరుడు శ్రీకృష్ణుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక కూడ ఇంకా నాప్రాణాలు ఆయన వెంట పోకుండ ఉన్నాయి. దేహం మీద ఇంతటి లోభం ఉందంటే పూర్వ జన్మలలో ఎంతటి పాపకృత్యాలు చేసానో కదా.
          అటమటము = గజిబిజి / వృథా; అయ్యెన్ = అయ్యెను; నా = నా యొక్క; భజనము = పూజలు; అంతయు = మొత్తము అంతా; భూవర = భూమికి భర్తా / రాజా; నేఁడు = ఇవాళ; సూడుమా = చూడవోయి; ఇటువలె = ఇలా; గారవించు = ఆదరించు / గారాబము చేయు; జగధీశుఁడు = జగత్తునకు ఈశుడు; కృష్ణుఁడు = కృష్ణుడు; లేని = లేకపోయిన; పిమ్మటన్ = తరువాత కూడ; పటుతర = చాలా గట్టిదైన {పటు - పటుతరము - పటుతమము}; దేహ = శరీరము మీది; లోభమునన్ = పిసినారితనముతో / మమకారముతో; ప్రాణములు = ప్రాణములు; ఉన్నవి = ఉన్నవి; వెంటన్ = కూడా; పోకన్ = వెళ్ళకుండగనే; నేన్ = నేను కటకట = అయ్యయ్యో; పూర్వ = క్రిందటి; జన్మమునన్ = జన్మలలో; కర్మములు = పాపం పనులు; ఎట్టివి = ఎలాంటివి; చేసినాఁడనో = చేసానో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Tuesday, September 24, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 65



10.1-315 i mmaguva

10.1-315-క.

ఇ మ్మగువ తన్ను వాకిటఁ
గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం
గెమ్మావిఁ గఱచి వడిఁ జనె
నమ్మా! యీ ముద్దు కుఱ్ఱఁ డల్పుఁడె? చెపుమా.
10.1-315-ka.
i mmaguva tannu vaakiTa@M
grummaruchO@M jeeri nilipikoni pae raDugaM
gemmaavi@M ga~rachi vaDi@M jane
nammaa! yee muddu ku~r~ra@M Dalpu@MDe? chepumaa.
            గొల్ల వెలదులు వెన్నదొంగ వేషాలు వివరాలు యశోదకు చెప్తున్నారు – నీ కొడుకు వాకిట్లో తిరుగు తుండగా చూసి ఈవిడ పిలిచి “నీ పేరేంటి బాబు” అని అడిగింది. మీ వాడు చటుక్కున ఆమె ఎర్రని పెదవి కొరికి తుర్రుమని పారిపోయాడు. ఇప్పుడు చెప్ప వమ్మా! ముద్దుగారే ఈ కుర్రాడు చిన్నాడా.


            ఈ = ఈ; మగువ = ఇల్లాలు; తన్నున్ = అతనిని; వాకిటన్ = ఇంటి గుమ్మం ముందు; క్రుమ్మరుచోన్ = తిరుగు చుండగా; చీరి = పిలిచి; నిలిపికొని = నిల బెట్టి; పేరున్ = నామమును; అడుగన్ = ఏమి టని అడుగగా; కెంపు = ఎర్రని; మోవిన్ = పెదవిని; కఱచి = కరచి; వడిన్ = వేగముగా; చనెన్ = వెళ్ళిపోయెను; అమ్మా = తల్లీ; ఈ = ఈ; ముద్దు = మనోజ్ఞ మైన; కుఱ్ఱడు = పిల్ల వాడు; అల్పుడె = తక్కువ వాడా, కాదు; చెపుమా = తెలుపుము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, September 23, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 63



2-95 yaj~naaMgi

2-95-క.
యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు
యజ్ఞేశుఁడు యజ్ఞకర్త యగు భగవంతున్
యజ్ఞపురుషుఁగా మానస
యజ్ఞముఁ గావించితిం ద దర్పణ బుద్ధిన్.
          బ్రహ్మదేవుడు నారదునికి విశ్వ ప్రకారం వివరించి చెప్తున్నాడు – యజ్ఞం శరీర మైన వాడు, యజ్ఞానికి ఫలితా న్నిచ్చే వాడు, ప్రభువు, కర్తా అయినట్టి ఆ భగవంతుని యజ్ఞ పురుషునిగా చేసుకొన్నాను. ఆ యజ్ఞాన్ని ఆయనకే అర్పించా లనే బుద్ధితో మానసయజ్ఞం చేశాను. ఇది నారయ పూరించిన భాగంలోని దని అంటారు.
2-95-ka.
yaj~naaMgi yaj~naphaladu@MDu
yaj~naeSu@MDu yaj~nakarta yagu bhagavaMtun^
yaj~napurushu@Mgaa maanasa
yaj~namu@M gaaviMchitiM dadarpaNa buddhin^.
          యజ్ఞాంగిన్ = యజ్ఞం శరీరంగా కల వాడు; యజ్ఞ = యజ్ఞమునకు; ఫలదుడున్ = ఫలములు ఇచ్చు వాడు; యజ్ఞేశుడు = యజ్ఞమునకు ప్రభువు; యజ్ఞ = యజ్ఞమునకు; కర్త = చేయు వాడు; అగు = అయిన; భగవంతున్ = విష్ణుమూర్తిని; యజ్ఞ = యజ్ఞ; పురుషుఁగా = స్వరూపునిగా; మానస = మనస్సులో చేయు; యజ్ఞమున్ = యజ్ఞమును; కావించితిన్ = చేసితిని; తత్ = అతనికే; అర్పణ = సమర్పిస్తున్న; బుద్ధిన్ = బుద్ధితో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~