Monday, December 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౫(695)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-82-వ.
అట్లుగావున లోకరక్షణార్థంబు గృష్ణుండవతారంబునొందె” నని హరి భక్తిపరంబు లగు నుపాఖ్యానంబులు నారదుం డుపన్యసించిన విని విస్మితచిత్తులై దేవకీవసుదేవులుగృష్ణుని పరమాత్మునిగా విచారించి” రని శుకుండు రాజునకుం జెప్పిన నతండు “మునీంద్రా! యదువుల నే ప్రకారంబున హరి హరియించె? సపరివారు లగు బ్రహ్మరుద్రేంద్రదిక్పాలకమునీంద్రులు ద్వారకానగర ప్రవేశం బెట్లు సేసిరి? యేమయ్యె? మఱియుఁ బరమేశ్వర కథామృతంబు వీనులలరం జవిగొనియు, నింకం దనివి సనదు; భక్తరక్షకుండగు హరి చారిత్రం బేరీతిఁ జాగెఁ? దర్వాతి వృత్తాంతం బంతయు నెఱింగింపు' మనిన శుకుం డిట్లనియె.

భావము:
ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.” అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తుతో చెప్పగా అతడు “మునీంద్రా! భూభారాన్ని తగ్గించటం కోసం ఏ విధంగా కృష్ణుడు యాదవులను తుదముట్టించాడు? బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు; ఋషీశ్వరులు తమ పరివారాలతో ద్వారకానగరాన్ని ఎలా ప్రవేశించారు? అటు పిమ్మట ఏమయింది? వివరంగా చెప్పండి. విష్ణు కథామృతం చెవులారా ఎంత విన్నా, తృప్తికలగటం లేదు. భక్తరక్షకుడైన శ్రీహరిచరిత్ర ఏ రీతిగా కొనసాగింది? ఈ వృత్తాంతమంతా తెలియజెప్ప” మని అడుగగా శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=82

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

No comments: