Tuesday, December 15, 2020

శ్రీ కృష్ణ విజయము - 98

( ఉగ్రసేనుని రాజుగజేయుట )

10.1-1398-చ.
"అనఘ! యయాతి శాపమున యాదవ వీరులకున్ నరేశ్వరా
సనమున నుండరాదు; నృపసత్తమ! రాజవు గమ్ము భూమికిన్;
నినుఁ గొలువంగ నిర్జరులు నీ కరిఁబెట్టుదు రన్య రాజులం
బనిగొను టెంత; రమ్ము జనపాలనశీలివి గమ్ము వేడ్కతోన్."
10.1-1399-వ.
అని పలికి.
10.1-1400-క.
మన్నించి రాజుఁ జేసెను
వెన్నుఁడు సత్యావధాను విశ్రుతదానున్
సన్నుతమానున్ గదన
చ్ఛిన్నాహితసేను నుగ్రసేనున్ దీనున్.

భావము:
“ఓ పుణ్యాత్ముడా! ఉగ్రసేన రాజేంద్రా! యయాతి శాపం వలన ఎంతటి వీరులైనా యాదవులు రాజ్యపీఠం అధిష్టించడానికి వీలుకాదు. కాబట్టి, ఈ రాజ్యానికి నీవే రాజుగా ఉండు. మేము నిన్ను సేవిస్తూ ఉంటాము. దేవతలు సైతం నీకు కప్పం చెల్లిస్తారు. ఇక ఇతర రాజులు నీ ఆజ్ఞ శిరసావహిస్తా రని వేరుగా చెప్పనక్కర లేదు కదా. సంతోషంగా ప్రజలను పాలించడానికి సిద్ధంకా.” అలా పలికి సత్యనిష్ఠ కలవాడూ, దాతగా పేరుపొందిన వాడూ, అభిమానవంతు డని పొగడ్త కాంచినవాడూ, సమరంలో శత్రుసైన్యాలను సంహరించే వాడూ, గర్వం లేని వాడూ అయిన ఉగ్రసేనుడిని వాసుదేవుడు గౌరవించి మధురానగరానికి రాజుగా చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=167&padyam=1400

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, December 6, 2020

శ్రీ కృష్ణ విజయము - 97

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1394-క.
జననీజనకుల వృద్ధులఁ
దనయుల గురు విప్ర సాధు దారాదులనే
జనుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక
వనరును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్.
10.1-1395-వ.
అదియునుం గాక.
10.1-1396-శా.
కారాశాలల మా నిమిత్తము మిముం గంసుండు గారింపఁగా
వారింపంగ సమర్థతల్ గలిగియున్ వారింపఁగా లేక ని
ష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్యసంచారులన్
సారాతిక్షములార! మమ్ముఁ గొఱతల్ సైరించి రక్షింపరే."
10.1-1397-వ.
అని యిట్లు మాయామనుష్యుండైన హరి పలికిన పలుకులకు మోహితులై వారల నంకపీఠంబుల నిడుకొని కౌఁగిలించుకొని వారి వదనంబులు కన్నీటం దడుపుచుఁ బ్రేమపాశబద్ధులై, దేవకీవసుదేవు లూరకుండి; రంత వాసుదేవుండు మాతామహుండైన యుగ్రసేనుం జూచి.


భావము:
ఏ నరుడైతే తల్లితండ్రులను, వయోవృద్ధులనూ, భార్యాపిల్లలనూ, గురువులనూ, బ్రాహ్మణులనూ, సాధువులలు మొదలైనవారిని సమర్థుడై ఉండి కూడా పోషింపక ఏడుస్తుంటాడో, అలాంటి వాడు ఈ భూమి మీద బ్రతికున్న శవం వంటి వాడే. అంతేకాక జననీజనకులారా! మీరు మిక్కిలి ఓర్పు కలవారు. మా కారణంగా మిమ్మల్ని కంసుడు చెరసాలలో బంధించి, బాధిస్తూ ఉంటే, వారించే సామర్థ్యం ఉండి కూడా వారించని దయమాలినవాళ్ళం; క్రూరులం; మిక్కిలి కుటిలమైన నడత కల వాళ్ళం. మా లోపాలు సహించి మమ్మల్ని మన్నించండి.” అంటూ ఇలా పలికిన మాయామానుషవిగ్రహుడైన శ్రీకృష్ణుడి మాటలకు దేవకీవసుదేవులు మోహము చెందారు. వారు తమ పుత్రులను ఒడిలోకి తీసుకున్నారు; గట్టిగా ఆలింగనం చేసుకున్నారు; కన్నీళ్ళతో వారి తలలు తడిపారు; ప్రేమాతిశయం వలన మాటలు పెగలక మౌనం వహించారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగారైన ఉగ్రసేనుడితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1396

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 96

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1392-సీ.
"మమ్ముఁ గంటిరిగాని మా బాల్య పౌగండ-
  కైశోర వయసులఁ గదిసి మీర
లెత్తుచు దించుచు నెలమి మన్నించుచు-
  నుండు సౌభాగ్యంబు నొంద రైతి;
రాకాంక్ష గలిగియున్నది దైవయోగంబు-
  తల్లిదండ్రుల యొద్ద తనయు లుండి
యే యవసరమున నెబ్బంగి లాలితు-
  లగుచు వర్ధిల్లుదు రట్టి మహిమ
10.1-1392.1-తే.
మాకు నిన్నాళ్ళు లే దయ్యె మఱియు వినుఁడు
నిఖిల పురుషార్థహేతువై నెగడుచున్న
మేని కెవ్వార లాఢ్యులు మీరకారె
యా ఋణముఁ దీర్ప నూఱేండ్లకైనఁ జనదు.
10.1-1393-క.
చెల్లుబడి గలిగి యెవ్వఁడు
తల్లికిఁ దండ్రికిని దేహధనముల వృత్తుల్
చెల్లింపఁ డట్టి కష్టుఁడు
ప్రల్లదుఁ డామీఁద నాత్మపలలాశి యగున్.

భావము:
“అమ్మా! నాన్నా! మమ్మల్ని కన్నారు కానీ, మా బాల్య, పౌగండ, శైశవ ప్రాయాలలో ప్రేమగా ఎత్తుకుంటూ, దింపుతూ, లాలించి పాలించే భాగ్యాన్ని మీరు పొందలేదు. కోరిక ఉండి కూడా దైవయోగము చేత అది తీరలేదు. తలితండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఎప్పుడూ బుజ్జగింప బడుతూ ఎలా ఎదుగుతారో, అలాంటి అదృష్టం మా కిన్నాళ్ళూ లేకపోయింది. ధర్మార్ధకామమోక్షము లనే పురుషార్థములు సాధించడానికి కారణమైన ఈ శరీరాలకు కర్త లెవరు? జననీజనకులైన మీరే కదా! ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి నూరేండ్లయినా సరిపోదు. ఎవడైతే సమర్థత కలిగి ఉన్నా కూడా తన శరీరంతో ధనంతో తన తల్లితండ్రులకు సేవచేయడో, అలాంటి వాడు కష్టుడు దుష్టుడు. వాడు చచ్చాక తన మాంసం తానే తింటాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1392

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, December 5, 2020

శ్రీ కృష్ణ విజయము - 95

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1390-వ.
అని విలపించుచున్న రాజవల్లభల నూరార్చి, జగద్వల్లభుండైన హరి కంసాదులకుం బరలోకసంస్కారంబులు చేయం బనిచి దేవకీ వసుదేవుల సంకలియలు విడిపించి, బలభద్ర సహితుండై వారలకుం బ్రణామంబులు జేసిన.
10.1-1391-మ.
కని లోకేశులుగాని వీరు కొడుకుల్గారంచుఁ జిత్తంబులన్
జనయిత్రీ జనకుల్ విచారపరులై శంకింపఁ గృష్ణుండు దా
జనసమ్మోహినియైన మాయఁ దదభిజ్ఞానంబు వారించి యి
ట్లనియెన్ సాగ్రజుఁడై మహావినతుఁడై యానందసంధాయియై. 

భావము:
అలా ఏడుస్తున్న రాజు భార్యలను ఓదార్చి, లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైన వారికి ఉత్తరక్రియలు చేయమని ఆదేశించాడు. పిమ్మట, దేవకీవసుదేవులను చెర విడిపించి, బలరాముడు తను కలిసి వారికి నమస్కారాలు చేయగా తల్లితండ్రులైన దేవకీవసుదేవులు తమ పుత్రులను చూసి “వీరు సకల లోకాలకు ప్రభువులు తప్ప సాధారణ మానవులు కారు” అని ఆలోచిస్తూ తమ మనసులలో సంశయ పడసాగారు. అప్పుడు, శ్రీకృష్ణుడు జనులను సమ్మోహింప జేసే మాయాశక్తిని ప్రయోగించి, వారి ఎరుకను మరుగు పరచి, అన్న బలభద్రుడుతో కూడి వచ్చి మిక్కిలి వినయంతో ఆనందాలు పంచుతూ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1391

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 94

( కంసుని భార్యలు విలపించుట )

10.1-1388-క.
భూతముల కెగ్గుచేసిన
భూతంబులు నీకు నెగ్గు పుట్టించె వృథా
భూత మగు మనికి యెల్లను
భూతద్రోహికిని శుభము పొంద దధీశా!
10.1-1389-క.
గోపాలకృష్ణుతోడను
భూపాలక! మున్ను తొడరి పొలిసినవారిన్
నీ పాల బుధులు చెప్పరె
కోపాలస్యములు విడిచి కొలువం దగదే."

భావము:
ప్రాణులకు నీవు కీడుచేయగా, ఆ ప్రాణులే నీకు కీడు చేశాయి. ప్రాణులకు ద్రోహం చేసినవాడికి మేలు కలుగదు. బ్రతు కంతా వ్యర్థమవుతుంది. కంసమహారాజా! భూమండలాన్ని ఏలే వాడవు కదా. గోవుల పాలించే వాడైన శ్రీకృష్ణుడిని ఇంతకు ముందు ఎదిరించిన వారందరూ మరిణించిన విషయం బుద్ధిమంతులు ఎవరూ నీకు చెప్పలేదా? క్రోధము జడత్వమూ వదలిపెట్టి గోవిందుని సేవించవలసింది కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=165&padyam=1389

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, December 2, 2020

శ్రీ కృష్ణ విజయము - 93

( కంసుని భార్యలు విలపించుట )

10.1-1386-వ.
అంతం గంసాదుల కాంతలు భర్తృమరణదుఃఖాక్రాంతలై కరంబుల శిరంబులు మోదికొనుచు నశ్రుసలిలధారాపరిషిక్త వదనలై సదనంబులు వెలువడి వచ్చి వీరశయ్యా నిద్రితులైన విభులం గౌఁగిలించుకొని సుస్వరంబుల విలపించి; రందుఁ గంసు భార్య లిట్లనిరి.
10.1-1387-సీ.
"గోపాలసింహంబు గోపించి వెల్వడి-
  నిను గజేంద్రుని భంగి నేడు గూల్చె
యాదవేంద్రానిల మాభీలజవమున-
  నిను మహీజము మాడ్కి నేల వ్రాల్చె
వాసుదేవాంభోధి వారి యుద్వేలమై-
  నిను దీవి కైవడి నేడు ముంచె
దేవకీసుతవజ్రి దేవత లలరంగ-
  నినుఁ గొండ క్రియ నేడు నిహతుఁ జేసె
10.1-1387.1-తే.
హా! మనోనాథ! హా! వీర! హా! మహాత్మ!
హా! మహారాజ! నీ విట్లు హతుఁడవైన
మనుచు నున్నార మక్కట! మమ్ముఁ బోలు
కఠినహృదయలు జగతిపైఁ గలరె యెందు?

భావము:
అంతట కంసుడు మొదలగువారి భార్యలు భర్తల మృతికి శోకాక్రాంతలై చేతులతో తలలు బాదుకుంటూ కన్నీటిధారలతో తడిసిన ముఖాలతో తమ తమ మందిరాల నుండి వచ్చారు. వీరశయ్యలందు దీర్ఘనిద్ర చెంది ఉన్న తమ పతులను పరిష్వంగం చేసుకుని, చక్కటి గద్గద కంఠధ్వనులతో ఏడ్చారు. వారిలో కంసుడి భార్యలు ఇలా అన్నారు. “ఓ ప్రాణనాయకా! కోపంతో వచ్చిన గోపాలుడనే సింహం గజేంద్రుడి వంటి నిన్ను హతమార్చింది కదా. హా శూరుడా! యదునాథుడనే గాలి దారుణమైన వేగంతో వీచి మహా వృక్షము లాంటి నిన్ను నేలపై కూలగొట్టింది కదా. ఓ మహానుభావా! వాసుదేవుడనే సముద్రజలం చెలియలకట్టను దాటి పొంగి వచ్చి దీవి వంటి నిన్ను ఇప్పుడు ముంచేసింది కదా. రాజేంద్రా! దేవకీపుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండవంటి నిన్ను సంహరించాడు కదా. అయ్యో! నీవిలా చనిపోయినప్పటికీ మేము ఇంకా బ్రతుకే ఉన్నాము. అక్కటా! మా అంత కఠిన హృదయం కలవారు భూమిమీద ఎక్కడైనా ఉన్నారా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=165&padyam=1387

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 92

( కంససోదరుల వధ )

10.1-1384-క.
చేతులఁ దాళము లొత్తుచుఁ
జేతోమోదంబుతోడ సిగముడి వీడం
బాతర లాడుచు మింటను
గీతము నారదుఁడు పాడెఁ గృష్ణా! యనుచున్.
10.1-1385-క.
వారిజభవ రుద్రాదులు
భూరికుసుమవృష్టిఁ గురిసి పొగడిరి కృష్ణున్
భేరులు మ్రోసెను నిర్జర
నారులు దివి నాడి రధిక నటనముల నృపా!

భావము:
నారదమహర్షి చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వీడిపోగా, ఆనందంతో ఆకాశంలో “కృష్ణా!” అంటూ పాడుతూ నర్తించాడు. పరీక్షన్నరేంద్రా! బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలు కొల్లలు కొల్లలుగా పూలజల్లులు కురిపిస్తూ శ్రీకృష్ణుడిని స్తుతించారు. దేవదుందుభులు మ్రోగాయి. దేవతాంగనలు ఆకాశంలో అనేక రకాల నాట్యాలు చేశారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1385

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :