Friday, August 14, 2020

శ్రీ కృష్ణ విజయము - 6

( కంసుడక్రూరునితో మాట్లాడుట )

10.1-1163-సీ.
ఆ రామకేశవు లంతరించిన వసు$
  దేవ ముఖ్యులఁ జంపి తెగువ మెఱసి
వృష్ణి భోజ దశార్హ వీరులఁ దెగటార్చి$
  ముదుకఁడు రాజ్యకాముకుఁడు ఖలుఁడు
నగు నుగ్రసేను మా యయ్య గీటడగించి$
  పినతండ్రి దేవకుఁ బిలుకుమార్చి
మఱియు వైరులనెల్ల మర్దించి నే జరా$
  సంధ నరక బాణ శంబరాది
10.1-1163.1-ఆ.
సఖులతోడ భూమిచక్ర మేలెదఁ బొమ్ము
తెమ్ము వేగమ వసుదేవసుతుల
మఖము పేరు చెప్పి మంత్రభేదము చేయ
వలయుఁ బెంపఁ జనదు వైరి జనుల."
10.1-1164-వ.
అనిన నక్రూరుం డిట్లనియె.

భావము:
బలరాముడు కృష్ణుడు ఇద్దరు నేలకూలిన వెంటనే, వసుదేవుడు మున్నగు ప్రముఖులను సంహరిస్తాను. సాహసంతో వృష్ణి, భోజ, దశార్హ వంశజులైన వీరులను హతమారుస్తాను. రాజ్యాభిలాష గలవాడూ ముసలివాడూ దుర్మార్గుడూ అయిన మా తండ్రి ఉగ్రసేనుణ్ణి నిర్మూలిస్తాను. మా పినతండ్రియైన దేవకుణ్ణి చంపేస్తాను. ఇంకా మిగిలిన శత్రువుల ప్రాణాలు తీస్తాను. జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైన నా చెలికాండ్రతో గూడి ఈ భూమండలాన్న పరిపాలిస్తాను. ధనుర్యాగమనే మిషతో నీవు వెళ్ళి వసుదేవుడి కొడుకులను శీఘ్రంగా ఇక్కడికి తీసుకుని రా. పగవారి గుట్టు భేదించాలి. విరోధులను వృద్ధి కానీయ రాదు.” కంసుడి మాటలు వినిన అక్రూరుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=132&padyam=1163

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 5

( కంసుడక్రూరునితో మాట్లాడుట )

10.1-1161-శా.
కొండల్గూలఁగఁ ద్రొబ్బు కొమ్ముల తుదిం గోపించి కోరాడుచో
దండిన్ దండి నధఃకరించు నొకవేదండంబు నా యింట బ్ర
హ్మాండంబైనఁ గదల్పనోపు బలకృష్ణాభీరులం బోరిలో
ఖండింపం దడవెంత? దాని; కదియుం గాదేని నక్రూరకా!
10.1-1162-శా.
చాణూరుండును ముష్టికుండును సభాసంఖ్యాతమల్లుల్ జగ
త్ప్రాణున్ మెచ్చరు సత్వసంపదల బాహాబాహి సంగ్రామపా
రీణుల్ వారలు రామకృష్ణుల బలోద్రేకంబు సైరింతురే?
క్షీణప్రాణులఁ జేసి చూపుదురు సంసిద్ధంబు యుద్ధంబునన్.

భావము:
నా గుమ్మంలో ఉన్న కువలయాపీడము అనే గజరాజు తన దంతాగ్రాలతో కొండలను కూడా కూలద్రోస్తుంది. కోపంతో ఢీకొన్నప్పుడు నిండు మగటిమితో యముడిని సైతం క్రిందపడేస్తుంది. బ్రహ్మాండాలను కూడా కదలించే శక్తి దానికి ఉంది. అలాంటి గజరాజుకి బలరామకృష్ణులను చీల్చిచెండాడానికి క్షణకాలం పట్టదు. ఒకవేళ అది వారిని సంహరించ లేకపోతే అక్రూరా! విను చాణూరుడు, ముష్టికుడు మల్లుర సమూహంలో గణింపదగిన యోధులు. కుస్తీపట్టుటలో వారు వాయుదేవుడిని సైతం లక్ష్యపెట్టరు. శక్తి సామర్థ్యాలతో మల్లయుద్ధం చేయడంలో మిక్కిలి నేర్పరులు. వారు బలరామకృష్ణుల బలాధిక్యాన్ని ఏమాత్రం సహించరు. పోరాటంలో వారి ప్రాణాలుతోడి తెగటారుస్తారు. ఇది ముమ్మాటికీ నిజం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=132&padyam=1162

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, August 13, 2020

శ్రీ కృష్ణ విజయము - 4

( కంసుడక్రూరునితో మాట్లాడుట )

10.1-1157-వ.
అని తనవారి నందఱ నయ్యైపనులకు నియమించి యదుశ్రేష్ఠుం డగు నక్రూరునిం బిలిపించి చెట్టపట్టుకొని యిట్లనియె.
10.1-1158-శా.
"అక్రూరత్వముతోడ నీవు మనఁగా నక్రూరనామంబు ని
ర్వక్రత్వంబునఁ జెల్లె మైత్రి సలుపన్ వచ్చున్ నినుం జేరి నీ
వక్రోధుండవు మందలోన బలకృష్ణాభీరు లస్మద్వినా
శక్రీడారతులై చరింతురఁట యోజందెచ్చి యొప్పింపవే.
10.1-1159-ఆ.
నాకు వెఱచి సురలు నారాయణుని వేఁడి
కొనిన నతఁడు వచ్చి గోపకులము
నందు గృష్ణమూర్తి నానకదుందుభి
కుదితుఁ డయ్యె ననఁగ నొకటి వింటి.
10.1-1160-వ.
కావున నీవు గోపకులచేత నరులు గొని ధనుర్యాగంబు చూడరం డని వారలం దోడ్కొని రమ్ము, తెచ్చిన.

భావము:
ఆవిధంగా కంసుడు తన వాళ్ళందరికీ ఆ యా పనులు అప్పజెప్పి. యాదవోత్తముడైన అక్రూరుణ్ణి పిలిపించాడు. అతడి చెయ్యి తన చేతితో పట్టుకుని, ఇలా అన్నాడు. “క్రూరకృత్యాలకు దిగకుండా బతుకు సాగించడం వలన నీకు అక్రూరుడనే పేరు సార్ధకనామం అయింది. నీతో కలసి మెలసి స్నేహం చేయవచ్చు. నీవు కోపంలేని వాడివి, నందవ్రజంలో గొల్లలైన రామకృష్ణులు నన్ను చంపడానికి ఆసక్తితో సిద్ధపడుతున్నారుట. ఉపాయంతో వారిని తెచ్చి నాకు అప్పగించు. దేవతలు నాకు భయపడి వేడుకోడంతో, విష్ణువు యదువంశంలో వసుదేవుడికి కృష్ణుడుగా పుట్టాడని ఒక మాట విన్నాను. కాబట్టి, నువ్వు నందాదులైన యాదవులకు చెప్పి ఒప్పించి కప్పం గైకొని, ధనుర్యాగం చూడడానికి రండని వారిని పిలుచుకొని రావాలి. నువ్వు అలా తీసుకు వస్తే. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=132&padyam=1159

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 3


( కంసుని మంత్రాలోచన )

10.1-1154-శా.
విన్నాణంబులఁ బోరనేర్తురు మహావీర్యప్రతాపాది సం
పన్నుల్ మీరలు మేటి మల్లుగములం బ్రఖ్యాతులై పెంపుతో
మన్నా రా బలకృష్ణులం బెనఁకువన్ మర్దించి మత్ప్రీతి కా
సన్నుల్ గండు పురీజనుల్ పొగడ నో! చాణూర! యో! ముష్టికా!
10.1-1155-శా.
రారా హస్తిపకేంద్ర! గండమదధారాగంధలోభాంధ గం
భీరాళివ్రజమైన మత్కువలయాపీడద్విపేంద్రంబు మ
ద్వారోదంచిత దేహళీపరిసరస్తంభంబు డాయంగ నా
భీరుల్ రా నదలించి డీకొలుపుమీ బీరంబు తోరంబుగన్.
10.1-1156-క.
పశువిశసనములు చేయుఁడు
పశుపతికిం బ్రియముగాఁగ భావించి చతు
ర్దశినాడు ధనుర్యాగము
విశదంబుగఁ జేయవలయు విజయముకొఱకున్."

భావము:
ఓ చాణూర ముష్టికులారా! మీరు మిక్కిలి నేర్పుగా మల్ల యుద్ధం సలుప గల దిట్టలు. గొప్ప శౌర్య ప్రతాపాలు కల వారు జెట్టీలలో జగజెట్టీలుగా పేరుపొందిన వారు. పట్టణ ప్రజలు ప్రశంసించేలా మల్లయుద్ధంలో ఆ రామకృష్ణులను మట్టుపెట్టి నాకు ప్రీతిపాత్రులు కండు. ఓరీ మావటీ! ఇటు రమ్ము! ఆ గోపాలకులు మన భవన ద్వార సమీపంలో ఉన్న స్తంభం వద్దకు రాగానే నీ ప్రతాపం ప్రదర్శించుము. చెక్కిళ్ళ మీది మదజల ధారల సౌరభాల చేత గండుతుమ్మెదలకు ఆశగొలిపి ఆకర్షించే కువలయాపీడము అనే మన గజరాజాన్ని అదలించి వారి మీదకు డీకొలుపుము. చతుర్దశి నాడు విజయం కోసం వైభవోపేతంగా ధనుర్యాగం చెయ్యాలి. రుద్రుడికి ప్రీతిగా జంతుబలులు ఇవ్వండి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=131&padyam=1156

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

భాగవత జయంత్యుత్సవములు 2020 - సాంస్కృతిక కార్యక్రమాలు । Bhagavata Jayan...

Wednesday, August 12, 2020

శ్రీ కృష్ణ విజయము - 2

( కంసుని మంత్రాలోచన )

10.1-1151-వ.
మఱియు నలుక దీఱక కంసుండు దేవకీవసుదేవుల లోహపాశ బద్ధులంజేసి కేశియనువానిం బిలిచి రామకేశవులం జంపుమని పంపి మంత్రి భట గజారోహక చాణూర ముష్టిక సాల్వ కోసల ప్రముఖుల రావించి యిట్లనియె.
10.1-1152-శా.
"ఎందున్ నన్నెదిరించి పోరుటకు దేవేంద్రాదులుం జాల రీ
బృందారణ్యము మంద నిప్పుడు మదాభీరార్భకుల్ రామ గో
విందుల్ వర్ధిలుచున్న వారఁట రణోర్విం గంసుని ద్రుంతు మం
చున్ దర్పంబులు పల్కుచుందు రఁట యీ చోద్యంబులన్ వింటిరే?
10.1-1153-క.
పట్టణజనములు చూతురు
దట్టంబుగ మల్లరంగతల పార్శ్వములం
బెట్టింపుఁడు తమగంబులు
పుట్టింపుఁడు వీట మల్లుపో రను మాటన్.

భావము:
అంతటితో కంసుడికి అలక తీరలేదు. అతడు దేవకీ వసుదేవులను ఇనప సంకెళ్ళతో బంధించాడు. కేశి అనేవాణ్ణి పిలచి, గోకులానికి వెళ్ళి రామకృష్ణులను చంపి రమ్మని పంపించాడు. తరువాత మంత్రులను, భటులను, మావటివాళ్ళను, చాణూరుడు ముష్టికుడు అనే జెట్టీలనూ, సాల్వుడు కోసలుడు మొదలైన ముఖ్యులనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు. “ఎక్కడైనా, ఇంద్రాదులకు సైతం నన్ను ఎదిరించి పోరాడా లంటే శక్తి చాలదు. అలాంటిది, బలరామకృష్ణులు అనే మదించిన గొల్లపిల్లలు ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్నారుట. “కదనభూమిలో కంసుణ్ణి చంపుతా” మంటూ బీరాలు పలుకుతున్నారుట. మీరు ఈ వింత మాటలు విన్నారా? మల్లజెట్టీ పోటీ ఏర్పాటు చేయండి. మల్ల రంగానికి ముందువైపుల మంచెలు అమర్చండి. పుర ప్రజలు చూస్తారు. నగరం నలుమూలల చాటింపు వేయించండి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=131&padyam=1153

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 1

( కంసునికి నారదుడు జెప్పుట )

10.1-1149-చ.
ఘనుఁడొకనాడు నారదుఁడు కంసునితోడ యశోద కూఁతు దాఁ
గనుటయుఁ జక్రి దేవకికి గర్భజుఁ డౌటయు మున్ను రోహిణీ
తనయుఁడు రాముఁడౌటయును దద్విభు లిద్దఱు మంద నున్నవా
రని యెఱుఁగంగఁ జెప్పిన మహాద్భుత మంచుఁ జలించి గిన్కతోన్.
10.1-1150-చ.
"కొడుకుల మందలోన నిడి గొంటుతనంబున మోసపుచ్చె నీ
బడుగునుఁ బట్టి చంపు టిది భావ్య" మటంచుఁ గృపాణపాణి యై
వడి వసుదేవునిం దునుమ వచ్చిన కంసునిఁ జూచి నారదుం
డుడుగుము చంపఁ బోల దని యోడక మానిచి పోయె మింటికిన్.

భావము:
ఒకరోజు, మహానుభావుడైన నారదుడు కంసుని దగ్గరకు వచ్చి “అ బాలిక యశోద కన్న కన్నె, శ్రీకృష్ణుడు దేవకీగర్భ సంభూతుడు, బలరాముడు రోహిణి కొడుకు, ఆ రామకృష్ణులు ఇద్దరు నందుని మందలో ఉన్నారు” అని తెలియ చెప్పాడు. ఆయన మాటలు విని, ఆశ్చర్యపోయి, ఆగ్రహావేశాలతో కంసుడు కంపించిపోయాడు. ఈ బడుగు వసుదేవుడు కొడుకులను నందవ్రజంలో భద్రంగా దాచిపెట్టి, మంచిమాటలతో నన్ను వంచించాడు. ఈ దిక్కుమాలినవాణ్ణి, ఈ మోసగాణ్ణి పట్టి పరిమార్చడం సరైన పని అంటూ ఖడ్గం చేపట్టి వెంటనే వసుదేవుణ్ణి చంపడానికి కంసుడు ఉద్యుక్తుడయ్యాడు. అతణ్ణి చూసి నారదమహర్షి “వసుదేవుడిని చంపవద్దు. ఇది నీవంటి వాడికి తగదు” అని వాడిని వారించి దేవలోకానికి తరలిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=130&padyam=1150

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :