Saturday, May 14, 2016

క్షీరసాగరమథనం - విను ము న్నేటికిఁ

8-142-వ.
అని పలికినం బరీక్షిన్నరేంద్రుండు మునీంద్రున కిట్లనియె.
8-143-మ.
“విను ము న్నేటికిఁ ద్రచ్చె పాలకడలిన్ విష్ణుండు? కూర్మాకృతిన్
వనధిం జొచ్చి య దెట్లు మోచె బలుకవ్వంబైన శైలంబు? దే
వ నికాయం బమృతంబు నెట్లు పడసెన్? వారాశి నేమేమి సం
జనితం బయ్యె? మునీంద్ర! చోద్యము గదా సర్వంబుఁ జెప్పంగదే.
టీకా:
అని = అని; పలికినన్ = చెప్పగా; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు; ముని = మునులలో; ఇంద్రున్ = ఇంద్రుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
విను = వినుము; మున్ను = పూర్వము; ఏటికిన్ = ఎందులకు; త్రచ్చెన్ = చిలికిరి; పాలకడలిన్ = పాలసముద్రమును; విష్ణుండు = నారాయణుడు; కూర్మ = కూర్మము; ఆకృతిన్ = రూపముతో; వనధిన్ = సముద్రమునందు; చొచ్చి = దూరి; అది = దానిని; ఎట్లు = ఏ విధముగ; మోచెన్ = మోసెను; పలు = పెద్ద; కవ్వంబున్ = కవ్వము; ఐన = అయిన; శైలంబున్ = పర్వతమును; దేవ = దేవతల; నికాయంబు = సమూహము; అమృతంబున్ = అమృతమును; ఎట్లు = ఏ విధముగ; పడసెన్ = పొందెను; వారాశిన్ = సముద్రమునందు {వారాశి - వారి (నీటి) రాశి, సముద్రము}; ఏమేమి = ఏ ఏ; సంజనితంబు = పుట్టినవి; అయ్యెన్ = అయినవి; ముని = మునులలో; ఇంద్రా = ఉత్తముడా; చోద్యము = ఆశ్ఛర్యకరము; కదా = కదా; సర్వంబున్ = సమస్తమును; చెప్పంగదే = చెప్పుము.
భావము:
శుక మునీశ్వరుడు అలా చెప్పగానే పరీక్షిత్తు మహారాజు ఇలా అడిగాడు.
 “మునిశ్రేష్ఠుడవు అయిన శుకుడా! పూర్వకాలంలో విష్ణుమూర్తి పాలసముద్రాన్ని ఎందుకు చిలికాడు? పాల సముద్రంలోని అంత పెద్ద కవ్వపు కొండ మంథర పర్వతం, క్రిందకు దూరి తాబేలు రూపంలో ఎందుకు మోసాడు? అమృతాన్ని దేవతలకు ఎలా అందించాడు? అలా చిలుకుతుంటే పాలసముద్రం లోనుంచి ఏమేమి పుట్టాయి? ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు కదా! వాటన్నిటినీ నాకు వివరంగా చెప్పు.
8-142-va.
ani palikinaM bareekShinnareMdruMDu muneeMdruna kiTlaniye.
8-143-ma.
“vinu mu nneTikiM~ drachche paalakaDalin viShNuMDu? koormaakRitin
vanadhiM jochchi ya deTlu moche balukavvaMbaina shailaMbu? de
va nikaayaM bamRitaMbu neTlu paDasen? vaaraashi nememi saM
janitaM bayye? muneeMdra! chodyamu gadaa sarvaMbuM~ jeppaMgade.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, May 13, 2016

క్షీరసాగరమథనం - చక్షుస్తనూజుండు

8-141-సీ.
చక్షుస్తనూజుండు చాక్షుషుం డను వీరుఁ;
 డాఱవ మనువయ్యె నవనినాథ! 
భూమీశ్వరులు పురుః పురుష సుద్యుమ్నాదు;
లాతని నందను; లమరవిభుఁడు
మంత్రద్యుమాఖ్యుఁ; డమర్త్యు లాప్యాదికు;
 లాహవిష్మద్వీరకాది ఘనులు
మునులందు విభుఁడు సంభూతికి వైరాజు;
 నకుఁ బుట్టి యజితుండు నాఁగ నొప్పె;
8-141.1-ఆ.
నతఁడు కాఁడె కూర్మమై మందరాద్రిని;
నుదధి జలములోన నుండి మోచె; 
నతఁడు చువ్వె దివిజు లర్థింప నమృతాబ్ధిఁ; 
ద్రచ్చి యిచ్చె నా సుధారసంబు.
టీకా:
చక్షుస్ = చక్షుస్సు యొక్క; తనూజుండు = పుత్రుడు; చాక్షుసుండు = చాక్షుషుడు; అను = అనెడి; వీరుడు = శ్రేష్ఠుడు; ఆఱవ = అరో (6); మనువు = మనువు; అయ్యెన్ = అయ్యెను; అవనినాథ = రాజ; భూమీశ్వరులు = రాజులు; పురుః = పురువు; పురుష = పురుషుడు; సుద్యుమ్న = సుద్యుమ్నుడు; ఆదులు = మొదలగువారు; ఆతని = అతని యొక్క; నందనులు = పుత్రులు; అమరవిభుడు = ఇంద్రుడు; మంత్రద్యుమ్న = మంత్రద్యుమ్నుడు అను; ఆఖ్యుడు = పేరుగలవాడు; అమర్త్యులు = దేవతలు; ఆప్యా = ఆప్యాయుడు; ఆదికులు = మొదలైనవారు; ఆ = ఆ; హవిష్మత్ = హవిష్మంతుడు; వీరక = వీరకుడు; ఆది = మున్నగు; ఘనులు = గొప్పవారు; మునులు = సప్తర్షులు; విభుడు = విష్ణుమూర్తి; సంభూతి = సంభూతి; కిన్ = కి; వైరాజున్ = వైరాజున; కున్ = కు; పుట్టి = పుట్టి; అజితుండు = అజితుడు; నాగ = అనగా; ఒప్పెన్ = ఒప్పియుండెను; అతడు = అతడు. 
కాడె = కాదా; కూర్మము = కూర్మావతారుడు; ఐ = అయ్యి; మందర = మందర యనెడి; అద్రిని = పర్వతమును; ఉదధి = సముద్ర; జలము = నీటి; లోనన్ = లోపల; ఉండి = ఉండి; మోచెన్ = మోసెను; అతడు = అతడు; చువ్వె = సుమా; దివిజులు = దేవతలు; అర్థింపన్ = కోరగా; అమృతాబ్దిన్ = పాలసముద్రమును; త్రచ్చి = చిలికి; ఇచ్చెన్ = ఇచ్చెను; ఆ = ఆ; సుధారసంబున్ = అమృతమును.
భావము:
పరీక్షిత్తు మహారాజా! ఆరవ మనువుగా, చక్షువు అను వాని పుత్రుడు చాక్షుషుడు అయ్యాడు. ఆ చాక్షుస మన్వంతరంలో, అతని కొడుకులు అయిన పురుడు, పురుషుడు , సుద్యుమ్నుడు మున్నగువారు రాజులు అయ్యారు; మంత్రద్యుముడు ఇంద్రుడు అయ్యాడు; ఆప్యాదులు దేవతలు అయ్యారు. హవిష్మంతుడు, వీరకుడు మున్నగువారు సప్తర్షులు అయ్యారు; వైరాజుకీ సంభాతికీ “అజితుడు” అనే పేరుతో విష్ణువు పుట్టాడు. అతడే కూర్మరూపం ధరించి మంథర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా మోసాడు. దేవతలు ప్రార్థించగా క్షీరసాగరాన్ని చిలికి అమృతాన్ని దేవతలకు అందించాడు.
విశేష వివరణ= చతుర్దశ మన్వంతరాలలో నాలుగవది (4) అయిన, తామస మన్వంతరంలో గజేంద్ర మోక్షం ఘట్టం జరిగింది. తరువాత అయిదవది (5) అయిన రైవత మన్వంతరం, ఆ తరువాతది ఆరవది అయిన చాక్షుస మన్వంతరం. ఈ మన్వంతరంలో క్షీరసాగర మధనం జరిగింది. ఆ పిమ్మట వచ్చినది ప్రస్తుతం నడుస్తున్న వైవశ్వత మన్వంతరం.
8-141-see.
chakShustanoojuMDu chaakShuShuM Danu veeruM~; DaaRrava manuvayye navaninaatha!
bhoomeeshvarulu puru: puruSha sudyumnaadu; laatani naMdanu; lamaravibhuM~Du
maMtradyumaakhyuM~; Damartyu laapyaadiku; laahaviShmadveerakaadi ghanulu
munulaMdu vibhuM~Du saMbhootiki vairaaju; nakuM~ buTTi yajituMDu naaM~ga noppe;
8-141.1-aa.
nataM~Du kaaM~De koormamai maMdaraadrini; nudadhi jalamulona nuMDi mOche;
nataM~Du chuvve diviju larthiMpa namRitaabdhiM~; drachchi yichche naa sudhaarasaMbu.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, May 12, 2016

క్షీరసాగరమథనం - తామసు తమ్ముఁడు

8-138-క.
తామసు తమ్ముఁడు రైవత
నామకుఁడై వెలసె మనువు; నలువురమీదన్
భూమికిఁ బ్రతివింధ్యార్జున
నామాదులు నృపులు మనువు నందనులు నృపా!
టీకా:
తామసు = తామసుని {తామసుడు - నాలుగవ మనువు}; తమ్ముడు = చిన్నసోదరుడు; రైవత = రైవతుడు అనెడి; నామకుడు = పేరుగలవాడు; ఐ = అయ్యి; వెలసెన్ = అవతరించెను; మనువు = మునువు; నలువురమీదన్ = ఐదవవానిగ; భూమి = భూలోకమున; కిన్ = కు; ప్రతివింధ్య = ప్రతివింధ్యుడు; అర్జున = అర్జునుడు; నామ = పేరుగలవాడు; ఆదులు = మున్నగువారు; నృపులు = రాజులు; మనువు = మనువు యొక్క; నందనులు = పుత్రులు; నృపా = రాజా.
భావము:
ఓ పరీక్షిన్మహారాజా! నాలుగవ మనువు తామస మనువుకు తమ్ముడు అయిన రైవతుడు అయిదో మనువు అయ్యాడు. అతని కుమారులు ప్రతివింద్యుడు, అర్జునుడు మొదలైనవారు భూమండలానికి రాజులు అయ్యారు.
8-138-ka.
taamasu tammuM~Du raivata
naamakuM~Dai velase manuvu; naluvurameedan
bhoomikiM~ brativiMdhyaarjuna
naamaadulu nRipulu manuvu naMdanulu nRipaa!
8-139-సీ.
మునులు హిరణ్యరోముఁడు నూర్ధ్వబాహుండు; వేదశీర్షుండను వీరు మొదలు
నమరులు భూతరయాదులు శుభ్రుని; పత్ని వికుంఠాఖ్య పరమసాధ్వి; 
యా యిద్దఱకుఁ బుత్రుఁడై తన కళలతో; వైకుంఠుఁ డనఁ బుట్టి వారిజాక్షు
డవనిపై వైకుంఠ మనియెడి లోకంబుఁ; గల్పించె నెల్లలోకములు మ్రొక్క;
8-139.1-తే.
రమ యెదుర్కోలు చేకొనె రాజముఖ్య!; తదనుభావంబు గుణములుఁ దలఁపఁ దరమె? 
యీ ధరారేణు పటలంబు నెఱుఁగవచ్చుఁ;గాని రాదయ్య హరిగుణగణము సంఖ్య.
టీకా:
మునులు = సప్తర్షులు; హిరణ్యరోముడున్ = హిరణ్యరోముడు; ఊర్ధ్వబాహుండు = ఊర్ధ్వబాహుడు; వేదశీర్షుండు = వేదశీర్షుడు; అను = అనెడి; వీరు = వారు; మొదలు = ముఖ్య; అమరులు = దేవతలు; భూత = భూతుడు; రయ = రయుడు; ఆదులు = మొదలగువారు; శుభ్రుని = శుభ్రుని యొక్క; పత్ని = భార్య; వికుంఠ = వికుంఠుడు యనెడి; ఆఖ్య = పేరుగలయామె; పరమ = అత్యుత్తమ; సాధ్వి = పతివ్రత; ఆ = ఆ; ఇద్దఱ = ఇద్దరి (2); కున్ = కి; పుత్రుడు = కుమారుడు; ఐ = అయ్యి; తన = తన యొక్క; కళల్ = అంశల; తోన్ = తోటి; వైకుంఠుడు = వైకుంఠుడు; అనన్ = అనబడుతూ; పుట్టి = పుట్టి; వారిజాక్షుడు = హరి {వారిజాక్షుడు - వారిజము (పద్మమువంటి) అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; అవని = భూమండలము; పైన్ = మీద; వైకుంఠము = వైకుంఠము; అనియెడి = అనెడి; లోకంబున్ = లోకమును; కల్పించెన్ = ఏర్పరచెను; ఎల్ల = అన్ని; లోకములున్ = లోకములును; మ్రొక్కన్ = కొలుచుచుండగ. 
రమ = లక్ష్మీదేవి; ఎదుర్కోలు = వివాహమున; చేకొనె = స్వీకరించెను; రాజముఖ్య = రాజులలో ముఖ్యుడ; తత్ = అతని; అనుభావంబున్ = ప్రభావములను; గుణములున్ = గుణములను; తలపన్ = భావించుట; తరమె = సాధ్యమా, కాదు; ఈ = ఈ; ధరా = భూమండలమునందలి; రేణు = ఇసుక; పటలంబున్ = సమూహమును; ఎఱుగవచ్చు = తెలిసికొనవచ్చు; కాని = కాని; రాదు = సాధ్యముకాదు; అయ్య = బాబు; హరి = వైకుంఠుని; గుణ = గుణములు; గణమున్ = అన్నిటి; సంఖ్య = లెక్క.
భావము:
రాజా పరీక్షిత్తూ! ఈ అయిదో మన్వంతరంలో హిరణ్యరోముడూ, ఊర్ధ్వబాహుడూ, వేదశీర్షుడు మున్నగువారు, సప్తర్షులు అయ్యారు; భూతరయులు మొదలైనవారు దేవతలు అయ్యారు. శుభ్రుడికి, పతివ్రత అయిన వికుంఠ అనే అతని భార్య కడుపున, “వైకుంఠుడు” అనే పేరుతో విష్ణుమూర్తి పుట్టాడు. అతడు అన్ని లోకాల వారూ గౌరవించేలా “వైకుంఠము” అనే లోకాన్ని సృష్టించాడు. అతనిని లక్ష్మీదేవి స్వయంగా పెళ్ళి చేసుకుంది. ఆ దేవదేవుని మహిమను, సుగుణాలను ఊహించడం సాధ్యం కాదు. భూమండలంలో గల ధూళి కణాలు అన్నిటినీ తెలుసుకోగల మేమో కాని వైకుంఠుని గుణగణాలు తెలుసుకోవటం సాధ్యం కాదు.
8-139-see.
munulu hiraNyaromuM~Du noordhvabaahuMDu; vedasheerShuMDanu veeru modalu
namarulu bhootarayaadulu shubhruni; patni vikuMThaakhya paramasaadhvi;
yaa yiddaRrakuM~ butruM~Dai tana kaLalato; vaikuMThuM~ DanaM~ buTTi vaarijaakShu
Davanipai vaikuMTha maniyeDi lokaMbuM~; galpiMche nellalokamulu mrokka;
8-139.1-te.
rama yedurkolu chekone raajamukhya!; tadanubhaavaMbu guNamuluM~ dalaM~paM~ darame?
yee dharaareNu paTalaMbu neRruM~gavachchuM~;gaani raadayya hariguNagaNamu saMkhya.
8-140-వ.
తదనంతరంబ.
టీకా:
తదనంతరంబ = తరువాత.
భావము:
అటు పిమ్మట.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :