Monday, August 6, 2018

శ్రీకృష్ణ లీలలు - ౫౬

10.1-388-క.
బంధవిమోచనుఁ డీశుఁడు
బంధింపఁ బెనంగు జనని పాటోర్చి సుహృ
ద్బంధుఁడు గావున జననీ
బంధంబునఁ గట్టుబడియెఁ బాటించి నృపా!
10.1-389-క.
సంగడిఁ దిరిగెడు శంభుఁడు
నంగాశ్రయ యైన సిరియు నాత్మజుఁడై యు
ప్పొంగెడు పద్మజుఁడును గో
పాంగన క్రియఁ గరుణ పడయ రఖిలేశ్వరుచేన్.

భావము:
ఓ పరీక్షిన్మహారాజా! భగవంతుడు, భవబంధాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేవాడు అయిన కృష్ణబాలుడు కన్నతల్లి కష్టం చూడలేక అలా త్రాడుకి కట్టుపడిపోయాడు; అతడు ఆప్తులైన వారికి ఆత్మబంధువు గదా!
ఆయనతో ప్రియమిత్రుడై మెలగే శంకరుడు గానీ, ఆయన వక్షస్థలాన్ని ఆశ్రయించుకొని ఉండే లక్ష్మీదేవి గానీ, ఆయన కొడుకును అని ఉప్పొంగిపోయే బ్రహ్మదేవుడు గానీ శ్రీకృష్ణుని వలన యశోద పొందిన అనుగ్రహాన్ని పొందలేకపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54&padyam=389

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, August 4, 2018

శ్రీకృష్ణ లీలలు - ౫౫

10.1-386-వ.
అప్పు డా యవ్వయు గోపికలును వెఱంగుపడిరి; తదనంతరంబ
10.1-387-ఆ.
ఒడలఁ జెమట లెగయ నుత్తరీయము జాఱ
వీడి యున్న తుఱుము విరులు రాలఁ
గట్టరాని తన్నుఁ గట్టెద నని చింతఁ
గట్టుకొనిన తల్లిఁ గరుణఁ జూచి.

భావము:
ఆప్పుడు ఆ వింతను, పిల్లాణ్ణి చూసి యశోదా, గోపికలూ నివ్వెరపోయారు. పిమ్మట, పడుతున్న శ్రమకు యశోద శరీరమంతా చమటలు పట్టాయి. కొప్పు వదులైపోయి పువ్వులు రాలిపోయాయి. అలా కట్టటానికి శక్యంకాని తనను కట్టాలనే పట్టుదలతో తల్లి పడుతున్న తంటాలు చూసి నల్లనయ్య జాలి పడి......
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54&padyam=387

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, August 3, 2018

శ్రీకృష్ణ లీలలు - ౫౪

10.1-384-వ.
ఇట్లు గ్రద్దన నా ముద్దియ ముద్దులపట్టి యుదరంబు గట్ట నడరుచుఁ జతురంబుగఁ జక్క నొక్కత్రాడు చుట్టిన నది రెండంగుళంబులు కడమపడియె; మఱియు నొక్క బంధనంబు సంధించి వలగొనిన నంతియ కొఱంత యయ్యె; వెండియు నొక్కపాశంబు గూర్చి పరివేష్టించిన వెల్తిఁ జూపె; నిట్లు.
10.1-385-క.
తజ్జనని లోఁగిటం గల
రజ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్
బొజ్జ దిరిగి రా దయ్యె జ
గజ్జాలము లున్న బొజ్జఁ గట్టన్ వశమే?

భావము:
ఇలా తన ముద్దుల కొడుకును కట్టటానికి ఒక త్రాడు తెచ్చి నడుం చుట్టూ చుట్టబోయింది. అది 2 అంగుళాలు తక్కువైంది. మరో త్రాడు జతచేసినా అదే 2 అంగుళాలు తక్కువైంది. మరొక్క త్రాడు ముడేసినా అంతే తక్కువైంది. ఇలాఆ యమ్మ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ వరుసగా కలిపినా అంతే వెలితి ఉండిపోయింది. ముజ్జగములూ దాగి ఉన్న ఆ చిరుబొజ్జను కట్టటం ఎవరి తరం?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54&padyam=384

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - ౫౩

10.1-382-ఆ.
పట్టి యెల్లబోఁటి పట్టి యీతం డని
గట్టితలఁపుతోడఁ గట్టెఁ గాక
పట్టికడుపు పెక్కు బ్రహ్మాండములు పట్టు
టెఱిఁగి నేనిఁ దల్లి యేల కట్టు?
10.1-383-క.
చిక్కఁడు సిరికౌగిటిలోఁ
జిక్కఁడు సనకాది యోగిచిత్తాబ్జములం
జిక్కఁడు శ్రుతిలతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్


భావము:
యశోదాదేవి తన చిన్నికృష్ణుడు కూడా అందరి లాంటి బాలుడే అనుకుంది గనుక అతణ్ణి కట్టగలిగింది; అలాకాక, అనేకమైన బ్రహ్మాండాలు ఆ బాలుని కడుపులో ఉంటాయని తెలిస్తే ఆ తల్లి కట్టేయదు కదా? ఆ లీలా గోపాలకృష్ణుడు సామాన్యమైనవాడా కాదు. లక్ష్మీదేవి కౌగిటలోను చిక్కలేదు, సనకసనందాది మహార్షుల చిత్తాలకు చిక్కలేదు. ఉపనిషత్తులకు చిక్కలేదు. ఆహా! అంతటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. భక్తపరాధీనుడు గనుక తల్లి యనే మిషచే తనకు అంతరంగ భక్తురాలు గనుక యశోదచేతికి చిక్కాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Saturday, July 28, 2018

శ్రీకృష్ణ లీలలు - ౫౨

10.1-380-క.
ఱోలను గట్టుబడియు న
బ్బాలుఁడు విలసిల్లె భక్త పరతంత్రుండై
యాలాన సన్నిబద్ధ వి
శాల మదేభేంద్రకలభ సమరుచి నధిపా!
10.1-381-క.
వెలి లోను మొదలు దుది నడు
ములు లేక జగంబు తుదియు మొదలున్ నడుమున్
వెలియున్ లో నగు నీశ్వరు
నలవడునే కట్టఁ బ్రణతురాల్ గా కున్నన్?

భావము:
పరీక్షిన్మహారాజా! బాలగోపాలుడు భక్తుల వశంలో ఉండే వాడు గనుక తను రోటికి కట్టిబడిపోయి ఉన్నాడు. దానికి అతడు ఏమాత్రం బిక్కమొగం వేయలేదు. పైగా కట్టుకొయ్యకు కట్టబడిన గున్న ఏనుగు వలె హుందాగా వెలిగిపోతున్నాడు.
విష్ణుమూర్తికి లోపల, వెలుపల అనేవీ, మొదలు, చివర, మధ్య అనేవి ఏమీలేవు; ఈ లోకాలు అన్నిటికీ మొదలు, చివర, మధ్య, లోపల, వెలుపల సర్వం అతడే; అటువంటి ఆయనను కట్టేయాలంటే, శరణాగతి చెందిన పరమభక్తురాలు గనుక యశోదకు సాధ్యం అయింది కాని, లేకపోతే సాధ్యం కాదు గదా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54&padyam=381

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, July 19, 2018

శ్రీకృష్ణ లీలలు - ౫౧

10.1-378-వ.
అని మర్మంబు లెత్తి పలికి.
10.1-379-క.
ఆ లలన గట్టె ఱోలన్
లీలన్ నవనీతచౌర్యలీలుం బ్రియ వా
గ్జాలుం బరివిస్మిత గో
పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్.


భావము:
ఇలా యశోద అవతార రహస్యాలు ఎత్తుకుంటూ దొంగకృష్ణుని ఎత్తిపొడిచి, అతనిని ఒక రోలుకి కట్టేసింది. ఆ దుడుకు పిల్లాడు వెన్నదొంగిలించటమనే క్రీడ కలవాడు, సంతోషాలు పంచుతూ గలగలా మాట్లాడు వాడు. తల్లి తనను కట్టిసినందుకు ఆశ్చర్యపోతున్నట్లు కనబడుతున్న గొల్లపిల్లాడు. ముత్తెపుబొట్టు నుదుట అలంకారంగా మెరుస్తున్న వాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Wednesday, July 18, 2018

శ్రీకృష్ణ లీలలు - ౫౦

10.1-377-సీ.
తోయంబు లివి యని తొలగక చొచ్చెదు; 
తలఁచెదు గట్టైనఁ దరల నెత్త; 
మంటితో నాటలు మానవు; కోరాడె; 
దున్నత స్తంభంబు లూఁపఁ బోయె; 
దన్యుల నల్పంబు లడుగంగఁ బాఱెదు; 
రాచవేఁటలఁ జాల ఱవ్వఁదెచ్చె; 
దలయవు నీళ్ళకు నడ్డంబు గట్టెదు; 
ముసలివై హలివృత్తి మొనయఁ; జూచె
10.1-377.1-ఆ.
దంబరంబు మొలకు నడుగవు తిరిగెద
వింకఁ గల్కిచేఁత లేల పుత్ర! 
నిన్ను వంప వ్రాల్ప నే నేర ననియొ నీ
విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి."

భావము:

ఒరే కన్నయ్యా! అల్లరి పిల్లాడా! అదురు బెదురు లేకుండా నీళ్ళలో చొరబడి పోతావు! (మత్స్యావతారుడవుగా నీళ్ళల్లో తిరిగావు కదా). ఎంత పెద్ద బండైనా ఎత్తేయాలని చూస్తావు! (కూర్మావతారుడవుగా మందరపర్వతాన్ని ఎత్తావు కదా). పరాయి వాళ్ళ దగ్గర అల్ప మైన వాటికోసం చెయ్యి చాస్తావు! (వామనాతారుడవుగా రాక్షసచక్రవర్తి బలివద్ద చెయ్యిచాపావు కదా). నీకు రాజసం ఎక్కువ ఎన్నో జగడాలు తెస్తావు! (పరశురామావతారుడవుగా రాజలోకాన్ని సంహరించావు కదా). నీళ్ళ ప్రవాహానికి అడ్డకట్టలు వేయాలని చూస్తావు! (రామావతారుడవు సముద్రానికే సేతువు కట్టావు కదా). దుడ్డుకర్ర పట్టుకొని నాగలిదున్నే వాడిలా నటిస్తావు! (బలరామావాతారుడవుగా ముసలము పట్టావు కదా). మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా తిరుగుతావు! (బుద్ధావతారుడవుగా సన్యాసిగా ప్రకాశించావు కదా). ఇవి చాలవు నట్లు ఇంకా దుడుకు చేష్ట లెందుకు చేస్తావో ఏమిటో? (ఇక ముందు కల్కి అవతార మెత్తి దుష్టులను శిక్షించడానికి ఏవేం చేస్తావో). నిన్ను నేను భయభక్తులలో పెట్టలేను అనుకునేగా ఇలా కింద మీద తెలియకుండ మిడిసిపడు తున్నావు! (త్రివిక్రమావతారుడవుగా బ్రహ్మాండభాండందాటి ఎదిగిపోయావు కదా). ఇలా ఎత్తిపొడుపు మాటలతో తల్లి యశోదాదేవి కొంటెకొడుకును దెప్పుతోంది.

చమత్కారమైన అలంకారం నిందాస్తుతి. ఓ ప్రక్కన నిందిస్తున్నా, స్తుతి పలుకుతుంటే నిందాస్తుతి అంటారు. ఇలా అల్లరి కృష్ణబాలుని యశోద దెప్పటంలో నిందాస్తుతితో బహు చక్కగా అలరించారు మన పోతన్నగారు. ఆస్వాదిద్దాం రండి."

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54&padyam=377

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :