Sunday, July 15, 2018

శ్రీకృష్ణ లీలలు - ౪౭

10.1-371-వ.
ఇట్లు గూడం జని.
10.1-372-సీ.
స్తంభాదికంబులు దనకు నడ్డం బైన; 
నిట్టట్టు చని పట్టనీనివాని
నీ తప్పు సైరింపు మింక దొంగిలఁ బోవ; 
నే నని మునుముట్ట నేడ్చువాని
గాటుక నెఱయంగఁ గన్నులు నులుముచు; 
వెడలు కన్నీటితో వెగచువాని
నే దెస వచ్చునో యిది యని పలుమాఱు; 
సురుగుచుఁ గ్రేగంటఁ జూచువానిఁ
10.1-372.1-ఆ.
గూడఁ బాఱి పట్టుకొని వెఱపించుచుఁ
జిన్న వెన్నదొంగ చిక్కె ననుచు
నలిగి కొట్టఁ జేతు లాడక పూఁబోఁడి
కరుణతోడ బాలుఁ గట్టఁ దలఁచి.


భావము:
యశోద ఇలా శ్రీకృష్ణబాలుడి వెంటపడి, కృష్ణబాలుడు వాకిట్లో స్తంభాలు అడ్డంగా ఉంటే వాటి చాటున ఇటు అటు దొరక్కుండా పరిగెడుతున్నాడు; “ఈ ఒక్కసారికీ క్షమించవే! ఇంకెప్పుడూ దొంగతనం చేయనే!” అంటూ మునుముందే ఏడుస్తున్నాడు; కాటుక చెదిరేలా కళ్ళు నులుముకుంటున్నాడు; కన్నీరు కారుతుండగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు; తన తల్లి ఎటువైపు నుంచి వస్తుందో అని బెదురుతూ మాటి మాటికీ క్రీగంట చూస్తున్నాడు, పక్కలకు తప్పుకుంటున్నాడు; చివరికి ఎలాగైతేనేం వెంటబడి తరుముతున్న యశోద “అమ్మయ్య! ఈ చిన్ని వెన్నదొంగచిక్కాడు.” అంటూ భుజం పట్టుకుంది; కానీ ఆమెకు కొట్టటానికి చేతులు రాలేదు, యశోద శరీరము, స్వభావము కూడా పువ్వువలె సుతిమెత్తనైన పూబోడి కదా; కొడుకు మీద జాలిపడి కొట్టకుండా పోనీలే కట్టివేద్దా మనుకుంది;



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: