Monday, November 9, 2020

శ్రీ కృష్ణ విజయము - 71

( మల్లావనీ ప్రవేశము )


10.1-1330-క.
వసుదేవు నివాసంబున
వసుధన్ రక్షింప వీరు వైష్ణవతేజో
ల్లసనమునఁ బుట్టినారఁట
పసిబిడ్డ లనంగఁ జనదు పరదేవతలన్.
10.1-1331-సీ.
చంపె రక్కసిఁ బట్టి; చక్రవాకునిఁగూల్చెఁ-
  బడ ద్రొబ్బె మద్దుల; బకునిఁ జీఱె;
నఘదైత్యుఁ బొరిగొనె; నడరి వత్సకుఁ ద్రుంచె-
  గిరి యెత్తి దేవేంద్రుఁ గ్రిందుపఱిచెఁ;
గాళియు మర్దించె; గహనానలముఁ ద్రావెఁ-
  గేశి నంతకుపురి క్రేవ కనిచె;
మయుపుత్రుఁ బరిమర్చె; మఱియు దానవ భటు-
  ల హరించి గోపకులంబుఁగాచె;
10.1-1331.1-తే.
గోపకాంతల మనముల కోర్కిదీర్చె;
నీ సరోరుహలోచనుండీ శుభాంగుఁ
డీ మహామహుఁడీ దిగ్గజేంద్ర మడఁచె;
మనుజమాత్రుఁడె తలపోయ మాధవుండు."

భావము:
“వీరు విష్ణుదేవుడి తేజోవిలాసంతో భూలోకాన్ని కాపాడుట కోసం, వసుదేవుడి ఇంట్లో పుట్టారట. పరబ్రహ్మ స్వరూపు లయిన వీరిని పసిపాపలు అనడం తగదు” అనుకున్నారు. నళినముల వంటి నయనములు కల వాడూ, మంగళకర మైన అంగసౌష్టవము కలవాడూ, గొప్ప తేజస్సు కలవాడూ. లక్ష్మిదేవికి పతి అయినవాడూ అయిన ఈ శ్రీకష్ణుడు తరచి చూస్తే సామాన్య మానవుడు కాదు. పూతన రక్కసిని పట్టి చంపాడు; సుడిగాలి రూపుడు తృణావర్తుడిని హతమార్చాడు. మద్ది చెట్లను పడగొట్టాడు; బకాసురుడిని సంహరించాడు; అఘుడనే అసురుణ్ణి అంతం చేసాడు; విజృంభించి వత్సాసురుణ్ణి వధించాడు; గోవర్ధనగిరిని ఎత్తి దేవేంద్రుడి గర్వం అణచాడు; నాగరాజు కాళీయుడిని మర్థించాడు; కార్చిచ్చు త్రాగాడు; కేశి అనే దానవుడిని యమపురికి పంపాడు; మయుని కొడుకు వ్యోమాసురుడిని సంహరించాడు; ఇంకా ఎందరో రాక్షస వీరులను నిర్మూలించి, గోపకులను కాపాడాడు; వ్రేతల మనసులలోని కోరికలను తీర్చాడు; దిగ్గజం లాంటి కువలయాపీడ కరీంద్రమును కడతేర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1331

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 70

( మల్లావనీ ప్రవేశము )

10.1-1327-క.
చచ్చిన కుంభీంద్రంబును
వచ్చిన బలమాధవులను వరుసం గని తా
నొచ్చిన చిత్తముతోడుతఁ
జెచ్చెరఁ గడు వెఱచె భోజసింహుం డధిపా.
10.1-1328-ఉ.
ధీరుల వస్త్ర మాల్య మణి దీప్త విభూషణధారులన్ నటా
కారుల సర్వలోక శుభకారుల మానవ మానినీ మనో
హారుల రంగభూతల విహారుల గోపకుమారులన్ మహా
వీరులఁ జూచి చూచి తనివిం దుదిముట్టక లోకు లందఱున్.
10.1-1329-ఉ.
సన్నుత రామకృష్ణముఖ చంద్రమయూఖ సుధారసంబులం
గన్నులఁ ద్రావు చందమునఁ గాంచుచు జిహ్వల నంటి చూచు లీ
ల న్నుతి చేయుచుం గరములం బరిరంభము చేయు భంగి న
త్యున్నతిఁ జూపుచుం దగిలి యొండొరుతోడ రహస్యభాషలన్.


భావము:
ఓ రాజా! చచ్చిన కరి కువలయాపీడమునూ, వచ్చిన రామకృష్ణులనూ చూసిన భోజకులాగ్రజుడైన కంసుడి మనసు బాగా నొచ్చుకుంది. అతను మనసులో ఎంతగానో భయపడ్డాడు. ధీరులూ, వస్త్రములూ పూలదండలూ రత్నాలతో ప్రకాశిస్తున్న నగలు ధరించినవారూ, నాట్యాలు చేసేవారి వలె ఉన్నవారూ, సకల జగాలకు క్షేమం కలిగించే వారూ, మగవారి మనసులు, మగువుల మనసులూ ఆకర్షించేవారూ, మహావీరులూ అయిన ఆ గోపకుమారులు మల్లరంగంలో విహరిస్తుంటే జనాలు అందరూ ఎంత చూసినా తనివితీరక మాటిమాటికీ చూడసాగారు. అందమైన రామకృష్ణుల ముఖచంద్రబింబాల నుండి ప్రసరించే అమృతరసాన్ని కన్నులతో త్రాగుతున్నారా అన్నట్లు చూస్తూ; నాలుకలతో చప్పరించి చవిచూస్తున్నారా అన్నట్లు స్తుతిస్తూ; చేతులతో కౌగిలించుకుంటున్నారా అన్నట్లు మున్ముందుకు వాలుతూ; అక్కడి ప్రజలు అందరూ ఒకరితో ఒకరు గుసగుసలుగా ఇలా మాట్లాడుకోసాగారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1328

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, November 4, 2020

శ్రీ కృష్ణ విజయము - 69

( మల్లావనీ ప్రవేశము )

10.1-1325-సీ.
మహితరౌద్రంబున మల్లుర కశనియై-
  నరుల కద్భుతముగ నాథుఁ డగుచు
శృంగారమునఁ బురస్త్రీలకుఁ గాముఁడై-
  నిజమృత్యువై కంసునికి భయముగ
మూఢులు భీభత్సమునుఁ బొంద వికటుఁడై-
  తండ్రికి దయరాఁగఁ దనయు డగుచు
ఖలులకు విరసంబుగా దండియై గోప-
  కులకు హాస్యంబుగాఁ గులజుఁ డగుచు
10.1-1325.1-ఆ.
బాంధవులకుఁ బ్రేమ భాసిల్ల వేలుపై
శాంత మొనర యోగి జనుల కెల్లఁ
బరమతత్వ మగుచు భాసిల్లె బలునితో
మాధవుండు రంగమధ్య మందు.
10.1-1326-వ.
అప్పుడు.

భావము:
మల్లరంగం నడుమ బలరామ సహితుడైన కృష్ణుడు, రౌద్రరసంతో మల్లురకు పిడుగులా కనిపించాడు; అద్భుతరసంతో పురస్త్రీలకు పంచశరుడుగా భాసిల్లాడు; భయానకరసంతో కంసునికి వాడి పాలిటి మృత్యువుగా మూర్తీభవించాడు; బీభత్సరసంతో మూర్ఖులకు వికటుడుగా కనిపించాడు; కరుణరసంతో తండ్రికి కన్నబిడ్డడుగా కరుణ కలిగించాడు; వీరరసంతో దుర్మార్గులకు విద్వేషం కలిగించాడు; హాస్యరసంతో గోపకులను కులదీపకుడుగా గోచరించాడు; ప్రేమరసంతో చుట్టాలకు దేవుడుగానూ, శాంతరసంతో యోగిజనులకు పరబ్రహ్మ స్వరూపుడుగానూ ప్రకాశించాడు. అలా బలరామకృష్ణులు ఏనుగు దంతాలతో మల్లరంగం ప్రవేశించిన సమయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1325

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 68

( మల్లావనీ ప్రవేశము )

10.1-1322-ఉ.
కాలం ద్రొక్కి సలీలుఁడై నగవుతోఁ గంఠీరవేంద్రాకృతిం
గేలన్ భీషణ దంతముల్ పెఱికి సంక్షీణంబుగా మొత్తి గో
పాలగ్రామణి వీరమౌళిమణియై ప్రాణంబులం బాపె నా
శైలేంద్రాభముఁ బ్రాణలోభము నుఁదంచత్సారగంధేభమున్.
10.1-1323-వ.
మఱియు దంతిదంత తాడనంబుల దంతావళపాలకుల హరించి తత్ప్రదేశంబుఁ బాసి.
10.1-1324-మ.
కరిదంతంబులు మూఁపులందు మెఱయన్ ఘర్మాంబువుల్ మోములన్
నెరయన్ గోపకు లంతనంత మెలయన్ నిత్యాహవస్థేము లా
హరిరాముల్ చనుదెంచి కాంచిరి మహోగ్రాడంబరాపూరితామర మర్త్యాది జనాంతరంగము లసన్మల్లావనీరంగమున్.
                                  
భావము:
గోపాలశేఖరుడూ వీరశిరోరత్నమూ అయిన శ్రీకృష్ణుడు ఒక మహా సింహం మాదిరి, మహా పర్వతంతో సమానమైనదీ ప్రాణాలపై భయంకలదీ అయిన ఆ మత్త గజాన్ని, సవిలాసంగా నవ్వుతూ కాలితో త్రొక్కిపెట్టి, చేతితో భయంకరమైన దాని దంతాలు ఊడబెరికి, కృశించి నశించేలా బాది ప్రాణాలు తీసాడు.తరువాత ఆ ఏనుగు దంతాలతోనే దాని మావటిలను మట్టుపెట్టి, ఆ చోటు వదలి కదనరంగంలో మడమ త్రిప్పక పోరాడే ఆ రామకృష్ణులు ఏనుగుదంతాలు తమ భుజాల మీద మెరుస్తుండగా; స్వేదబిందువులు ముఖము నిండా కమ్ముకోగా; గోపాలకులు చుట్టూ చేరి వస్తుండగా; బయలుదేరి వచ్చి మల్లరంగాన్ని చూసారు. అది మహా భయంకర మైన ఆడంబరంతో దేవతల, మానవుల హృదయాలను కలవరపెడుతూ ఉంది.       

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1324

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, November 2, 2020

శ్రీ కృష్ణ విజయము - 67

( కువలయాపీడముతో బోరుట )

10.1-1321-వ.
మఱియు, న య్యనేకపం బనేకపపాలక ప్రేరితంబై, మహావాత సంఘాత సముద్ధూతంబగు విలయకాల కీలికేళిని బిట్టు మిట్టిపడి, మృత్యుదేవత యెత్తునం, గాలు పోలిక, శమను గమనిక నెదిరి మదసలిల పరిమళ లుబ్ధ పరిభ్రమదదభ్ర భ్రమర గాయక ఝంకృతు లహుంకృతి సొంపు సంపాదింపం, గులకుంభినీధర గుహాకుంభ గుంభనంబుగ ఘీంకరించి, రోషభీషణ శేషభోగిభోగ భయంకరంబగు కరంబున శౌరిం జీరి, చీరికిం గొనక, పట్టఁ నందుపట్టి యట్టిట్టు గెంటి, విధుంతుద వదన గహ్వరంబువలన విడివడి యుఱుకు తరణి కరణి దర్పించి, కుప్పించి, పాదమధ్యంబునకు నసాధ్యుండై దూఁటి, దాఁటి మాటుపడినం సింధురంబు గ్రోధబంధురంబై మహార్ణవమధ్య మంథాయమాన మంథరమహీధరంబు కైవడి జిఱజిఱం దిరిగి కానక భయానకంబై కాలి వెరవునం గని, పొంగి, చెంగటం బ్రళయదండిదండ ప్రశస్తంబగు హస్తంబు వంచి వంచించి చుట్టిపట్టి పడవేయం గమకించినం జలింపక తెంపున హరి కరి పిఱింది కుఱికి మహారాహు వాలవల్లి కాకర్షణోదీర్ణుం డగు సుపర్ణు తెఱంగున నెగిరి శుండాలంబు వాలంబు లీలం గేల నొడిసిపట్టి జళిపించి పంచవింశతి బాణాసన ప్రమాణ దూరంబున జిఱజిఱం ద్రిప్పి వైవ, న వ్వారణంబు దుర్నివారణంబై రణంబున కోహటింపక సవ్యాపసవ్య పరిభ్రమణంబుల నవక్రంబై కవిసిన నపసవ్యసవ్యక్రమణంబులఁ దప్పించి రొప్పి కుప్పించి యెదుర్కొనినఁ గర్కశుండై మేచకాచలతుంగ శృంగ నిభంబగు కుంభికుంభంబు చక్కటి వ్రక్కలై చెక్కులెగయ దురంత కల్పాంత జీమూత ప్రభూత నిర్ఘాత నిష్ఠురంబగు ముష్టి సారించి యూఁచి పొడిచినం దద్వికీర్ణపూర్ణ రక్తసిక్త మౌక్తికంబులు వసుంధరకు సంధ్యారాగ రక్త తారకాచ్ఛన్నం బగు మిన్ను చెన్నల వరింప నిలువరింపక మ్రొగ్గి మోఁకరిలి మ్రొగ్గక దిగ్గన న గ్గజంబు లేచి చూచి త్రోచి నడచి, సంహారసమయ సముద్ర సంఘాత సంభూత సముత్తుంగ భంగ సంఘటితం బగు కులాచలంబుక్రియఁ గ్రమ్మఱ న మ్మహాభుజుని భుజాదండంబువలన ఘట్టితంబై, కట్టలుక ముట్టి నెట్టి డీకొని ముమ్మరమ్ముగం గొమ్ములం జిమ్మిన న మ్మేటి చేసూటి మెఱసి హస్తాహస్తి సంగరంబునఁ గరంబొప్పి దప్పింబడ నొప్పించిన నకుంఠిత కాలకంఠ కఠోర భల్లభగ్నం బగు పురంబు పగిది జలధిం జటుల ఝంఝానిల వికలంబగు కలంబు కైవడి న మ్మదకలభంబు బలంబు దక్కి చిక్కి స్రుక్కిపడి, లోభికరంబునుంబోలె దానసలిలధారావిరహితంబై, విరహి తలంపునుం బోలె నిరంతర చిత్తజాతజనక నిగ్రహంబై, గ్రహణకాలంబును బోలెఁ బరాధీనఖరకరంబై, ఖరకరోదయంబునుం బోలె భిన్నపుష్కరంబై, పుష్కరవైరి విలసనంబునుం బోలె నభాసిత పద్మకంబై యున్న సమయంబున.

భావము:
అంతే కాకుండా ఇంకా చాలా మంది మావటులు చేరి ఆ ఏనుగు కువలయాపీడమును పురికొల్పారు. ఆ మదగజం త్రుళ్లిపడుతూ, పెనుగాలులకు పైకెగసిన ప్రళయకాలం లోని అగ్నిజ్వాలల వలె, మృత్యుదేవత మాదిరి, కాలపురుషుని కైవడి, యముని తీరున కృష్ణుడిని ఎదుర్కొంది; తన మదజల వాసన మీది ఆశతో చుట్టూ తిరుగుతున్న తుమ్మెదలనే గాయకుల ఝుంకారంతో ఆ గజం హూంకరించింది; అది కులపర్వతాల గుహల వంటి కుంభాలను తన ఘీంకారంతో పూరించింది; ఆగ్రహోదగ్రుడైన ఆదిశేషుని పడగ వలె భయంగొలిపే తన తొండంతో నిర్లక్ష్యంగా శౌరిని పట్టుకుంది. అప్పుడు అసాధ్యుడైన హరి అటు ఇటు గింజుకుని రాహువు నోట్లోంచి తప్పించుకుని వెలికురికే భాస్కరుడి వలె; చెంగున ఎగిరి దాని కాళ్ళ నడుమ దూరి దాగుకొన్నాడు. కృష్ణుడు కనిపించక పోయేసరికి కువలయాపీడానికి క్రోధం పెల్లుబికింది. మహాసాగర మధ్యంలో పరిభ్రమించే మందరగిరి లాగ, అది గిరగిర తిరుగాడింది; వాసన పసికట్టి కృష్ణుడున్న చోటు తెలుసుకుని ఉప్పొంగి పోయింది; ప్రళయకాలంలోని యమదండం లాంటి ప్రచండమైన తన తొండాన్ని క్రిందికి వంచి అది పద్మాక్షుని వంచించి చుట్టిపట్టి పడవేద్దామని ప్రయత్నించింది; మాధవుడు చలింపక తెంపుతో దాని వెనుకవైపునకు ఉరికాడు. రాహువు తోకను పట్టిలాగే జగజెట్టి గరుడుని చందంగా శ్రీకృష్ణుడు ఒక్క ఎగురు ఎగిరి ఆ ఏనుగు తోకను చేతితో ఒడిసిపట్టుకొని, మించిన పరాక్రమంతో వందమూరల దూరానికి దానిని గిరగిర త్రిప్పి విసరికొట్టాడు. ఆ మత్తేభం అడ్డుకోలేని అవక్రపరాక్రమంతో, పోరాడటానికి వెనుదీయక కుడిఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడి మీదకి ఉరికింది. అప్పుడు కృష్ణుడు కుంజరం కుడిప్రక్కకు తిరిగినప్పుడు తాను ఎడమప్రక్కకు, ఆ ఏనుగు ఎడమ వైపుకు తిరిగినపుడు తాను కుడి వైపుకు తిరుగుతూ దానికి బాగా రొప్పు తెప్పించాడు. అతడు కాఠిన్యం వహించి దాని పైకి చెంగలించాడు. ప్రళయకాల మేఘాల నుండి పడిన కఠోరమైన పిడుగులాంటి తన పిడికిలి బిగించి ఈడ్చిపెట్టి దాని కుంభస్థలాన్ని గ్రుద్దాడు. ఎత్తయిన అంజనగిరి శిఖరం లాంటి దాని కుంభస్థలం పగిలి ముక్కచెక్కలై ఎగిరిపడింది. ఆ కుంభస్థలం నుంచి నెత్తుటితో తడిసి చెదరి నేలరాలిన ముత్యాలు సంజకెంజాయలో ఎఱ్ఱటి నక్షత్రాలతో కప్పబడిన ఆకాశం అందాన్ని ధరణికి సంతరించాయి. ఆ ఏనుగు అంతటితో ఆగక మ్రొగ్గి మోకరిల్లి సంబాళించుకుని వెంటనే లేచింది. అటు ఇటు చూసి, ముందుకు దూకింది. ప్రళయకాలంలో సముద్రాల సముత్తం తరంగాలచే కొట్టబడిన కులపర్వతం వలె అది మళ్ళీ భుజబలసమేతుడైన శ్రీకృష్ణునిచే కొట్టబడింది. మిక్కుటమైన క్రోధంతో కువలయాపీడం గోవిందుడిని ఒక్కుమ్మడిగా తన కొమ్ములతో చిమ్మింది. నందనందనుడు హస్తలాఘవం చూపి బాహబాహి యుద్ధంలో బాగా విజృంభించి దానిని తల్లడిల్ల చేసాడు. అప్పుడు ఆ మదగజం మొక్కవోని ముక్కంటి బల్లెముచే భగ్నమైన పురంలా; సముద్రంలో తీవ్రమైన ఝంఝూమారుతం వల్ల పాడైన ఓడలా శక్తి కోల్పోయింది; బక్కచిక్కి స్రుక్కిపోయింది; ఎన్నడూ దానాలు ధారపోయని పిసినారి చెయ్యి వలె, అది మదజలధారలు లేనిది అయింది; ఎడతెగని మదనుని పోరుగల వియోగి హృదయంలా ఎడతెగక మదిలో జనించిన విరోధం కలది అయింది; పరాధీనుడైన ప్రభాకరుడు కల గ్రహణవేళ వలె ఎండిన తొండము కలది అయింది; పూచిన తామరలు కల సూర్యోదయం లాగా చీలిన తొండపుకొన గలది అయింది; ప్రకాశింపని పద్మాలు కల చంద్రప్రకాశం వలె వెలవెల పోయింది. ఆ సమయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=156&padyam=1321

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, November 1, 2020

శ్రీ కృష్ణ విజయము - 66

( కువలయాపీడముతో బోరుట ) 

10.1-1319-మ.
మించిన కొప్పుఁ జక్కనిడి మేలనఁ బచ్చనిచీర కాసె బం
ధించి లలాటకుంతలతతిన్ మరలించుచు సంగరక్రియా
చుంచుతఁ బేర్చి బాలకుఁడు చూచు జనంబులు దన్ను బాపురే!
యంచు నుతింప డగ్గఱియె హస్తజితాగము గంధనాగమున్.
10.1-1320-క.
అంజక బాలకుఁ డనియునుఁ
గొంజక దయమాలి రాజకుంజర! యంతన్
గుంజరమును డీకొలిపెనుఁ
గుంజరపాలకుఁడు గోపకుంజరుమీఁదన్.

భావము:
కన్నయ్య తన చిక్కటి జుట్టుముడిని గట్టిగా బిగించుకున్నాడు. మెల్లగా పీతాంబరాన్ని దట్టిగా బిగించి కట్టుకున్నాడు. నుదుట వ్రేలాడుతున్న ముంగురులను పైకి త్రోసుకుని పోరాటానికి అనువైన సిగచుట్టాడు. చూస్తున్న జనాలు బాలుడైన ఆ శ్రీకృష్ణుడిని “అయ్యబాబోయ్!” అంటూ మెచ్చి పొగడుతుండగా, తొండంతో కొండలను పిండిచేసే ఆ మదగజం దగ్గరకు వెళ్ళాడు. ఓ రాజశేఖరా! కృష్ణుడు హెచ్చరించినా వెఱవక, ఆ మావటివాడు బాలుడని సంకోచ, దయాదాక్షిణ్యాలు లేకుండా, ఏనుగును “డీకొట్ట” మని గోపాలశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడి మీదకు పురికొల్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=156&padyam=1320

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 65

( కరిపాలకునితో సంభాషణ )

10.1-1316-వ.
కని తత్కరిపాలకశ్రేష్ఠుండైన యంబష్ఠునికి మేఘనాదగంభీర భాషణంబుల రిపుభీషణుం డగు హరి యిట్లనియె.
10.1-1317-శా.
"ఓరీ! కుంజరపాల! మా దెసకు నీ యుద్యన్మదేభేంద్రముం
బ్రేరేఁపం బనిలేదు; త్రిప్పు మరలం బ్రేరేఁపినన్ నిన్ను గం
భీరోగ్రాశనితుల్య ముష్టిహతులన్ భేదించి నే డంతకుం
జేరంబుత్తు మహత్తరద్విపముతో సిద్ధంబు యుద్ధంబునన్."
10.1-1318-వ.
అని పలికి.

భావము:
అరివీర భయంకరుడైన శ్రీకృష్ణుడు ఆ మదించిన ఏనుగును చూసి, మేఘగర్జన వలె గంభీరమైన కంఠంతో దాని మావటివాళ్ళ నాయకుడితో ఇలా అన్నాడు. “ఓరీ మావటీ! మా వేపుకు ఈ మత్తగజాన్ని ఎందుకు ఉసిగొల్పుతావు. వెనుకకు మరలించు. వినకుండా డీకొట్టమని పోరుకు ఉసికొల్పావంటే, నీ మదపుటేనుగును, నిన్ను కలిపి గంభీరమైన దారుణమైన పిడుగుపాటుల వంటి నా పిడికిలిపోటులతో పొడిచి పొడిచి యముని పాలికి ఇపుడే పంపడం తథ్యం సుమా.” ఇలా ఆ మావటిని హెచ్చరించి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=155&padyam=1317

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :