Wednesday, May 4, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – దంష్ట్రివై తొల్లి

7-376-సీ.
దంష్ట్రివై తొల్లి సోదరుని హిరణ్యాక్షు; నీవు చంపుటఁ జేసి నిగ్రహమున
మా తండ్రి రోషనిర్మగ్నుఁడై సర్వలో; కేశ్వరుఁ బరము ని న్నెఱుఁగ లేక
పరిపంథి పగిది నీ భక్తుండ నగు నాకు; నపకారములు జేసె నతఁడు నేఁడు
నీ శాంతదృష్టిచే నిర్మలత్వము నొందెఁ; గావున బాప సంఘంబువలనఁ
7-376.1-తే.
బాసి శుద్ధాత్మకుఁడు గాఁగ భవ్యగాత్ర!; వరము వేఁడెద నా కిమ్ము వనజనేత్ర! 
భక్తసంఘాత ముఖపద్మ పద్మమిత్ర!; భక్త కల్మషవల్లికా పటు లవిత్ర!"
టీకా:
          దంష్ట్రివి = వరాహాతారుడవు {దంష్ట్రి - దంష్ట్రములు (కోరపళ్ళు) గలది వరాహము యొక్క రూపము ధరించినవాడు, వరహావతారుడు, విష్ణువు}; ఐ = అయ్యి; తొల్లి = పూర్వము; సోదరునిన్ = సహోదరుని; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షుని; నీవు = నీవు; చంపుటన్ = సంహరించుట; చేసి = వలన; నిగ్రహమున = తిరస్కారముతో; మా = మా యొక్క; తండ్రి = తండ్రి; రోష = కోపమునందు; నిర్మగ్నుడు = పూర్తిగా మునిగినవాడు; ఐ = అయ్యి; సర్వలోకేశ్వరున్ = హరిని {సర్వలోకేశ్వరుడు - సమస్తమైన లోకములకు ప్రభువు, విష్ణువు}; పరమున్ = హరిని {పరము - పరాత్పరుడు, సర్వాతీతుడు, విష్ణువు}; నిన్నున్ = నిన్ను; ఎఱుగన్ = తెలియ; లేక = లేకపోవుటచే; పరిపంథి = శత్రువు {పరిపంథి - పరి (ఎదుటి) పంథి (పక్షమువాడు), శత్రువు}; పగిదిన్ = వలె; నీ = నీ; భక్తుండను = భక్తుడను; అగు = అయిన; నా = నా; కున్ = కు; అపకారములు = కీడు; చేసెన్ = చేసెను; అతడు = అతడు; నేడు = ఈ దినమున; నీ = నీ యొక్క; శాంత = శాంతింపజేసెడి; దృష్టి = చూపల; చేన్ = వలన; నిర్మలత్వమున్ = పవిత్రతను; ఒందెన్ = పొందెను; కావున = కనుక; పాప = పాపముల; సంఘంబు = సమూహముల; వలనన్ = నుండి; పాసి = వీడినవాడై; 
          శుద్ద = స్వచ్ఛమైన; ఆత్మకుండు = ఆత్మకలవాడు; కాగన్ = అగునట్లు; భవ్యగాత్ర = నరసింహ {భవ్యగాత్రుడు - దివ్యమంగళమైన గాత్ర (దేహముగలవాడు), విష్ణువు}; వరమున్ = వరమును; వేడెదన్ = కోరెదను; నా = నా; కున్ = కు; ఇమ్ము = ఇమ్ము; వనజనేత్ర = నరసింహ {వనజనేత్రుడు - వనజ (పద్మము) వంటి నేత్ర (కన్నులుగలవాడు), విష్ణువు}; భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర = నరసింహ {భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర - భక్త (భక్తుల) సంఘాత (సమూహముల) యొక్క ముఖములు యనెడి పద్మ (కమలములకు) పద్మమిత్ర (సూర్యుని వంటివాడ), విష్ణువు}; భక్తకల్మషవల్లికాపటులవిత్ర = నరసింహ {భక్తకల్మషవల్లికాపటులవిత్రుడు - భక్త (భక్తుల యొక్క) కల్మష (పాపములు) యనెడి వల్లికా (లతలకు) పటు (గట్టి) లవిత్ర (కొడవలివంటివాడు), విష్ణువు}.
భావము:
            “ఓ పద్మాక్షా! నారసింహా! నీవు భక్తుల ముఖాలనే పద్మాలకు పద్మముల మిత్రుడైన సూర్యుని వంటివాడవు. భక్తుల పాపాలు అనే లతల పాలిట లతలను తెగగోసే కొడవలి వంటివాడవు. తన తమ్ముడు హిరణ్యాక్షుడిని, పూర్వకారలంలో నీవు వరాహరూపంలో వచ్చి, సంహరించావని మా తండ్రి హిరణ్యకశిపుడు నీపై ద్వేషం, రోషం పెట్టుకున్నాడు. సర్వేశ్వరుడవైన నిన్ను గుర్తించలేకపోయాడు. నిన్ను బద్ధవిరోధిగా భావించాడు. నేను నీ భక్తుడను అయ్యానని కోపంతో నన్ను నానా బాధలూ పెట్టాడు. అటువంటి నా తండ్రి ఈవాళ నీ శాంత దృష్టి సోకి నిర్మలుడు అయ్యాడు. అందువల్ల ఆయన పాపాలు పోయి పరిశుద్ధాత్ముడు అయ్యేలా వరం ప్రసాదించు.”
७-३७६-सी.
दंष्ट्रिवै तोल्लि सोदरुनि हिरण्याक्षु; नीवु चंपुटँ जेसि निग्रहमुन
मा तंड्रि रोषनिर्मग्नुँडै सर्वलो; केश्वरुँ बरमु नि न्नेर्रुँग लेक
परिपंथि पगिदि नी भक्तुंड नगु नाकु; नपकारमुलु जेसे नतँडु नेँडु
नी शांतदृष्टिचे निर्मलत्वमु नोंदेँ; गावुन बाप संघंबुवलनँ
७-३७६.१-त.
बासि शुद्धात्मकुँडु गाँग भव्यगात्र!; वरमु वेँडेद ना किम्मु वनजनेत्र!
भक्तसंघात मुखपद्म पद्ममित्र!; भक्त कल्मषवल्लिका पटु लवित्र!"
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, May 3, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – నరుఁడు

7-374-ఆ.
నరుఁడు ప్రియముతోడ నాయవతారంబు, 
నీ యుదారగీత నికరములను
మానసించునేని మఱి సంభవింపఁడు
కర్మబంధచయముఁ గడచిపోవు.
7-375-వ.
అనినఁ బ్రహ్లాదుం డిట్లనియె.
టీకా:
          నరుడు = మానవుడు; ప్రియము = ఆదరము; తోడన్ = తోటి; నా = నా యొక్క; అవతారంబున్ = అవతారమును; నీ = నీ యొక్క; ఉదార = గొప్ప; గీత = కీర్తిగానముల; నికరములనున్ = సమూహములను; మానసించునేని = తలపోసినచో; మఱి = ఇంక; సంభవింపడు = పుట్టడు; కర్మ = కర్మముల; బంధ = బంధనముల; చయమున్ = సర్వమును; కడచిపోవు = దాటేయును.
          అనినన్ = అనగా; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఇలా; అనియె = అనెను.
భావము:
            మానవుడు నా ఈ నారసింహావతారాన్నీ, నీవు చేసిన ఈ సంస్తుతినీ నిండుగా మనసులో నిలుపుకుంటే, వానికి పునర్జన్మ ఉండదు. వాడు కర్మ బంధాలను దాటేస్తాడు.”
            అలా పరమపురుషుడు పలుకగా. ప్రహ్లాదుడు ఇలా అన్నాడు
७-३७४-आ.
नरुँडु प्रियमुतोड नायवतारंबु,
नी युदारगीत निकरमुलनु
मानसिंचुनेनि मर्रि संभविंपँडु
कर्मबंधचयमुँ गडचिपोवु.
७-३७५-व.
अनिनँ ब्रह्लादुं डिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, May 2, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – మఱియు నటమీఁదటఁ

7-373-వ.
మఱియు నటమీఁదటఁ గాలవేగంబునం గళేబరంబు విడిచి త్రైలోక్యవిరాజ మానంబును దివిజరాజజేగీయమానంబును బరిపూరిత దశదిశంబును నయిన యశంబుతోడ ముక్తబంధుండవై నన్ను డగ్గఱియెదవు; వినుము.
టీకా:
          మఱియున్ = ఇంకను; నటమీదటన్ = ఆ పైన; కాల = కాలము యొక్క; వేగంబునన్ = గతిచే; కళేబరంబున్ = ప్రాణముమినహాదేహము; విడిచి = వదలివేసి; త్రైలోక్య = ముల్లోకములందును; విరాజమానంబును = మిక్కిలి ప్రకాశించునది; దివిజరాజ = దేవేంద్రునిచే {దివిజరాజు - దివిజుల (దేవతల)కు రాజు, దేవేంద్రుడు}; జేగీయమానంబునున్ = పొగడబడునది; పరిపూరిత = పూర్తిగానిండిన; దశదిశంబునున్ = పదిదిక్కులుగలది {దశదిశలు - అష్టదిక్కులు (8) మరియు కింద పైన}; అయిన = అయిన; యశంబు = కీర్తి; తోడన్ = తోటి; ముక్త = వీడిన; బంధుండవు = బంధనములుగలవాడవు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; డగ్గఱియెదవు = చేరెదవు; వినుము = వినుము.
భావము:
            అటు పిమ్మట, కాలప్రవాహానికి లోబడి, కళేబరం వదలిపెట్టి, ముల్లోకాల లోనూ ప్రకాశించేదీ, దేవేంద్రుని చేత పొగడబడేదీ, దశదిక్కులనూ పరిపూర్ణంగా నిండి ఉడేదీ అయిన గొప్ప కీర్తితో నా సాన్నిధ్యం పొందుతావు.
७-३७३-व.
मर्रियु नटमीँदटँ गालवेगंबुनं गळेबरंबु विडिचि त्रैलोक्यविराज मानंबुनु दिविजराजजेगीयमानंबुनु बरिपूरित दशदिशंबुनु नयिन यशंबुतोड मुक्तबंधुंडवै नन्नु डग्गर्रियेदवु; विनुमु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, May 1, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – నీ యట్టి సుజ్ఞాన

7-372-సీ.
"నీ యట్టి సుజ్ఞాన నిపుణు లేకాంతులు; గోర్కులు నా యందుఁ గోర నొల్ల; 
రట్లైనఁ బ్రహ్లాద! యసురేంద్రభర్తవై; సాగి మన్వంతర సమయ మెల్ల
నిఖిలభోగంబులు నీవు భోగింపుము; కల్యాణబుద్ధి నా కథలు వినుము; 
సకలభూతములందు సంపూర్ణుఁ డగు నన్ను; యజ్ఞేశు నీశ్వరు నాత్మ నిలిపి
7-372.1-ఆ.
కర్మచయము లెల్ల ఖండించి పూజన; మాచరింపు మీశ్వరార్పణముగ; 
భోగముల నశించుఁ బుణ్యంబు; వ్రతములఁ; బాప సంచయములు పాయు నిన్ను.
టీకా:
          నీ = నీ; అట్టి = వంటి; సుజ్ఞాన = మంచిజ్ఞానమునందు; నిపుణులు = నేర్పుగలవారు; ఏకాంతులున్ = అంతరంగభక్తులు; నా = నా; అందున్ = నుండి; కోరన్ = కోరుకొనుటను; ఒల్లరు = అంగీకరించరు; అట్లైనన్ = అలా అయినప్పటికిని; ప్రహ్లాద = ప్రహ్లాదుడ; అసురేంద్ర = రాక్షసులకు; భర్తవు = రాజు యైనవాడవు; ఐ = అయ్యి; సాగి = ప్రవర్తిల్లి; మన్వంతర = మన్వంతర {మన్వంతరంబు - ఒక మనువు పాలించు కాలపరిమితి, డెబ్బైయొక్కదివ్యయుగములు, 25560 యుగములు}; సమయము = కాలము; ఎల్లన్ = అంతయును; నిఖిల = సమస్తమైన; భోగంబులున్ = అనుభవింపదగినవానిని {అష్టభోగములు - 1నిథి 2నిక్షేపము 3జల 4పాషాణ 5అక్షీణ 6ఆగామి 7సిద్ధ 8సాధ్యములు మరియొకవిధమున 1గృహము 2శయ్య 3వస్త్రము 4ఆభరణము 5స్త్రీ 6పుష్పము 7గంధము 8తాంబూలము}; నీవు = నీవు; భోగింపుము = అనుభవింపుము; కల్యాణ = మంగళకరమైన; బుద్ధిన్ = బుద్ధితో; నా = నా గురించిన; కథలున్ = గాథలను; వినుము = వినుము; సకల = సర్వ; భూతములు = జీవుల; అందున్ = లోను; సంపూర్ణుడు = నిండినవానిని; అగు = అయిన; నన్నున్ = నన్ను; యజ్ఞేశున్ = నారాయణుని; ఈశ్వరున్ = నారాయణుని; ఆత్మన్ = మనసున; నిలిపి = ధరించి. 
          కర్మ = కర్మముల; చయమున్ = సమూహములను; ఎల్లన్ = సమస్తమును; ఖండించి = త్రుంచి; పూజనము = అర్చన, కైంకర్యము; ఆచరింపుము = చేయుము; ఈశ్వర = భగవతునికి; అర్పణము = సమర్పించినది; కాన్ = అగునట్లు; భోగములన్ = బోగములవలన; నశించున్ = తొలగిపోవును; పుణ్యంబున్ = పుణ్యములు; వ్రతములన్ = దీక్షలతోటి; పాప = పాపములు; సంచయములు = కూడబెట్టినవి; పాయున్ = తొలగిపోవును; నిన్నున్ = నిన్ను.
భావము:
            “ప్రహ్లాదా! నీ వంటి మంచి జ్ఞాన సంపన్నులు, ఏకాంత భక్తులు, కోరికలు ఏవీ కోరుకోరు. అయినా కూడా నీవు దానవ చక్రవర్తివి అయి మన్వంతరం కాలం సకల భోగాలూ అనుభవించు. శుభప్రదమైన బుద్ధితో నా గాథలు విను. సర్వ భూతాతంరాత్ముడను అయిన నన్ను యజ్ఞేశునిగా, పరమేశ్వరునిగా తెలుసుకుని ఆత్మలో నిత్యం ఆరాధించు. కర్మబంధాలు ఖండిచి, ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. సుఖాలనూ అనుభవించుట చేత పూర్వం సంపాదించిన పుణ్యాలు వ్యయం అవుతాయి. వ్రతాల వలన పాపాలు తొలగిపోతాయి.”
७-३७२-सी.
"नी यट्टि सुज्ञान निपुणु लेकांतुलु; गोर्कुलु ना यंदुँ गोर नोल्ल;
रट्लैनँ ब्रह्लाद! यसुरेंद्रभर्तवै; सागि मन्वंतर समय मेल्ल
निखिलभोगंबुलु नीवु भोगिंपुमु; कल्याणबुद्धि ना कथलु विनुमु;
सकलभूतमुलंदु संपूर्णुँ डगु नन्नु; यज्ञेशु नीश्वरु नात्म निलिपि
७-३७२.१-आ.
कर्मचयमु लेल्ल खंडिंचि पूजन; माचरिंपु मीश्वरार्पणमुग;
भोगमुल नशिंचुँ बुण्यंबु; व्रतमुलँ; बाप संचयमुलु पायु निन्नु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :