Sunday, November 4, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 39

10.1-509-శా.
"వంచింపం బనిలేదు బ్రహ్మ కిచటన్ వత్సంబులన్ బాలురన్
వంచించెం గనుఁ బ్రామి; తన్ను మరలన్ వంచించు టాశ్చర్యమే? 
వంచింపం మనకేల? తెచ్చుటకునై వ"ల్దంచు బ్రహ్మాండము
ల్వంచింపన్ మరలింప నేర్చు హరి లీలన్మందహాసాస్యుఁడై.
10.1-510-క.
"గోపాలసుతులు లే రని
గోపికలకుఁ జెప్ప నేల? గోపాలకులున్
గోపికలు నలర బాలుర 
క్రేపులరూపముల నేఁ జరించెద ననుచున్. "

భావము:
“ఇలా పిల్లలను, లేగదూడలను వంచనచేసి మాయం చేయవలసిన అవసరం బ్రహ్మకు ఏమీ లేదు. అయినా నా కన్నుకప్పి మోసం చేసాడు. అతణ్ణి తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన పని కాదు. అయినా వారిని తిరిగి తీసుకురాడానికి అతణ్ణి వంచించడం మనకెందుకు వద్దులే” అంటూ పెదవులపై చిరునవ్వులు చిందించాడు. శ్రీహరి ఈ బ్రహ్మాండాలనే వంచించడం మరలించడం అనే విద్యలలో నేర్పరి కదా. “ఇంటికి తిరిగివెళ్ళి మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పడం దేనికి? నేనే గోపబాలకుల రూపాల లోనూ; గోవత్సాల రూపాల లోనూ సంచరిస్తాను గోపికలు గోపకులు కూడా ఎప్పటిలాగే చాలా సంతోషిస్తారు." అంటూ

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=70&padyam=510

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 38

10.1-507-శా.
బాలుం డయ్యు నితం డఘాసురుఁడు ద్రుంపన్బాలురం గ్రేపులన్
యేలీలన్ బ్రతికించెనొక్కొ? భువి నూహింపం గడుం జోద్య మం
చాలో నంబుజసంభవుండు చని మాయా బాలు శుంభద్బలం
బాలోకింపఁ దలంచి డాఁచె నొకచో నా లేఁగలన్ బాలురన్.
10.1-508-వ.
ఆ సమయంబున, దూడలు పోయిన జాడ యెఱుంగక, తప్పి య ప్పద్మలోచనుం డెప్పటి కొలంకుకడకు వచ్చి, యచ్చోట నె నెచ్చెలులం గానక వారిం జీరి, లేకుండుట నిశ్చయించి గోవిందుండు విశ్వవిదుండు గావున నిది విరించి మొఱంగని యెఱింగి తిరిగి పోవుచు.

భావము:
అలా కృష్ణుడు పశువులను వెతుకుతుంటే, భూమికి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు. “ఇతడు పసిబాలుడు కదా! అఘాసురుడు మ్రింగిన గోపబాలురను లేగలను ఎలా రక్షించగలిగాడు? ఇది ఈ భూలోకం లోనే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ మాయబాలకుడి మహాశక్తి ఎలాంటిదో పరీక్షించి చూద్దాం” అనుకున్నాడు. బ్రహ్మయ్య ఇటు అడవిలోని లేగలను, అటు భోజనాలు చేస్తున్న బాలురనూ ఒక రహస్య ప్రదేశంలో దాచాడు.
అప్పుడు కృష్ణుడు దూడలజాడలు కనపడక తిరిగి కొలను వద్దకు వచ్చాడు. అక్కడ గోపబాలురు కూడా కనిపించలేదు. వారిని పిలిచి వారు ఇక్కడ లేరని నిర్ధారించు కున్నాడు. కృష్ణుడు విశ్వంలోని రహస్యాలన్నీ ఎరిగిన వాడు కదా. ఇది బ్రహ్మదేవుడి మోసం అని గ్రహించాడు. వెంటనే గిరుక్కున వెనుదిరిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=70&padyam=507

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, October 24, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 37

10.1-504-క.
ఇచ్చోఁ బచ్చిక మేసిన; 
విచ్చోఁ ద్రావినవి తోయ; మేగిన విచ్చో; 
నిచ్చోట మంద గొన్నవి; 
యిచ్చోఁ బాసినవి; జాడ యిదె యిదె యనుచున్.
10.1-505-క.
కంజదళాక్షుఁడు వెదకెను
గొంజక లేఁగల నపార గురుతృణవనికా
పుంజంబుల భీకర మృగ 
కుంజంబుల దరుల గిరులఁ గొలఁకుల నదులన్.
10.1-506-వ.
అంత.


భావము:
అలా వెళ్తూ కృష్ణుడు లేగల జాడ కనిపెట్టసాగాడు. “ఇవిగో ఇక్కడ పచ్చిక మేసాయి. ఇక్కడ నీరు త్రాగాయి. ఇదిగో ఇక్కడ మళ్లీ బయలుదేరాయి. ఇక్కడ ఒక్కచోటికి మందగా చేరాయి. ఇదిగో ఇక్కడ మంద విడిపోయాయి.” ఇలా చూసుకుంటూ కృష్ణుడు వెనుదీయకుండా లేగలను వెదుకసాగాడు. దట్టమైన అడవిలో పచ్చిక గుబురులలోనూ; భయంకర మృగాలుండే చెట్ల గుంపుల లోనూ; చెట్లవెనుక; పర్వతాలపైనా; కొలనుల చెంత; నదుల దగ్గర అంతటా వెదికాడు. అప్పుడు...



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Tuesday, October 23, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 36

10.1-502-శా.
కర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో
స్వర్ణాభాసిత వేత్రదండకముతో సత్పింఛదామంబుతోఁ
బూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతోఁ
దూర్ణత్వంబున నేఁగె లేఁగలకునై దూరాటవీవీధికిన్.
10.1-503-వ.
ఇట్లేగుచు.

భావము:
జులపాల జుట్టు చెవులదాకా వేళ్ళాడుతూ ఉంది. మెడలో హారాలు మెరుస్తున్నాయి. బంగరంలా మెరిసే కఱ్ఱ చేతిలో ఉంది. చక్కటి నెమలి పింఛం తలపై ధరించాడు. ఎఱ్ఱటి అర చేతిలో తెల్లటి అన్నం ముద్ద మెరిసి పోతూ ఉంది. ఇలా గోపాల కృష్ణుడు ఉత్సాహంతో లేగదూడలను వెదకడానికి అడవిలో ఎంతో దూర ప్రాంతాలకి వెళ్ళాడు. అలా దూడల జాడలకై వెళ్తూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=69&padyam=502

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, October 22, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 35

10.1-500-మ.
“వినుఁ డో! బాలకులార! క్రేపు లటవీవీధిన్ మహా దూరముం
జనియెన్ గోమల ఘాసఖాదన రతోత్సాహంబుతో నెందుఁ బో
యెనొ? యే మయ్యెనొ క్రూరజంతువులచే నే యాపదం బొందెనో? 
కని తెత్తుం గుడువుండు చల్ది గొఱఁతల్ గాకుండ మీ రందఱున్.”
10.1-501-వ.
అని చెప్పి,


భావము:
“ఓ మిత్రులారా! మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమైపోయి, ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయి నట్లున్నాయి. ఎక్కడకి వెళ్ళాయో యే మయ్యాయో? ఏ క్రూరజంతువుల కైనా చిక్కి ఆపదలో పడ్డాయో? ఏమిటో? నేను వెదకి తీసుకొస్తాను. మీరు కంగారు పడకుండా చల్దులు ఆరగిస్తూ ఉండండి.” అని చెప్పి బయలుదేరాడు. ఇలా తన సహచరులకు చల్దులు తింటూ ఉండమని చెప్పిన కృష్ణుడు....



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Tuesday, October 16, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 34

10.1-499-వ.
ఇట్లు కృష్ణసహితు లయిన గోపకుమారులు చల్దులు గుడుచునెడఁ గ్రేపులు మేపులకుం జొచ్చి, పచ్చని గఱికిజొంపంబుల గుంపుల కుఱికి, లంపులు మేయుచు, ఘోరంబగు నరణ్యంబు నడుమం దోరంబగు దూరంబు జనిన, వానింగానక వెఱచుచున్న గోపడింభకులకు నంభోజనయనుం డిట్లనియె.

భావము:
ఇలా ఇక్కడ కృష్ణుడితోపాటు గోపకుమారులు చల్దులు ఆరగిస్తుండగా, అక్కడ లేగదూడలు పచ్చికలు మేస్తున్నాయి. పచ్చని పచ్చికలున్న గుబుర్లలోనికి జొరబడి దొంగమేతలు మేస్తూ భయంకరమైన అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాయి. గోపబాలకులు భోజనాలు చేస్తూ లేగల కోసం చూస్తే అవి కనిపించ లేదు. వారు కంగారు పడుతుంటే కృష్ణుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=68&padyam=499

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, October 15, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 33

10.1-497-వ.
అ య్యవసరంబున.
10.1-498-సీ.
కడుపున దిండుగాఁ గట్టిన వలువలో; 
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్రదండంబును; 
జాఱి రానీక డాచంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది; 
ముద్ద డాపలిచేత మొనయ నునిచి
చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుగాయలు; 
వ్రేళ్ళ సందులయందు వెలయ నిఱికి
10.1-498.1-ఆ.
సంగడీల నడుమఁ జక్కగఁ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె.


భావము:
అలా చల్దులు గుడుస్తున్న ఆ సమయంలో యాగభోక్త అయిన శ్రీకృష్ణుడు దేవతలు అందరూ ఆశ్చర్య చకితులు అవుతుండగా మనోహర శైశవ చేష్టలు ప్రదర్శిస్తున్నాడు. పొట్టమీదకు దట్టీలా కట్టిన అంగవస్త్రంలో మనోజ్ఞమైన మురళిని ముడిచాడు. నిర్మలమైన కొమ్ముబూర, పశువుల తోలు కఱ్ఱలను ఎడం చంకలో చక్కగా ఇరికించి జారిపోకుండా పట్టుకున్నాడు. ఎడమ చేతిలో ఏమో మీగడ పెరుగు కలిపిన చద్దన్నం ముద్ద పట్టుకున్నాడు. కోరిమరీ తెచ్చుకున్న నంజుడు ఆవకాయ ముక్కలు వేళ్ళ మధ్య నేర్పుగా ఇరికించుకున్నాడు. తన తోటి పిల్లల మధ్య చక్కగా కూర్చుని వారితో ఒక ప్రక్క పరిహాసాలు ఆడుతున్నాడు. మరొక ప్రక్క చిరునవ్వులు రువ్వుతున్నాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :