Monday, May 1, 2017

దక్షయాగము - 19:

4-63-క.
నాతోడను స్నేహము గల
మాతను దత్సోదరీ సమాజము ఋషి సం
ఘాతకృత మఖసమంచిత
కేతువుఁ గన వేడ్క గగనకేశ! జనించెన్.
4-64-వ.
అదియునుం గాక; దేవా! మహాశ్చర్యకరంబై గుణత్రయాత్మకంబగు ప్రపంచంబు భవదీయ మాయా వినిర్మితం బగుటం జేసి నీకు నాశ్చర్యకరంబు గాదు; ఐనను భవదీయ తత్త్వం బెఱుంగఁ జాలక కామినీ స్వభావంబు గలిగి కృపణురాలనై మదీయ జన్మభూమిఁ గనుంగొన నిచ్చగించితి" నని వెండియు నిట్లనియె.

టీకా:
నా = నా; తోడను = తోటి; స్నేహము = ప్రేమ; కల = ఉన్నట్టి; మాతను = తల్లిని; తత్ = ఆమె; సోదరీ = సోదరిల; సమాజమున్ = సమూహమును; ఋషి = ఋషుల; సంఘాత = సమూహము; కృత = చేసిన; మఖ = యాగయు యొక్క; సమ = చక్కగ; అంచిత = అలంకరింపబడిన; కేతువున్ = ధ్వజమును; కనన్ = చూడవలెనని; వేడ్కన్ = వేడుక; గగనకేశ = శివ {గగనకేశుడు - గగన (ఆకాశమే) కేశుడు (శిరోజములు కలవాడు), శివుడు}; జనించెన్ = పుట్టెను. అదియున్ = అంతే; కాక = కాకుండగ; దేవా = దేవుడా; మహా = గొప్ప; ఆశ్చర్యకరంబు = ఆశ్చర్యకరము; ఐ = అయ్యి; గుణత్రయ = త్రిగుణ {త్రిగుణములు - సత్త్వరజస్తమో గుణములు}; ఆత్మకంబు = కూడినది; అగు = అయిన; ప్రపంచంబు = జగము {ప్రపంచంబు - పంచ (5) పంచములు (1పంచభూతములు 2పంచకర్మేంద్రియములు 3పంచజ్ఞానేంద్రియములు 4పంచతన్మాత్రలు 5పంచవాయువులు)చేత ఏర్పడిన సృష్టి, జగము}; భవదీయ = నీ యొక్క; మాయా = మాయచేత; వినిర్మితంబు = విచిత్రముగ నిర్మింపబడినది; అగుటన్ = అగుట; చేసి = వలన; నీకున్ = నీకు; ఆశ్చర్యకరంబు = ఆశ్చర్యకరము; కాదు = కాదు; ఐనను = అయినను; భవదీయ = నీ యొక్క; తత్త్వంబున్ = తత్త్వమును; ఎఱుంగన్ = తెలిసికొన; చాలక = చాలక; కామినీ = స్త్రీ, కోరికలుకోరు; స్వభావంబు = స్వభావము; కలిగి = కలిగినట్టి; కృపణురాలను = దీనురాలను; ఐ = అయ్యి; మదీయ = నా యొక్క; జన్మభూమిన్ = పుట్టిల్లును; కనుగొనన్ = చూడవలెనని; ఇచ్చగించితిని = కోరుతుంటిని; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:
వ్యోమకేశా! నాపై అనురాగం కల తల్లినీ, అక్కచెల్లెండ్రను, ఋషుల సమూహం నిర్వహించే ఆ మహాయజ్ఞానికి చెందిన ధ్వజాన్ని చూడాలని వేడుక పడుతున్నాను. దేవా! అంతేకాక సత్త్వరజస్తమో గుణాత్మకమై మిక్కిలి ఆశ్చర్యకరమైన ఈ ప్రపంచం మీ మాయచేత సృజింపబడింది కనుక మీకు ఆశ్చర్యాన్ని కలిగించదు. అయినా మీ తత్త్వాన్ని తెలిసికొనలేక స్త్రీ స్వభావంతో, స్వార్థంతో నా పుట్టిల్లు చూడాలని ఇష్టపడుతున్నాను.” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=63

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :


No comments: