Sunday, December 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౪(694)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-80-సీ.
కమలాక్షపదభక్తి కథనముల్‌ వసుదేవ!-
  విని యఘంబులఁ బాసి వెలసి తీవు
భువనప్రసిద్ధిగాఁ బొలుపొందు సత్కీర్తి-
  కైవల్యలక్ష్మియుఁ గలుగు మీఁద
నారాయణుండు నీ నందనుం డను మోహ-
  మెడలించి విష్ణుగాఁనెఱిఁగి కొలువు
మతఁడు నీ తనయుఁడై యవతరించుటఁజేసి-
  సిద్ధించె దేహసంశుద్ధి నీకు
11-80.1-తే.
సరససల్లాప సౌహార్ధ సౌష్ఠవమునఁ
బావనంబైతి; శిశుపాల, పౌండ్ర, నరక,
ముర, జరాసంధ, యవనులు, ముదముతోడ
వాసుదేవునిఁ జెందిరి వైరు లయ్యి.
11-81-క.
దుష్టజన నిగ్రహంబును
శిష్టప్రతిపాలనంబు సేయన్‌ హరి దా
సృష్టి నవతార మొందెను
స్రష్టృముఖానేక దివిజసంఘము వొగడన్‌.

భావము:
“వసుదేవా! కమలలోచనుని కథలు విన్నావు కనుక, నీ పాపాలు తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు ప్రఖ్యాత మౌతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటంవలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడ ముక్తిని పొందారు. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు ప్రార్థించగా, దుష్టజనులను శిక్షించడానికి; శిష్టజనులను రక్షించడానికి; శ్రీహరి భూమిమీద అవతరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=80

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

No comments: