Monday, July 9, 2018

శ్రీకృష్ణ లీలలు - ౪౩

10.1-364-సీ.
"బాలుఁ డీతండని భావింతు నందునా; 
యే పెద్దలును నేర రీక్రమంబు
వెఱ పెఱుంగుటకు నై వెఱపింతు నందునా; 
కలిగి లే కొక్కఁడు గాని లేఁడు
వెఱపుతో నా బుద్ధి వినిపింతు నందునా; 
తనుఁ దాన యై బుద్ధిఁ దప్పకుండు
నొం డెఱుంగక యింట నుండెడి నందునా; 
చొచ్చి చూడని దొకచోటు లేదు
10.1-364.1-ఆ.
తన్ను నెవ్వరైనఁ దలపోయఁ బాఱెడి
యోజ లేదు భీతి యొక టెఱుంగఁ
డెలమి నూరకుండఁ డెక్కసక్కెము లాడుఁ
బట్టి శాస్తిజేయు భంగి యెట్లు?"


భావము:
కన్నయ్యని పోనీ పసిపిల్లాడులే అనుకుందామంటే, ఇలాంటి నడవడి పెద్దలకు ఎవరికి తెలియదు; పోనీ ఇతడికి కొద్దిగా భయం చెబ్దాం అనుకుందామంటే, లేకలేక పుట్టినవాడు వీడొక్కడే మరోడు లేడాయె; బెదిరించి బుద్ధులు నేర్పుదాం అంటే, తనంతట తనే బుద్ధిగా ఉంటున్నాడాయె; అలాగనీ ఏమి తెలియకుండా ఇంట్లో కూర్చుంటాడులే అనుకుంటే, వీడు వెళ్ళని చోటు, చూడని చోటు ఏదీ లేనే లేదాయె; తనని ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచనే కూడా వీడికి రాదు; అసలు భయం అన్నదే తెలియదు; మళ్ళీ ఊరికే ఉండడు, ఎకసెక్కాలాడుతూనే ఉంటాడు; వీణ్ణి పట్టుకొని తగిన శాస్తి చేయటం ఎలా?


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=53&padyam=364


: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: