Friday, May 5, 2017

దక్ష యాగము - 23:

4-70-క.
విను; మట్టి కుటిలు లగు దు
ర్జనుల గృహంబులకు బంధుసరణిని బోవం
జనదు; వినీతుల కది గడు
ననుచిత మైనట్ల యుండు; నది యెట్లనినన్.
4-71-ఆ.
కుటిలబుద్ధు లయిన కుజనుల యిండ్లకు
నార్యు లేగ, వా రనాదరమున
బొమలు ముడిపడంగ భూరి రోషాక్షులై
చూతు; రదియుఁ గాక సుదతి! వినుము.

టీకా:
వినుము = వినుము; ఇట్టి = ఇటువంటి; కుటిలులు = వంకరబుద్ధికలవారు; అగు = అయిన; దుర్జనుల = దుష్టుల; గృహంబుల్ = ఇళ్ళ; కున్ = కి; బంధు = బంధుత్వపు; సరణిన్ = వరసచూసి; పోవన్ = పోవుట; చనదు = తగదు; వినీతుల్ = మిక్కిలి నీతిమంతుల; కున్ = కి; అది = అది; కడున్ = మిక్కిలి; అనుచితమున్ = ఉచితముకానిది; ఐనట్లు = అయిన విధముగ; ఉండున్ = ఉండును; అది = అది; ఎట్లు = ఎలా; అనినన్ = అంటే. కుటిలబుద్ధులు = వంకరబుద్ధికలవారు; అయిన = అయినట్టి; కుజనుల = చెడ్డవారి; ఇండ్ల = గృహముల; కున్ = కి; ఆర్యులు = పూజనీయులు; ఏగన్ = వెళ్లగా; వారున్ = వారు; అనాదరమునన్ = తిరస్కారముతో; బొమలు = కనుబొమలు; ముడిపడంగ = చిట్లించి; భూరి = అత్యధికమైన {భూరి - అతిపెద్దదైన సంఖ్య 10 తరువాత 34 సున్నాలు అదే కోటికైతే 7 సున్నాలే}; రోష = రోషముతో కూడిన; అక్షులు = కన్నులు కలవారు; ఐ = అయ్యి; చూతురు = చూసెదరు; అదియున్ = అంతే; కాక = కాకుండ; సుదతి = స్త్రీ; వినుము = వినుము.

భావము:
సతీ! విను. అటువంటి కపట బుద్ధులైన దుర్జనుల ఇండ్లకు చుట్టరికాన్ని పాటించి వెళ్ళడం వివేకవంతులైన వారికి తగని పని. అది ఎలాగంటే... కుటిల స్వభావం కల దుర్జనుల గృహాలకు సుజనులు వెళ్ళరు. అలా వెళ్ళినట్లయితే ఆ దుష్టులు కనుబొమలు చిట్లించి ద్వేషంతో రోషంతో ఉరిమి ఉరిమి చూస్తారు. సతీ! అంతేకాదు, విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=71

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: