Thursday, December 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౮(698)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-87-సీ.
కాక ఘూకంబులు గనకసౌధములలోఁ-
  బగలు వాపోయెడి బహువిధముల
నశ్వవాలములందు ననల ముద్భవ మయ్యె-
  నన్నంబు మొలిచె మహాద్భుతముగ
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల-
  జంతువు వేఱొక్క జంతువుఁ గనె
నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె-
  బెరసెఁ గావిరి రవిబింబ మపుడు.
11-87.1-తే.
గాన నుత్పాతములు సాలఁ గానఁబడియె
నరయ నిందుండ వలవదు యదువులార!
తడయ కిపుడ ప్రభాసతీర్థమున కరుగుఁ
డనుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె.

భావము:
శ్రీకృష్ణుడు యాదవులను ఇలా హెచ్చరించాడు. “ఓ యాదవులార! కాకులూ గుడ్లగూబలూ బంగారు మేడలలో పగలు అనేక రకాలుగా ఏడుస్తున్నాయి. గుఱ్ఱపుతోకలకు మంటలు పుడుతున్నాయి. చిలుకలు గోరువంకలు రాత్రిపూట వికృతస్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జాతి జంతువును కంటున్నది, పౌరుల నివాసగృహాలలో మిణుగుఱులు పుడుతున్నాయి. సూర్యబింబాన్ని కావిరి కమ్ముకుంటోంది. ఇలా చాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. కనుక, మీరంతా ఇక్కడ ఉండద్దు. శీఘ్రమే ప్రభాసతీర్థానికి వెళ్ళండి.” అని కృష్ణుడు చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=15&Padyam=87

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, December 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౭(697)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-85-తే.
అఖిలలోకేశ! సర్వేశ! యభవ! నీవు
నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ
బంచవింశోత్తర శతాబ్దపరిమితంబు
నయ్యె విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు.
11-86-వ.
అనినఁ గమలభవ భవ ముఖ నిఖిల సురగణంబుల వచనంబు లియ్యకొని కృష్ణుండు వారితోడ “యాదవుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె వచ్చెదం బొం” డని చెప్పి వీడ్కొలిపినఁ గమలాసనాదిబృందారకులు నిజస్థానంబులకుం జని రంత.

భావము:
“సర్వలోకాధినాథ! సర్వేశ్వర! పుట్టుక లేని వాడ! నీవు భూలోకంలో పుట్టడము, భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికి నూటఇరవైఐదు సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠభవనానికి వేంచేయి.” అంటూ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు సమస్త దేవతలు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. వారి ప్రార్థన అంగీకరించిన హరి, వాళ్ళతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాలు కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి యిదే వస్తాను. మీరు వెళ్ళండి” అని చెప్పి వాళ్ళందరికి వీడ్కొలు ఇచ్చాడు. ఆ బ్రహ్మాదేవుడు మున్నగు దేవతలు తమతమ స్థానాలకు వెళ్ళారు. అటుపిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&Padyam=86

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday, December 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౬(696)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-83-క.
సుర గరుడ ఖచర విద్యా
ధర హర పరమేష్ఠి ముఖ సుధాశనులు మునుల్‌
సరసిజనయనునిఁ గనుఁగొన
నరుదెంచిరి ద్వారవతికి నతిమోదమునన్‌.
11-84-క.
కని పరమేశుని యాదవ
వనశోభిత పారిజాతు వనరుహనేత్రున్‌
జనకామిత ఫలదాయకు
వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్‌.

భావము:
“ఓ రాజా! శ్రద్ధగా విను. సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు మునులు పద్మాక్షుడు శ్రీకృష్ణుని చూడడానికి మిక్కిలి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు. అలా వచ్చి దర్శించుకుని, యాదవవంశం అనే ఉద్యానవనంలో ప్రకాశించే పారిజాతం వంటివాడు, జనులు కోరిన ఫలాలను ఇచ్చేవాడు అయిన పద్మాక్షుని దేవతలు వేదసూక్తాలతో వినుతించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&Padyam=84

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౫(695)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-82-వ.
అట్లుగావున లోకరక్షణార్థంబు గృష్ణుండవతారంబునొందె” నని హరి భక్తిపరంబు లగు నుపాఖ్యానంబులు నారదుం డుపన్యసించిన విని విస్మితచిత్తులై దేవకీవసుదేవులుగృష్ణుని పరమాత్మునిగా విచారించి” రని శుకుండు రాజునకుం జెప్పిన నతండు “మునీంద్రా! యదువుల నే ప్రకారంబున హరి హరియించె? సపరివారు లగు బ్రహ్మరుద్రేంద్రదిక్పాలకమునీంద్రులు ద్వారకానగర ప్రవేశం బెట్లు సేసిరి? యేమయ్యె? మఱియుఁ బరమేశ్వర కథామృతంబు వీనులలరం జవిగొనియు, నింకం దనివి సనదు; భక్తరక్షకుండగు హరి చారిత్రం బేరీతిఁ జాగెఁ? దర్వాతి వృత్తాంతం బంతయు నెఱింగింపు' మనిన శుకుం డిట్లనియె.

భావము:
ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.” అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తుతో చెప్పగా అతడు “మునీంద్రా! భూభారాన్ని తగ్గించటం కోసం ఏ విధంగా కృష్ణుడు యాదవులను తుదముట్టించాడు? బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు; ఋషీశ్వరులు తమ పరివారాలతో ద్వారకానగరాన్ని ఎలా ప్రవేశించారు? అటు పిమ్మట ఏమయింది? వివరంగా చెప్పండి. విష్ణు కథామృతం చెవులారా ఎంత విన్నా, తృప్తికలగటం లేదు. భక్తరక్షకుడైన శ్రీహరిచరిత్ర ఏ రీతిగా కొనసాగింది? ఈ వృత్తాంతమంతా తెలియజెప్ప” మని అడుగగా శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=82

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, December 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౪(694)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-80-సీ.
కమలాక్షపదభక్తి కథనముల్‌ వసుదేవ!-
  విని యఘంబులఁ బాసి వెలసి తీవు
భువనప్రసిద్ధిగాఁ బొలుపొందు సత్కీర్తి-
  కైవల్యలక్ష్మియుఁ గలుగు మీఁద
నారాయణుండు నీ నందనుం డను మోహ-
  మెడలించి విష్ణుగాఁనెఱిఁగి కొలువు
మతఁడు నీ తనయుఁడై యవతరించుటఁజేసి-
  సిద్ధించె దేహసంశుద్ధి నీకు
11-80.1-తే.
సరససల్లాప సౌహార్ధ సౌష్ఠవమునఁ
బావనంబైతి; శిశుపాల, పౌండ్ర, నరక,
ముర, జరాసంధ, యవనులు, ముదముతోడ
వాసుదేవునిఁ జెందిరి వైరు లయ్యి.
11-81-క.
దుష్టజన నిగ్రహంబును
శిష్టప్రతిపాలనంబు సేయన్‌ హరి దా
సృష్టి నవతార మొందెను
స్రష్టృముఖానేక దివిజసంఘము వొగడన్‌.

భావము:
“వసుదేవా! కమలలోచనుని కథలు విన్నావు కనుక, నీ పాపాలు తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు ప్రఖ్యాత మౌతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటంవలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడ ముక్తిని పొందారు. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు ప్రార్థించగా, దుష్టజనులను శిక్షించడానికి; శిష్టజనులను రక్షించడానికి; శ్రీహరి భూమిమీద అవతరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=80

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౩(693)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-79-వ.
ఇవ్విధంబునఁ బ్రశంసింపఁదగిన కావేర్యాది మహానదీపావనజల స్నాన పాన దానంబులను, విష్ణుధ్యానకథాసుధార సానుభవంబుల నిరూఢులగు భాగవతోత్తములు గలిగిరేనిం జెడని పదంబునుం బొందుదు” రని ఋషభకుమారులు భగవత్ప్రతిబింబంబు లయిన పరమపురుషులుం బోలె విదేహజనపాలునకు నిశ్శ్రేయః పదప్రాప్తికరంబు లైన భగవద్భక్తి ధర్మంబు లుపదేశించి యంతర్ధానంబు నొందిరి; మిథిలేశ్వరుండును జ్ఞానయోగం బంగీకరించి నిర్వాణపదంబు నొందె; నీ యుపాఖ్యానంబు వ్రాసినఁ బఠించిన వినిన నాయురారోగ్యైశ్వర్యములు గలిగి పుత్త్ర పౌత్త్ర వంతులై సకల కలికల్మష రహితులై విష్ణులోక నివాసు లగుదు” రని నారదుండు వసుదేవునకుం జెప్పి మఱియును.

భావము:
ఈవిధంగా ప్రశంసించదగిన కావేరి మున్నగు మహనదుల పావనజలాలలో స్నానం చేయటంలోను, దానాలు చేయటంలోను, విష్ణుధ్యానంలోను, హరికథామృత రసానుభవంలోను నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు” అని చెప్పారు. భగవంతుని ప్రతిబింబాలయిన పరమపురుషుల వంటి వారైన ఋషభకుమారులు, విదేహమహారాజుకి మోక్షపదంపొందే భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించి అంతర్ధానమైపోయారు. మిథిలాపతి విదేహుడు జ్ఞానయోగాన్ని అంగీకరించి నిర్వాణపదాన్నిపొందాడు. ఈ విదేహ ఋషభ ఉపాఖ్యానాన్ని వ్రాసినా చదివినా విన్నా ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యమూ కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సమస్తమైన కలికల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు.” అని నారదుడు వసుదేవుడికి చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=79

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౬౯౨(692)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-78-తే.
ద్రవిడ దేశంబునందులఁ దామ్రపర్ణి
సహ్యజా కృతమాలాది సకలనదుల
కెవ్వఁ డేనిని భక్తితో నేఁగి యచటఁ
బొదలి తర్పణ మొగిఁ జేయఁ బుణ్య మొదవు.

భావము:
ద్రావిడదేశంలో తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=78

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..