Monday, November 2, 2020

శ్రీ కృష్ణ విజయము - 67

( కువలయాపీడముతో బోరుట )

10.1-1321-వ.
మఱియు, న య్యనేకపం బనేకపపాలక ప్రేరితంబై, మహావాత సంఘాత సముద్ధూతంబగు విలయకాల కీలికేళిని బిట్టు మిట్టిపడి, మృత్యుదేవత యెత్తునం, గాలు పోలిక, శమను గమనిక నెదిరి మదసలిల పరిమళ లుబ్ధ పరిభ్రమదదభ్ర భ్రమర గాయక ఝంకృతు లహుంకృతి సొంపు సంపాదింపం, గులకుంభినీధర గుహాకుంభ గుంభనంబుగ ఘీంకరించి, రోషభీషణ శేషభోగిభోగ భయంకరంబగు కరంబున శౌరిం జీరి, చీరికిం గొనక, పట్టఁ నందుపట్టి యట్టిట్టు గెంటి, విధుంతుద వదన గహ్వరంబువలన విడివడి యుఱుకు తరణి కరణి దర్పించి, కుప్పించి, పాదమధ్యంబునకు నసాధ్యుండై దూఁటి, దాఁటి మాటుపడినం సింధురంబు గ్రోధబంధురంబై మహార్ణవమధ్య మంథాయమాన మంథరమహీధరంబు కైవడి జిఱజిఱం దిరిగి కానక భయానకంబై కాలి వెరవునం గని, పొంగి, చెంగటం బ్రళయదండిదండ ప్రశస్తంబగు హస్తంబు వంచి వంచించి చుట్టిపట్టి పడవేయం గమకించినం జలింపక తెంపున హరి కరి పిఱింది కుఱికి మహారాహు వాలవల్లి కాకర్షణోదీర్ణుం డగు సుపర్ణు తెఱంగున నెగిరి శుండాలంబు వాలంబు లీలం గేల నొడిసిపట్టి జళిపించి పంచవింశతి బాణాసన ప్రమాణ దూరంబున జిఱజిఱం ద్రిప్పి వైవ, న వ్వారణంబు దుర్నివారణంబై రణంబున కోహటింపక సవ్యాపసవ్య పరిభ్రమణంబుల నవక్రంబై కవిసిన నపసవ్యసవ్యక్రమణంబులఁ దప్పించి రొప్పి కుప్పించి యెదుర్కొనినఁ గర్కశుండై మేచకాచలతుంగ శృంగ నిభంబగు కుంభికుంభంబు చక్కటి వ్రక్కలై చెక్కులెగయ దురంత కల్పాంత జీమూత ప్రభూత నిర్ఘాత నిష్ఠురంబగు ముష్టి సారించి యూఁచి పొడిచినం దద్వికీర్ణపూర్ణ రక్తసిక్త మౌక్తికంబులు వసుంధరకు సంధ్యారాగ రక్త తారకాచ్ఛన్నం బగు మిన్ను చెన్నల వరింప నిలువరింపక మ్రొగ్గి మోఁకరిలి మ్రొగ్గక దిగ్గన న గ్గజంబు లేచి చూచి త్రోచి నడచి, సంహారసమయ సముద్ర సంఘాత సంభూత సముత్తుంగ భంగ సంఘటితం బగు కులాచలంబుక్రియఁ గ్రమ్మఱ న మ్మహాభుజుని భుజాదండంబువలన ఘట్టితంబై, కట్టలుక ముట్టి నెట్టి డీకొని ముమ్మరమ్ముగం గొమ్ములం జిమ్మిన న మ్మేటి చేసూటి మెఱసి హస్తాహస్తి సంగరంబునఁ గరంబొప్పి దప్పింబడ నొప్పించిన నకుంఠిత కాలకంఠ కఠోర భల్లభగ్నం బగు పురంబు పగిది జలధిం జటుల ఝంఝానిల వికలంబగు కలంబు కైవడి న మ్మదకలభంబు బలంబు దక్కి చిక్కి స్రుక్కిపడి, లోభికరంబునుంబోలె దానసలిలధారావిరహితంబై, విరహి తలంపునుం బోలె నిరంతర చిత్తజాతజనక నిగ్రహంబై, గ్రహణకాలంబును బోలెఁ బరాధీనఖరకరంబై, ఖరకరోదయంబునుం బోలె భిన్నపుష్కరంబై, పుష్కరవైరి విలసనంబునుం బోలె నభాసిత పద్మకంబై యున్న సమయంబున.

భావము:
అంతే కాకుండా ఇంకా చాలా మంది మావటులు చేరి ఆ ఏనుగు కువలయాపీడమును పురికొల్పారు. ఆ మదగజం త్రుళ్లిపడుతూ, పెనుగాలులకు పైకెగసిన ప్రళయకాలం లోని అగ్నిజ్వాలల వలె, మృత్యుదేవత మాదిరి, కాలపురుషుని కైవడి, యముని తీరున కృష్ణుడిని ఎదుర్కొంది; తన మదజల వాసన మీది ఆశతో చుట్టూ తిరుగుతున్న తుమ్మెదలనే గాయకుల ఝుంకారంతో ఆ గజం హూంకరించింది; అది కులపర్వతాల గుహల వంటి కుంభాలను తన ఘీంకారంతో పూరించింది; ఆగ్రహోదగ్రుడైన ఆదిశేషుని పడగ వలె భయంగొలిపే తన తొండంతో నిర్లక్ష్యంగా శౌరిని పట్టుకుంది. అప్పుడు అసాధ్యుడైన హరి అటు ఇటు గింజుకుని రాహువు నోట్లోంచి తప్పించుకుని వెలికురికే భాస్కరుడి వలె; చెంగున ఎగిరి దాని కాళ్ళ నడుమ దూరి దాగుకొన్నాడు. కృష్ణుడు కనిపించక పోయేసరికి కువలయాపీడానికి క్రోధం పెల్లుబికింది. మహాసాగర మధ్యంలో పరిభ్రమించే మందరగిరి లాగ, అది గిరగిర తిరుగాడింది; వాసన పసికట్టి కృష్ణుడున్న చోటు తెలుసుకుని ఉప్పొంగి పోయింది; ప్రళయకాలంలోని యమదండం లాంటి ప్రచండమైన తన తొండాన్ని క్రిందికి వంచి అది పద్మాక్షుని వంచించి చుట్టిపట్టి పడవేద్దామని ప్రయత్నించింది; మాధవుడు చలింపక తెంపుతో దాని వెనుకవైపునకు ఉరికాడు. రాహువు తోకను పట్టిలాగే జగజెట్టి గరుడుని చందంగా శ్రీకృష్ణుడు ఒక్క ఎగురు ఎగిరి ఆ ఏనుగు తోకను చేతితో ఒడిసిపట్టుకొని, మించిన పరాక్రమంతో వందమూరల దూరానికి దానిని గిరగిర త్రిప్పి విసరికొట్టాడు. ఆ మత్తేభం అడ్డుకోలేని అవక్రపరాక్రమంతో, పోరాడటానికి వెనుదీయక కుడిఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడి మీదకి ఉరికింది. అప్పుడు కృష్ణుడు కుంజరం కుడిప్రక్కకు తిరిగినప్పుడు తాను ఎడమప్రక్కకు, ఆ ఏనుగు ఎడమ వైపుకు తిరిగినపుడు తాను కుడి వైపుకు తిరుగుతూ దానికి బాగా రొప్పు తెప్పించాడు. అతడు కాఠిన్యం వహించి దాని పైకి చెంగలించాడు. ప్రళయకాల మేఘాల నుండి పడిన కఠోరమైన పిడుగులాంటి తన పిడికిలి బిగించి ఈడ్చిపెట్టి దాని కుంభస్థలాన్ని గ్రుద్దాడు. ఎత్తయిన అంజనగిరి శిఖరం లాంటి దాని కుంభస్థలం పగిలి ముక్కచెక్కలై ఎగిరిపడింది. ఆ కుంభస్థలం నుంచి నెత్తుటితో తడిసి చెదరి నేలరాలిన ముత్యాలు సంజకెంజాయలో ఎఱ్ఱటి నక్షత్రాలతో కప్పబడిన ఆకాశం అందాన్ని ధరణికి సంతరించాయి. ఆ ఏనుగు అంతటితో ఆగక మ్రొగ్గి మోకరిల్లి సంబాళించుకుని వెంటనే లేచింది. అటు ఇటు చూసి, ముందుకు దూకింది. ప్రళయకాలంలో సముద్రాల సముత్తం తరంగాలచే కొట్టబడిన కులపర్వతం వలె అది మళ్ళీ భుజబలసమేతుడైన శ్రీకృష్ణునిచే కొట్టబడింది. మిక్కుటమైన క్రోధంతో కువలయాపీడం గోవిందుడిని ఒక్కుమ్మడిగా తన కొమ్ములతో చిమ్మింది. నందనందనుడు హస్తలాఘవం చూపి బాహబాహి యుద్ధంలో బాగా విజృంభించి దానిని తల్లడిల్ల చేసాడు. అప్పుడు ఆ మదగజం మొక్కవోని ముక్కంటి బల్లెముచే భగ్నమైన పురంలా; సముద్రంలో తీవ్రమైన ఝంఝూమారుతం వల్ల పాడైన ఓడలా శక్తి కోల్పోయింది; బక్కచిక్కి స్రుక్కిపోయింది; ఎన్నడూ దానాలు ధారపోయని పిసినారి చెయ్యి వలె, అది మదజలధారలు లేనిది అయింది; ఎడతెగని మదనుని పోరుగల వియోగి హృదయంలా ఎడతెగక మదిలో జనించిన విరోధం కలది అయింది; పరాధీనుడైన ప్రభాకరుడు కల గ్రహణవేళ వలె ఎండిన తొండము కలది అయింది; పూచిన తామరలు కల సూర్యోదయం లాగా చీలిన తొండపుకొన గలది అయింది; ప్రకాశింపని పద్మాలు కల చంద్రప్రకాశం వలె వెలవెల పోయింది. ఆ సమయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=156&padyam=1321

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: