Tuesday, July 17, 2018

శ్రీకృష్ణ లీలలు - ౪౯

10.1-375-క.
పట్టినఁ బట్టుపడని నినుఁ
బట్టెద నని చలముఁగొనినఁ బట్టుట బెట్టే? 
పట్టువడ వండ్రు పట్టీ
పట్టుకొనన్ నాఁకుఁగాక పరులకు వశమే?
10.1-376-క.
ఎక్కడనైనను దిరిగెద; 
వొక్క యెడన్ గుణము గలిగి యుండవు; నియమం
బెక్కడిది నీకు? మఱచినఁ
జక్కగఁ బోయెదవు పెక్కు జాడలఁ బుత్రా!

భావము:
కన్నా! ఎక్కడబడితే అక్కడ తిరుగుతూ ఉంటావు. ఒకచోట కుదురుగా, బుద్ధి కలిగి ఉండవు కదా. నీకు పద్ధతి ప్రకారం ఉండటం అంటూ లేదా ఏమిటి? ఒక్క క్షణం ఏమరుపాటు చెందితే చాలు ఎన్నివేషాలైనా వేసి, ఎక్కడికైనా పోతావురా కొడుకా! ఇలా యశోదాదేవి తన కొడుకు కృష్ణుని దెబ్బలాడుతూంటే కూడా తత్వమే కనబడుతోందిట. “భగవంతుడవు సర్వాంతర్యామివి, ఎక్కడైనా తిరుతావు. గుణాతీతుడవు, నీవు బుద్ధికలిగి కూర్చోడం ఏమిటి? సర్వోన్నతుడవు నియమాలు ఎవరు పెట్టగలరు? ఈ ఎరుక మరచి ఒక్క క్షణం ఏమరుపాటు చెందితే చాలు. మిత్రులు, శత్రులు మొదలైన అనేకంగా కనిపిస్తావు కదయ్యా!” . . . అవును ఆత్మావైపుత్రా అంటారు పెద్దలు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54&padyam=375

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, July 16, 2018

శ్రీకృష్ణ లీలలు - ౪౮

10.1-373-వ.
ఇట్లనియె.
10.1-374-క.
“వీరెవ్వరు? శ్రీకృష్ణులు
గారా? యెన్నడును వెన్నఁ గానరఁట కదా! 
చోరత్వం బించుకయును
నేర రఁట! ధరిత్రి నిట్టి నియతులు గలరే?

భావము:
యశోదాదేవి కృష్ణునితో ఇలా అంది.
ఓహో ఎవరండీ వీరు శ్రీకృష్ణులవారేనా? అసలు వెన్నంటే ఎప్పుడూ చూడనే చూడలేదట కదా! దొంగతనమంటే ఏమిటో పాపం తెలియదట కదా! ఈ లోకంలో ఇంతటి బుద్ధిమంతులు లేనేలేరట!
పట్టుబడ్డ వెన్నదొంగను కొట్టటానికి చేతులురాని తల్లి యశోదాదేవి కొడుకును ఇలా దెప్పుతోంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54&padyam=374

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, July 15, 2018

శ్రీకృష్ణ లీలలు - ౪౭

10.1-371-వ.
ఇట్లు గూడం జని.
10.1-372-సీ.
స్తంభాదికంబులు దనకు నడ్డం బైన; 
నిట్టట్టు చని పట్టనీనివాని
నీ తప్పు సైరింపు మింక దొంగిలఁ బోవ; 
నే నని మునుముట్ట నేడ్చువాని
గాటుక నెఱయంగఁ గన్నులు నులుముచు; 
వెడలు కన్నీటితో వెగచువాని
నే దెస వచ్చునో యిది యని పలుమాఱు; 
సురుగుచుఁ గ్రేగంటఁ జూచువానిఁ
10.1-372.1-ఆ.
గూడఁ బాఱి పట్టుకొని వెఱపించుచుఁ
జిన్న వెన్నదొంగ చిక్కె ననుచు
నలిగి కొట్టఁ జేతు లాడక పూఁబోఁడి
కరుణతోడ బాలుఁ గట్టఁ దలఁచి.


భావము:
యశోద ఇలా శ్రీకృష్ణబాలుడి వెంటపడి, కృష్ణబాలుడు వాకిట్లో స్తంభాలు అడ్డంగా ఉంటే వాటి చాటున ఇటు అటు దొరక్కుండా పరిగెడుతున్నాడు; “ఈ ఒక్కసారికీ క్షమించవే! ఇంకెప్పుడూ దొంగతనం చేయనే!” అంటూ మునుముందే ఏడుస్తున్నాడు; కాటుక చెదిరేలా కళ్ళు నులుముకుంటున్నాడు; కన్నీరు కారుతుండగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు; తన తల్లి ఎటువైపు నుంచి వస్తుందో అని బెదురుతూ మాటి మాటికీ క్రీగంట చూస్తున్నాడు, పక్కలకు తప్పుకుంటున్నాడు; చివరికి ఎలాగైతేనేం వెంటబడి తరుముతున్న యశోద “అమ్మయ్య! ఈ చిన్ని వెన్నదొంగచిక్కాడు.” అంటూ భుజం పట్టుకుంది; కానీ ఆమెకు కొట్టటానికి చేతులు రాలేదు, యశోద శరీరము, స్వభావము కూడా పువ్వువలె సుతిమెత్తనైన పూబోడి కదా; కొడుకు మీద జాలిపడి కొట్టకుండా పోనీలే కట్టివేద్దా మనుకుంది;



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Saturday, July 14, 2018

శ్రీకృష్ణ లీలలు - ౪౬

10.1-369-వ.
అప్పుడు.
10.1-370-మ.
స్తనభారంబున డస్సి క్రుస్సి యసదై జవ్వాడు మధ్యంబుతో
జనిత స్వేదముతోఁ జలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో
వనజాతేక్షణ గూడ బాఱి తిరిగెన్ వారించుచున్ వాకిటన్
ఘనయోగీంద్ర మనంబులున్ వెనుకొనంగా లేని లీలారతున్. 

భావము:
అప్పుడు. యశోదామాత “ఆగు, ఆగు” అంటూ ఇంటి ముంగిలిలో పరుగెడుతున్న బాలకృష్ణుడి వెంట పరుగెడుతున్నది. పెద్ద వక్షోజాల బరువుతో అలసిపోతూ, వంగిపోతూ ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. పరుగెట్టే వేగానికి కొప్పు కదిలి జారిపోతూ ఉంది. చమటలు కారిపోతూ ఉన్నాయి. పైట జారిపోతూ ఉంది. మహామహా యోగీంద్రుల మనస్సులు కూడా పట్టుకోలేని ఆ లీలాగోపాల బాలుణ్ణి పట్టాలనే పట్టుదలతో వెంటపడి తరుముతూ ఉన్నది.ఎంత అదృష్టం యశోదాదేవిది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=53&padyam=370

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, July 13, 2018

శ్రీకృష్ణ లీలలు - ౪౫

10.1-367-వ.
అని నిశ్చయించి కేలనున్న కోల జళిపించి “బాలా! నిలునిలు” మని బగ్గుబగ్గున నదల్చుచు దల్లి డగ్గఱిన బెగ్గడిలిన చందంబున నగ్గలికచెడి ఱోలు డిగ్గ నుఱికి.
10.1-368-క.
గజ్జలు గల్లని మ్రోయఁగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షిజ్జనములు నగఁ దల్లియుఁ
బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా!


భావము:
అల్లరి కృష్ణుని ఆగడాలు ప్రత్యక్షంగా చూసిన తల్లి యశోద. .
దండించాలి అని నిర్ణయించుకొంది. చేతిలో బెత్తం పట్టుకొని కోపంతో ఝళిపిస్తూ “ఒరేయ్ పిల్లాడా! ఆగక్కడ” అని అరుస్తూ యశోద దగ్గరకు వచ్చింది . కృష్ణ బాలుడు భయపడినట్లు ముఖం పెట్టి, అల్లరి ఆపేసాడు. గభాలున రోలుమీంచి కిందకి దూకాడు. చిలిపి కృష్ణుడు చిందులు తొక్కటాలు మానేసి, చాలా వేగంగా పరుగు లంకించుకున్నాడు. కాలి గజ్జలు గల్లు గల్లు మని మ్రోగుతున్నాయి. తల్లి యశోదాదేవి వెంట పరుగెట్టుకుంటూ వస్తోంది. గోపికా స్త్రీలు నవ్వుతూ చూస్తున్నారు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Monday, July 9, 2018

శ్రీకృష్ణ లీలలు - ౪౪

10.1-365-వ.
అని వితర్కించి.
10.1-366-క.
లాలనమున బహుదోషము
లోలిం బ్రాపించుఁ దాడనోపాయములన్
జాల గుణంబులు గలుగును
బాలురకును దాడనంబ పథ్యం బరయన్.

భావము:
కన్నయ్యకు బుద్ధి చెప్పటం ఎలా అని ఆలోచించుకుంటోంది. గారాబం మరీ ఎక్కువ చేస్తే పిల్లలు చివరికి చెడిపోతారు. అప్పుడప్పుడు తగలనిస్తుంటే మంచి గుణాలు అలవడతాయి. పిల్లల మితిమీరే అల్లరికి చక్కటి ఔషధం దండోపాయం.
“దండం దశగుణ భవేత్” అంటారు కదా.

“శ్లో.| లాలనాద్బహవో దోషాన్తాడనాద్బహవో గుణాః|
తస్మాత్పుత్రం చ శిష్యం చ తాడయేన్నతులాలయేత్ఛ||”
అని ఒక నీతిశాస్త్ర బోధ.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=53&padyam=366

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - ౪౩

10.1-364-సీ.
"బాలుఁ డీతండని భావింతు నందునా; 
యే పెద్దలును నేర రీక్రమంబు
వెఱ పెఱుంగుటకు నై వెఱపింతు నందునా; 
కలిగి లే కొక్కఁడు గాని లేఁడు
వెఱపుతో నా బుద్ధి వినిపింతు నందునా; 
తనుఁ దాన యై బుద్ధిఁ దప్పకుండు
నొం డెఱుంగక యింట నుండెడి నందునా; 
చొచ్చి చూడని దొకచోటు లేదు
10.1-364.1-ఆ.
తన్ను నెవ్వరైనఁ దలపోయఁ బాఱెడి
యోజ లేదు భీతి యొక టెఱుంగఁ
డెలమి నూరకుండఁ డెక్కసక్కెము లాడుఁ
బట్టి శాస్తిజేయు భంగి యెట్లు?"


భావము:
కన్నయ్యని పోనీ పసిపిల్లాడులే అనుకుందామంటే, ఇలాంటి నడవడి పెద్దలకు ఎవరికి తెలియదు; పోనీ ఇతడికి కొద్దిగా భయం చెబ్దాం అనుకుందామంటే, లేకలేక పుట్టినవాడు వీడొక్కడే మరోడు లేడాయె; బెదిరించి బుద్ధులు నేర్పుదాం అంటే, తనంతట తనే బుద్ధిగా ఉంటున్నాడాయె; అలాగనీ ఏమి తెలియకుండా ఇంట్లో కూర్చుంటాడులే అనుకుంటే, వీడు వెళ్ళని చోటు, చూడని చోటు ఏదీ లేనే లేదాయె; తనని ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచనే కూడా వీడికి రాదు; అసలు భయం అన్నదే తెలియదు; మళ్ళీ ఊరికే ఉండడు, ఎకసెక్కాలాడుతూనే ఉంటాడు; వీణ్ణి పట్టుకొని తగిన శాస్తి చేయటం ఎలా?


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=53&padyam=364


: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :