Sunday, May 7, 2017

దక్ష యాగము - 25:

4-74-వ.
అది యెట్లతనిచేత భవత్సంబంధంబునం జేసి పూజఁబడయమికి నతనికి నీకు విరోధంబునకు హేతు వెట్టి దని యంటివేని.
4-75-మ.
నిరహంకార నిరస్తపాప సుజనానింద్యోల్ల సత్కీర్తిఁ గొం
దఱు కామించి యశక్తులై మనములన్ దందహ్యమానేంద్రియా
తురులై యూరక మచ్చరింతురు; మహాత్ముం డీశ్వరుం డైన యా
హరితో బద్ద విరోధముం దొడరు దైత్యశ్రేణి చందంబునన్.

టీకా:
అది = అది; ఎట్లు = ఏలా; అతని = అతని; చేతన్ = చేత; భవత్ = నీయందలి; సంబంధంబునన్ = సంబంధము; చేసి = వలన; పూజన్ = పూజలను; పడయమి = పొందలేకపోవుట; కిన్ = కి; అతని = అతని; కిన్ = కి; నీకు = నీకు; విరోధంబున్ = శతృత్వమున; కున్ = కు; హేతువు = కారణము; ఎట్టిది = ఎటువంటిది; అని = అని; అంటివేని = అంటుంటే. నిరహంకార = అహంకారములేని; నిరస్త = పోగొట్టుకొనిన; పాప = పాపములు కలిగిన; సుజనా = మంచివారి; అనింద్య = నిదింపదగనివారి; ఉల్లసత్ = ప్రకాశిస్తున్న; కీర్తిన్ = కీర్తిని; కొందఱు = కొంతమంది; కామించి = కోరుకొని; అశక్తులు = శక్తిలేనివారు; ఐ = అయ్యి; మనములన్ = మనసులలో; దందహ్యమాన = దహింపబడుతున్న; ఇంద్రియ = ఇంద్రియముల; ఆతురులు = బాధలుగలవారు; ఐ = అయ్యి; ఊరక = ఉట్టినే; మచ్చరింతురు = ఈర్ష్యవహింతురు; మహాత్ముండు = గొప్పవాడు; ఈశ్వరుడున్ = భగవంతుడును; ఐన = అయిన; ఆ = ఆ; హరి = విష్ణువు; తోన్ = తోటి; బద్ధ = మిక్కిలి; విరోధమున్ = శతృత్వమున; తొడరు = పూనుకొను; దైత్య = దానవుల {దైత్యులు - దితి యొక్క పుత్రులు, దానవుల}; శ్రేణి = సమూహము; చందంబునన్ = వలె.

భావము:
‘అది ఎలా? నీ సంబంధం చేత నాకు గౌరవం లభించక పోవడానికి, నీకూ అతనికి విరోధం కలగడానికి కారణమేమిటి?’ అని నీవు అడిగితే... అహంకారం, పాపం లేని సజ్జనులు పొందే కీర్తిని తాముకూడా పొందాలని కోరుకొని కొందరు అసమర్థులై మనసులో కుతకుత ఉడికిపోయి, భగవంతుడైన హరితో వైరం పెంచుకొన్న రాక్షసులవలె ఆ సజ్జనులపై అసూయ పెంచుకుంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=75



: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, May 6, 2017

దక్ష యాగము - 24:


4-72-చ.
సమద రిపుప్రయుక్త పటుసాయక జర్జరితాంగుఁ డయ్యు దుః
ఖమును దొఱంగి నిద్రఁగనుఁ గాని కృశింపఁడు మానవుండు; నో!
యుమ! విను మిష్ట బాంధవదురుక్తులు మర్మము లంట నాఁటఁ జి
త్తమున నహర్నిశంబుఁ బరితాపము నొంది కృశించు నెప్పుడున్.
4-73-క.
విను లోకోత్కృష్టుఁడు ద
క్షునికిఁ దనూభవలలోనఁ గూరిమిసుతవై
నను నా సంబంధంబున
జనకునిచేఁ బూజఁ బడయఁజాలవు తరుణీ!

టీకా:
సమద = మదముతోకూడిన; రిపు = శత్రువుచే; ప్రయుక్త = ప్రయోగింపబడిన; పటు = గట్టి; సాయక = బాణములచేత; జర్జరిత = పెక్కుగాయములయిన; అంగుడు = దేహముకలవాడు; అయ్యున్ = అయినప్పటికిని; దుఃఖమునున్ = దుఃఖమునుండి; తొఱంగి = విడిచిపెట్టి; నిద్రన్ = నిద్రను; కనున్ = పొందును; కాని = కాని; కృశింపడు = కృశించిపోడు; మానవుండు = మానవుడు, మానము కలవాడు; ఓ = ఓ; ఉమ = పార్వతీదేవి; వినుము = వినుము; ఇష్ట = కావలసిన; బాంధవ = బంధువుల; దురుక్తులు = చెడ్డమాటలు; మర్మములన్ = మనసులోతులను, జీవస్థానమును; అంటనాట = గట్టిగగుచ్చుకోగా; చిత్తమునన్ = మనసులో; అహర్నిశము = రాత్రింబవళ్లు; పరితాపమున్ = సంతాపమును; ఒంది = పొంది; కృశించున్ = కృశించిపోవును; ఎప్పుడున్ = ఎప్పుడైనాసరే. విను = వినుము; లోకన్ = లోకమునకి; ఉత్కృష్టుడు = శ్రేష్టుడు; దక్షుని = దక్షుని; కిన్ = కి; తనూభవలు = సంతానము {తనూభవ - తనూ (దేహమున) భవ (పుట్టినవారు)}; లోనన్ = అందు; కూరిమి = ఇష్టమైన; సుతవు = కూతురవు; ఐనను = అయినప్పటికిని; = నా = నా ఎడలి; సంబంధంబునన్ = సంబంధమువలన; జనకుని = తండ్రి; చేన్ = చేత; పూజన్ = పూజలను; పడయజాలవు = పొందలేవు; తరుణీ = స్త్రీ {తరుణి - తరుణ వయసునున్నామె, స్త్రీ}.

భావము:
బలవంతుడైన శత్రువు ప్రయోగించిన బాణాలచేత శరీరం తూట్లు పడినా ఆ బాధను భరించి వ్యక్తి ఎలాగో నిద్రపోతాడు కాని క్రుంగి కృశించిపోడు. సతీ! దగ్గరి చుట్టాల దురహంకారంతో కూడిన దుర్భాషలు గుండెల్లో లోతుగా నాటుకొని మాటిమాటికి బాధ కలిగిస్తూ అహర్నిశం కృశింపజేస్తాయి. తరుణీ! విను. లోకాలన్నిటికీ గొప్పవాడైన దక్షునికి తన కుమార్తె లందరిలోనూ నీవు మిక్కిలి ప్రియమైన కూతురువైనా నా సంబంధం వల్ల నీ తండ్రి నిన్ను గౌరవించడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=73

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, May 5, 2017

దక్ష యాగము - 23:

4-70-క.
విను; మట్టి కుటిలు లగు దు
ర్జనుల గృహంబులకు బంధుసరణిని బోవం
జనదు; వినీతుల కది గడు
ననుచిత మైనట్ల యుండు; నది యెట్లనినన్.
4-71-ఆ.
కుటిలబుద్ధు లయిన కుజనుల యిండ్లకు
నార్యు లేగ, వా రనాదరమున
బొమలు ముడిపడంగ భూరి రోషాక్షులై
చూతు; రదియుఁ గాక సుదతి! వినుము.

టీకా:
వినుము = వినుము; ఇట్టి = ఇటువంటి; కుటిలులు = వంకరబుద్ధికలవారు; అగు = అయిన; దుర్జనుల = దుష్టుల; గృహంబుల్ = ఇళ్ళ; కున్ = కి; బంధు = బంధుత్వపు; సరణిన్ = వరసచూసి; పోవన్ = పోవుట; చనదు = తగదు; వినీతుల్ = మిక్కిలి నీతిమంతుల; కున్ = కి; అది = అది; కడున్ = మిక్కిలి; అనుచితమున్ = ఉచితముకానిది; ఐనట్లు = అయిన విధముగ; ఉండున్ = ఉండును; అది = అది; ఎట్లు = ఎలా; అనినన్ = అంటే. కుటిలబుద్ధులు = వంకరబుద్ధికలవారు; అయిన = అయినట్టి; కుజనుల = చెడ్డవారి; ఇండ్ల = గృహముల; కున్ = కి; ఆర్యులు = పూజనీయులు; ఏగన్ = వెళ్లగా; వారున్ = వారు; అనాదరమునన్ = తిరస్కారముతో; బొమలు = కనుబొమలు; ముడిపడంగ = చిట్లించి; భూరి = అత్యధికమైన {భూరి - అతిపెద్దదైన సంఖ్య 10 తరువాత 34 సున్నాలు అదే కోటికైతే 7 సున్నాలే}; రోష = రోషముతో కూడిన; అక్షులు = కన్నులు కలవారు; ఐ = అయ్యి; చూతురు = చూసెదరు; అదియున్ = అంతే; కాక = కాకుండ; సుదతి = స్త్రీ; వినుము = వినుము.

భావము:
సతీ! విను. అటువంటి కపట బుద్ధులైన దుర్జనుల ఇండ్లకు చుట్టరికాన్ని పాటించి వెళ్ళడం వివేకవంతులైన వారికి తగని పని. అది ఎలాగంటే... కుటిల స్వభావం కల దుర్జనుల గృహాలకు సుజనులు వెళ్ళరు. అలా వెళ్ళినట్లయితే ఆ దుష్టులు కనుబొమలు చిట్లించి ద్వేషంతో రోషంతో ఉరిమి ఉరిమి చూస్తారు. సతీ! అంతేకాదు, విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=71

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, May 4, 2017

దక్షయాగము - 22:

4-69-సీ.
"కల్యాణి నీ మాట గడు నొప్పు; బంధువుల్;
పిలువకుండినను సంప్రీతిఁ జనుదు
రంటి; విదియు లెస్స యైనను దేహాభి;
మాన మదము ననమర్షమునను
గడఁగి యారోపిత ఘన కోపదృష్టులు;
గారేనిఁ బోఁదగుఁ గాని వినుము
వినుత విద్యా తపోవిత్త వయో రూప;
కులములు సుజనులకును గుణంబు;
4-69.1-తే.
లివియ కుజనులయెడ దోషహేతుకంబు
లై వివేకంబు చెఱుచు; మహాత్ములైన
వారి మాహాత్మ్యమాత్మ గర్వమునఁ జేసి
జడులు పొడగానఁ జాలరు జలజనేత్ర!

టీకా:
కల్యాణి = కల్యాణములు కలిగించుదానా; నీ = నీ; మాటన్ = మాటలు; కడున్ = మిక్కిలి; ఒప్పు = సరియైనవి; బంధువుల్ = బంధువులు; పిలవకుండినను = పిలవకపోయినను; సంప్రీతిన్ = ప్రీతితో; చనుదురు = వెళ్తారు; అంటివి = అన్నావు; ఇదియున్ = ఇదికూడ; లెస్స = సరియైనదే; ఐనను = అయినప్పటికిని; దేహా = దేహమునందలి; అభిమాన = అభిమానమువలని; మదమునన్ = పొగరు; అమర్షమునను = ఓర్వలేనితనమునను; కడగి = పూని; = ఆరోపిత = ఎక్కింపబడిన; ఘన = అధికమైన; కోప = కోపముతోకూడిన; దృష్టులు = చూపులు కలవారు; కారేని = కాకపోతే; పోన్ = వెళ్ళుటకు; తగున్ = తగును; కాని = కాని; వినుము = వినుము; వినుత = ప్రసిద్ధి చెందిన; విద్యా = విద్యలు; తపస్ = తపోశక్తి; విత్త = ధనము; వయస్ = వయస్సు; రూప = సౌందర్యము; కులములు = కులములు; సుజనుల్ = మంచివారి; కును = కి యైతే; గుణంబులు = సుగుణములు. ఇవియ = ఇవే;  కుజనుల = దుష్టుల; ఎడన్ = అందు; దోష = పాపమునకు; హేతుకంబులు = కారణభూతములు; ఐ = అయ్యి; వివేకంబున్ = వివేకమును; చెఱచున్ = చెడగొట్టును; మహాత్ములు = గొప్పవారు; ఐన = అయిన; వారి = వారి; మహాత్మ్యము = గొప్పదనము; ఆత్మ = తమ; గర్వమునన్ = గర్వము; చేసి = వలన; జడులు = తెలివితక్కువవాడు; పొడగనజాలరు = చూడలేరు; జలజనేత్ర = స్త్రీ {జలజనేత్ర - జలజము (నీటపుట్టు పద్మము) వంటి కన్నులు ఉన్నామె, స్త్రీ}.

భావము:
“దేవీ! నీ మాటలు ఎంతో యుక్తంగా ఉన్నాయి. బంధువులు పిలువకపోయినా ప్రాజ్ఞులైనవారు ప్రీతితో వెళ్తారని నీవు చెప్పింది కూడా బాగుంది. దేహాభిమానం వల్ల కలిగిన మందం చేతనూ, ఆగ్రహావేశం చేతనూ వారు ద్వేష రోషాలను ప్రదర్శించకపోతే వెళ్ళవచ్చు. కాని నీ తండ్రి సరసుడు కాడు. విను. విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపం, కులం అనేవి మంచివారికి సుగుణాలే కాని చెడ్డవారి విషయంలో ఇవే గుణాలు దోషకారణాలై వారి బుద్ధిని పాడు చేస్తాయి. పద్మాక్షీ! మందబుద్ధులు మదోన్మత్తులై మహాత్ముల గొప్పతనాన్ని గుర్తించలేరు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=69


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, May 3, 2017

దక్షయాగము - 21:

4-67-క.
అనయముఁ బిలువక యుండం
జన ననుచిత మంటివేని జనక గురు సుహృ
జ్జననాయక గేహములకుఁ
జనుచుందురు పిలువకున్న సజ్జను లభవా!"
4-68-వ.
అని మఱియు నిట్లనియె “దేవా! నా యందుఁ బ్రసన్నుండవై మదీయ మనోరథంబుం దీర్ప నర్హుండవు; సమధిక జ్ఞానంబు గల నీచేత నేను భవదీయదేహంబు నందర్థంబున ధరియింపంబడితి; నట్టి నన్ను ననుగ్రహింపవలయు” నని ప్రార్థించిన మందస్మితవదనారవిందుం డగుచు జగత్స్రష్టల సమక్షంబున దక్షుండు తన్నాడిన మర్మభేదంబు లైన కుహక వాక్యసాయకంబులం దలంచుచు నిట్లనియె.

టీకా:


అనయమున్ = అవశ్యము; పిలువక = పిలవకుండ; ఉండన్ = ఉండగ; జనన్ = వెళ్ళుట; అనుచితము = తగనిది; అంటివేని = అంటే; జనక = తండ్రి; గురు = గురువు; సుహృత్ = స్నేహితుడు; జననాయక = రాజు {జననాయక - ప్రజలకు నాయకుడు, రాజు}; గేహముల్ = గృహముల; కున్ = కు; చనుచుందురు = వెళ్తుంటారు; పిలవకున్నన్ = పిలవకపోయిన; సజ్జనలు = మంచివారు; అభవా = శివ. అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను; దేవా = దేవుడ; నా = నా; అందున్ = ఎడల; ప్రసన్నుండవు = సుముఖుడవు; ఐ = అయ్యి; మదీయ = నా యొక్క; మనోరథంబున్ = కోరికను {మనోరథము - మనసున ధరించినది, కోరిక}; తీర్పన్ = తీర్చుటకు; అర్హుండవు = తగినవాడవు; సమ = మిక్కిలి; అధిక = అధికమైన; జ్ఞానంబు = జ్ఞానము; కల = కలిగినట్టి; నీ = నీ; చేతన్ = చేత; నేను = నేను; భవదీయ = నీ యొక్క; దేహంబునన్ = దేహమందు; అర్థంబునన్ = సగములో; ధరియింపంబడితిని = ధరింపబడితిని; అట్టి = అటువంటి; నన్నున్ = నన్ను; అనుగ్రహింపవలయును = అనుగ్రహించవలసినది; అని = అని; ప్రార్థించిన = ప్రార్థించగ; మందస్మిత = చిరునవ్వుగల; వదన = మోము యనెడి; అరవిందుండు = పద్మముగలవాడు; అగుచున్ = అవుతూ; జగత్ = లోకములకు; స్రష్టలు = సృష్టికారకుల; సమక్షంబునన్ = ఎదుట; దక్షుండు = దక్షుడు; తన్నున్ = తనను; ఆడిన = అడినట్టి; మర్మభేదంబులు = మనసుకు కష్టము కలిగించునవి; ఐన = అయినట్టి; కుహక = కపట; వాక్య = మాటలు యనెడి; సాయకంబులన్ = బాణములను; తలంచుచున్ = తలచుకొంటూ; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను.

భావము:
అభవా! పిలువకుండా వెళ్ళడం తగదని మీరు అనవచ్చు. తండ్రి, గురువు, మిత్రులు, రాజు మొదలైనవారి యిండ్లకు పిలువకపోయినా సజ్జనులైనవారు వెళ్తారు కదా! అని చెప్పి సతీదేవి మళ్ళీ ఇలా అన్నది “దేవా! నా పట్ల ప్రసన్నబుద్ధితో నా కోరికను తీర్చగలవాడవు నీవు. జ్ఞానవంతుడవైన నీచేత అర్ధశరీరాన్ని పొందినదానను. అటువంటి నన్ను అనుగ్రహించు” అని ప్రార్థించగా శివుడు చిరునవ్వు నవ్వుతూ పూర్వం సృష్టికర్తలైన ప్రజాపతుల సన్నిధిలో దక్షుడు తనను పలికిన బాణాలవంటి మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని సతీదేవితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=67

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, May 2, 2017

దక్షయాగము - 20:

4-65-చ.
"ముదమునఁ దన్మఖోద్భవ విభూతిఁ గనుంగొన నన్యకామినుల్
పదవులు గట్టి భూషణవిభాసితలై నిజనాథయుక్తలై
మదకలహంస పాండురసమంచిత దివ్య విమానయానలై
యదె చనుచున్నవారు గను మభ్రపథంబున నీలకంధరా!
4-66-క.
అనఘా! విను లోకంబుల
జనకుని గేహమునఁ గలుగు సకల సుఖంబుల్
తనయలు చని సంప్రీతిం
గనుఁగొన కే రీతి నిలుచుఁ గాయము లభవా!

టీకా:
ముదమునన్ = సంతోషముతో; తత్ = ఆ; మఖ = యాగమున; ఉద్భవ = కలుగు; విభూతిన్ = వైభవములను; కనుంగొనన్ = చూచుటకు; అన్య = ఇతర; కామినులు = స్త్రీలు {కామిని - కోరదగినది, స్త్రీ}; పదవులుగట్టి = వరుసలుకట్టి; భూషణ = అలంకారములచే; విభాసితలు = మిక్కిలిప్రకాశిస్తున్నవారు; ఐ = అయ్యి; నిజ = తమ; నాథ = భర్తలతో; యుక్తలు = కూడినవారు; ఐ = అయ్యి; మద = పరవశిస్తున్న; కలహంస = కలహంసల; పాండుర = తెల్లదనముతో; సమ = చక్కగ; అంచిత = అలంకరింపబడిన; దివ్య = దివ్యమైన; విమాన = విమానములలో; యానలు = ప్రయాణిస్తున్నవారు; ఐ = అయ్యి; అదె = అదిగో; చనుచున్నవారు = వెళ్తున్నారు; కనుము = చూడుము; అభ్ర = ఆకాశ; పథంబునన్ = మార్గములో; నీలకంథర = శివ {నీలకంథరుడు - నీల (నల్లని) కంథర (కంఠము) కలవాడు, శివుడు}. అనఘా = పుణ్యుడ; విను = వినుము; లోకంబులన్ = ప్రపంచములో; జనకుని = తండ్రి; గేహమునన్ = గృహమున; కలుగు = జరుగు; సకల = సమస్తమైన; సుఖంబుల్ = సుఖములు, సుభములు; తనయులు = పుత్రికలు; చని = వెళ్లి; సంప్రీతిన్ = మిక్కిలి యిష్టముతో; కనుగొనకన్ = చూడక; ఏరీతిన్ = ఎలా; నిలుచున్ = నిలబడును; కాయములు = శరీరములు; అభవా = శివ {అభవ - పుట్టుక లేనివాడు, శివుడు}.


భావము:
నీలకంఠా! మా తండ్రి మహావైభవోపేతంగా చేసే యజ్ఞాన్ని సందర్శించే నిమిత్తం సంతోషంతో దేవతాస్త్రీలు గుంపులు గుంపులుగా పలువిదాల ఆభరణాలను అలంకరించుకొని భర్తలతో కలిసి రాజహంసల వలె తెల్లని రెక్కలతో కూడిన దివ్య విమానాలు ఎక్కి అదిగో ఆకాశ మార్గంలో వెళ్తున్నారు. చూడండి. మహాత్మా! విను. లోకంలో తండ్రి యింట జరిగే శుభకార్యాలను చూడటానికి వెళ్ళకుండా ఏ కుమార్తెల ప్రాణాలు నిలుస్తాయి?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=66

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, May 1, 2017

దక్షయాగము - 19:

4-63-క.
నాతోడను స్నేహము గల
మాతను దత్సోదరీ సమాజము ఋషి సం
ఘాతకృత మఖసమంచిత
కేతువుఁ గన వేడ్క గగనకేశ! జనించెన్.
4-64-వ.
అదియునుం గాక; దేవా! మహాశ్చర్యకరంబై గుణత్రయాత్మకంబగు ప్రపంచంబు భవదీయ మాయా వినిర్మితం బగుటం జేసి నీకు నాశ్చర్యకరంబు గాదు; ఐనను భవదీయ తత్త్వం బెఱుంగఁ జాలక కామినీ స్వభావంబు గలిగి కృపణురాలనై మదీయ జన్మభూమిఁ గనుంగొన నిచ్చగించితి" నని వెండియు నిట్లనియె.

టీకా:
నా = నా; తోడను = తోటి; స్నేహము = ప్రేమ; కల = ఉన్నట్టి; మాతను = తల్లిని; తత్ = ఆమె; సోదరీ = సోదరిల; సమాజమున్ = సమూహమును; ఋషి = ఋషుల; సంఘాత = సమూహము; కృత = చేసిన; మఖ = యాగయు యొక్క; సమ = చక్కగ; అంచిత = అలంకరింపబడిన; కేతువున్ = ధ్వజమును; కనన్ = చూడవలెనని; వేడ్కన్ = వేడుక; గగనకేశ = శివ {గగనకేశుడు - గగన (ఆకాశమే) కేశుడు (శిరోజములు కలవాడు), శివుడు}; జనించెన్ = పుట్టెను. అదియున్ = అంతే; కాక = కాకుండగ; దేవా = దేవుడా; మహా = గొప్ప; ఆశ్చర్యకరంబు = ఆశ్చర్యకరము; ఐ = అయ్యి; గుణత్రయ = త్రిగుణ {త్రిగుణములు - సత్త్వరజస్తమో గుణములు}; ఆత్మకంబు = కూడినది; అగు = అయిన; ప్రపంచంబు = జగము {ప్రపంచంబు - పంచ (5) పంచములు (1పంచభూతములు 2పంచకర్మేంద్రియములు 3పంచజ్ఞానేంద్రియములు 4పంచతన్మాత్రలు 5పంచవాయువులు)చేత ఏర్పడిన సృష్టి, జగము}; భవదీయ = నీ యొక్క; మాయా = మాయచేత; వినిర్మితంబు = విచిత్రముగ నిర్మింపబడినది; అగుటన్ = అగుట; చేసి = వలన; నీకున్ = నీకు; ఆశ్చర్యకరంబు = ఆశ్చర్యకరము; కాదు = కాదు; ఐనను = అయినను; భవదీయ = నీ యొక్క; తత్త్వంబున్ = తత్త్వమును; ఎఱుంగన్ = తెలిసికొన; చాలక = చాలక; కామినీ = స్త్రీ, కోరికలుకోరు; స్వభావంబు = స్వభావము; కలిగి = కలిగినట్టి; కృపణురాలను = దీనురాలను; ఐ = అయ్యి; మదీయ = నా యొక్క; జన్మభూమిన్ = పుట్టిల్లును; కనుగొనన్ = చూడవలెనని; ఇచ్చగించితిని = కోరుతుంటిని; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:
వ్యోమకేశా! నాపై అనురాగం కల తల్లినీ, అక్కచెల్లెండ్రను, ఋషుల సమూహం నిర్వహించే ఆ మహాయజ్ఞానికి చెందిన ధ్వజాన్ని చూడాలని వేడుక పడుతున్నాను. దేవా! అంతేకాక సత్త్వరజస్తమో గుణాత్మకమై మిక్కిలి ఆశ్చర్యకరమైన ఈ ప్రపంచం మీ మాయచేత సృజింపబడింది కనుక మీకు ఆశ్చర్యాన్ని కలిగించదు. అయినా మీ తత్త్వాన్ని తెలిసికొనలేక స్త్రీ స్వభావంతో, స్వార్థంతో నా పుట్టిల్లు చూడాలని ఇష్టపడుతున్నాను.” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=63

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :