Wednesday, June 3, 2015

కుంతి స్తుతి - మఱియు బ్రజాపరిపాలనపరుండయిన

1-204-వ.
మఱియుఁ, బ్రజాపరిపాలనపరుం డయిన రాజు ధర్మయుద్ధంబున శత్రువులఁ వధియించినం బాపంబు లేదని, శాస్త్రవచనంబు గల; దయిన నది విజ్ఞానంబు కొఱకు సమర్థంబు గాదు; చతురంగంబుల ననేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి; హతబంధు లయిన సతుల కేను జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పు లేదు; గృహస్థాశ్రమధర్మంబు లైన తురంగమేధాది యాగంబులచేతఁ బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుం డగు నని, నిగమంబులు నిగమించు; పంకంబునఁ బంకిలస్థలంబునకు, మద్యంబున మద్యభాండంబునకును శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబు లయిన యాగంబులచేతం బురుషులకుఁ బాప బాహుళ్యంబ కాని పాపనిర్ముక్తి గాదని శంకించెద."
              మఱియున్ = ఇంకా; ప్రజా = ప్రజలను; పరిపాలన = పరిపాలించుట; పరుండు = చేయవలసినవాడు; అయిన = అయినట్టి; రాజు = రాజు; ధర్మ = ధర్మబద్ధమైన; యుద్ధంబున = యుద్ధముతో; శత్రువులన్ = శత్రువులను; వధియించినన్ = సంహరించినప్పటికీ; పాపంబు = పాపము; లేదు = లేదు/ అంటదు; అని = అని; శాస్త్ర = శాస్త్రములు చెప్పిన; వచనంబున్ = మాట; కలదు = ఉంది; అయినన్ = అయిననూ; అది = అది; విజ్ఞానంబు = విజ్ఞానము; కొఱకున్ = వలన; సమర్థంబు = సరియయినది; కాదు = కాదు; చతురంగంబులన్ = చతురంగబలములతో {చతురంగము - రథములు, ఏనుగులు, గుఱ్ఱములు, కాల్బలము అను సేనా భాగములుతో కూడిన సేన}; అనేక = లెక్కలేనన్ని; అక్షౌహిణీ = అక్షౌహిణుల {అక్షోహిణి - ఇరవైఒక్కవేల ఎనిమిదివందల డెబ్బై రథములు, అన్ని ఏనుగులు, అరవైయైదువేల నాలుగువందల పది గుర్రాలు, లక్షా తొమ్మిదివేల మూడు వందల యాభై కాల్బలమును కల సేనావిశేషము}; సంఖ్యాతంబులన్ = సంఖ్యలలోనున్న వాటిని; చంపించితిన్ = చనిపోవునట్లు చేసి; హత = చంపబడిన; బంధులు = బంధువులు; అయిన = అయిన; సతులు = స్త్రీలు; కున్ = కు; ఏను = నేను; చేసిన = చేసినటువంటి; ద్రోహంబున్ = ద్రోహమును; తప్పించుకొనన్ = తప్పించుకోడానికి; నేర్పు = మార్గము; లేదు = లేదు; గృహస్థాశ్రమ = గృహస్థాశ్రమపు; ధర్మంబులు = ధర్మాలు; ఐన = అయినట్టి; తురంగమేధ = అశ్వమేధము; ఆది = మొదలగు; యాగంబులు = యాగములు; చేతన్ = చేత; పురుషుండు = మానవుడు; బ్రహ్మహత్య = బ్రాహ్మణులను చంపుట; ఆది = మొదలగు; పాపంబుల = పాపముల; వలనన్ = నుండి; విడివడి = బయటపడి; నిర్మలుండు = నిర్మలమైనవాడు; అగున్ = అగును; అని = అని; నిగమంబులు = వేదములు, నిగమించునవి; నిగమించున్ = నిర్ణయిస్తున్నాయి; పంకంబునన్ = బురదతో; పంకిలస్థలంబు = బురదనేల; కున్ = కును; మద్యంబున = మద్యము వలన; మద్యభాండంబు = మద్యపుకుండ; కున్ = కును; శుద్ధి = పరిశుభ్రత; సంభవింపని = కలుగని; చందంబునన్ = విధంగా; బుద్ధి = ఇష్ట; పూర్వక = పూర్వకముగా చేయు; జీవహింసనంబులు = జీవులనుచంపుటలు; అయిన = అయినట్టి; యాగంబులు = యజ్ఞముల; చేతన్ = వలన; పురుషులు = మానవుల; కున్ = కు; పాప = పాపముల; బాహుళ్యంబ = వృద్ధియే; కాని = కాని; పాప = పాపములనుండి; నిర్ముక్తి = విముక్తి; కాదు = కాదు; అని = అని; శంకించెదన్ = అనుమానిస్తాను.
ప్రజలను పరిపాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను చంపటంలో దోషం లేదని శాస్త్రాలు చెప్పుతున్నాయి. అయినా, ఆలోచించి చూస్తే ఈ మాట నాకు సమంజసం అనిపించటం లేదు. రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, కాలిబంట్లతో కూడిన పెక్కు అక్షౌహిణుల సైన్యాలను చంపించాను. పతులను, బంధువులను హతమార్చి సతులకు నేను చేసిన మహాద్రోహం క్షమించరానిది. నా యీ పాపానికి నిష్కృతి లేదు. గృహస్థధర్మాలైన అశ్వమేధం మొదలైన యజ్ఞాలు ఆచరిస్తే బ్రహ్మహత్య మొదలగు దోషాలు పరిహారం అవుతాయని వేదాలు చెప్పుతున్నాయి.. కాని బురదవల్ల బురదనేల పరిశుభ్రం కాదు. కల్లుపోసి కడిగి నందువల్ల కల్లుకుండకు శుద్ధి లభించదు. అలాగే బుద్ధి పూర్వకంగా చేసే జీవహింసతో కూడిన యజ్ఞాలవల్ల మానవుల పాపం పెరుగుతుందే కాని తరగదని నా అనుమానం.
1-204-va.
maRriyuM~, brajaaparipaalanaparuM Dayina raaju dharmayuddhaMbuna shatruvulaM~ vadhiyiMchinaM baapaMbu lEdani, shaastravachanaMbu gala; dayina nadi viGyaanaMbu koRraku samarthaMbu gaadu; chaturaMgaMbula nanEkaakShauhiNee saMkhyaataMbulaM jaMpiMchiti; hatabaMdhu layina satula kEnu jEsina drOhaMbu dappiMchukona nErpu lEdu; gRihasthaashramadharmaMbu laina turaMgamEdhaadi yaagaMbulachEtaM~ buruShuMDu brahmahatyaadi paapaMbula valana viDivaDi nirmaluM Dagu nani, nigamaMbulu nigamiMchu; paMkaMbunaM~ baMkilasthalaMbunaku, madyaMbuna madyabhaaMDaMbunakunu shuddhi saMbhaviMpani chaMdaMbuna buddhipoorvaka jeevahiMsanaMbu layina yaagaMbulachEtaM buruShulakuM~ baapa baahuLyaMba kaani paapanirmukti gaadani shaMkiMcheda."
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
- - -

Tuesday, June 2, 2015

కుంతి స్తుతి - తనదేహంబునకై

1-203-మ.
"తనదేహంబునకై యనేకమృగసంతానంబుఁ జంపించు దు
ర్జనుభంగిం గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంఘంబు ని
ట్లనిఁ జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హా
యన లక్షావధి నైన ఘోరనరకవ్యాసంగముల్ మానునే?
              తన = తన యొక్క; దేహంబు = దేహ పోషణాదులు; కై = కోసం; అనేక = అనేకమైన; మృగ = మృగముల; సంతానంబున్ = సమూహమును; చంపించు = సంహరించు; దుర్జను = చెడ్డవాని; భంగిన్ = వలె; గురు = గురువుల; బాలక = పిల్లల; ద్విజ = బ్రాహ్మణుల; తనూజ = పుత్రుల; భ్రాతృ = సోదరుల; సంఘంబున్ = సమూహములను; ఇట్లు = ఈ విధంగా; అనిన్ = యుద్ధములో; చంపించిన = చనిపోవునట్లు చేసిన; పాప = పాపం; కర్ముడు = చేసినవాడి; కున్ = కి; రాజ్య = రాజ్యముమీద; ఆకాంక్షి = బలీయమైన కోరికతో వేగువాడి; కిన్ = కి; నాకు = నాకు; హాయన = సంవత్సరములు; లక్ష = లక్షలకొలది; అవధి = మేర; ఐనన్ = జరుగునట్టి; ఘోర = ఘోరమైన; నరక = నరకమువలన; వ్యాసంగముల్ = సంబంధములు / వసించుటలు; మానునే = తప్పునే (తప్పవు).
            అమాయకమైన మృగాలను ఎన్నింటినో తన శరీరపోషణకోసం అని చంపించే దుర్మార్గుడిలా, రాజ్యంకోసం అని గురువులను, బాలకులను, బ్రహ్మణులను, కొడుకులను, అన్నదమ్ములను యుద్ధరంగంలో చంపించాను. ఇంతటి పాపానికి ఒడిగట్టిన నేను లక్షల సంవత్సరాల పర్యంతం ఘోరమైన నరకం అనుభవించక తప్పదు కదా.
1-203-ma.
"tanadEhaMbunakai yanEkamRigasaMtaanaMbuM~ jaMpiMchu du
rjanubhaMgiM guru baalaka dvija tanooja bhraatRi saMghaMbu ni
TlaniM~ jaMpiMchina paapakarmunaku raajyaakaaMkShikin naaku haa
yana lakShaavadhi naina ghOranarakavyaasaMgamul maanunE?
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, June 1, 2015

కుంతి స్తుతి - అని యిట్లు సకలసంభాషణంబుల

1-202-వ.
అని యిట్లు సకలసంభాషణంబుల నుతియించు గొంతిమాటకు నియ్యకొని, గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి రథారూఢుండై కరినగరంబునకు వచ్చి కుంతీసుభద్రాదుల వీడ్కొని, తన పురంబునకు విచ్చేయ గమకించి, ధర్మరాజుచేఁ గించిత్కాలంబు నిలువు మని ప్రార్థితుండై, నిలిచె; నంత బంధువధశోకాతురుం డయిన ధర్మజుండు నారాయణ వ్యాస ధౌమ్యాదులచేతఁ దెలుపంబడియుఁ దెలియక మోహితుండై నిర్వివేకం బగు చిత్తంబున నిట్లనియె.
              అని = అని; ఇట్లు = ఈ విధంగా; సకల = సమస్త; సంభాషణంబులన్ = పదముల; నుతియించు = కీర్తించు; గొంతి = కుంతీదేవి; మాట = మాటలు; కున్ = కి; ఇయ్యకొని = అంగీకరించి; గోవిందుండు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు (స్వామి) / కృష్ణుడు}; మాయా = మాయను; నిరూఢ = నెలకొల్పే; మందహాస = చిరునవ్వు; విశేషంబున = విశిష్టతవలన; మోహంబున్ = మోహమును; ఒందించి = కలిగించి; రథా = రథమును; ఆరూఢుండు = అధిష్టించినవాడు; ఐ = అయ్యి; కరినగరంబు = హస్తినాపురము; కున్ = కు; వచ్చి = వచ్చి; కుంతీ = కుంతియొక్క; సుభద్ర = సుభద్ర; ఆదుల = మొదలగువారి యొక్క; వీడ్కొని = వీడ్కోలు తీసుకొని; తన = తన యొక్క; పురంబు = నగరాని; కున్ = కి; విచ్చేయ = వెళ్ళవలెనని; గమకించి = సంకల్పించి; ధర్మరాజు = ధర్మరాజు; చేన్ = చేత; కించిత్ = కొంచెము; కాలంబు = కాలము; నిలువుము = ఆగుము; అని = అని; ప్రార్థితుండు = వేడుకొనబడినవాడు; ఐ = అయి; నిలిచెన్ = ఆగెను; అంతన్ = అంతట; బంధు = బంధువులను; వధ = వధించిన; శోక = బాధతో; ఆతురుండు = వేదనపడుతున్నవాడు; అయిన = అయినట్టి; ధర్మజుండు = ధర్మరాజు; నారాయణ = కృష్ణుడు {నారాయణుడు - నారముల యందు నివశించువాడు, విష్ణువు}; వ్యాస = వ్యాసుడు; ధౌమ్య = ధౌమ్యుడు; ఆదులు = మొదలగువారి; చేతన్ = చేత; తెలుపంబడియున్ = తెలియజేయబడి నప్పటికీ; తెలియక = సమాధానపడలేక; మోహితుండు = మోహము చెందినవాడు; ఐ = అయి; నిర్వివేకంబు = వివేకశూన్యంము; అగు = అయిన; చిత్తంబునన్ = మనసుతో; ఇట్లు = ఈ విధంగా; అనియెన్ = పలికెను.
            ఈ విధంగా కుంతీదేవి మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది. ఆమె ప్రార్థనను అంగీకరించిన శ్రీకృష్ణుడు మాయా మయమైన తన మధుర మందహాసంతో మైమరపించాడు; రథారూఢుడై హస్తినాపురానికి తిరిగివచ్చాడు. కొంతకాలమైన తరువాత కుంతి, సుభద్ర మొదలగువారికి చెప్పి ద్వారకానగరానికి ప్రయాణమైనాడు గోవిందుడు; కొద్దికాలం ఉండమని ధర్మరాజు బతిమిలాడటంతో ఉండిపోయాడు; చుట్టాలందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మజుణ్ణి కృష్ణుడు, వాయసుడు, ధౌమ్యుడు మొదలైనవారు ఎన్నో విధాల ఓదార్చారు; అయినా, ఆయన మనస్సు ఊరట చెందలేదు; వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఇలా అనుకోసాగాడు.
1-202-va.
ani yiTlu sakalasaMbhaaShaNaMbula nutiyiMchu goMtimaaTaku niyyakoni, gOviMduMDu maayaa nirooDha maMdahaasa vishEShaMbuna mOhaMbu noMdiMchi rathaarooDhuMDai karinagaraMbunaku vachchi kuMteesubhadraadula veeDkoni, tana puraMbunaku vichchEya gamakiMchi, dharmaraajuchEM~ giMchitkaalaMbu niluvu mani praarthituMDai, niliche; naMta baMdhuvadhashOkaaturuM Dayina dharmajuMDu naaraayaNa vyaasa dhaumyaadulachEtaM~ delupaMbaDiyuM~ deliyaka mOhituMDai nirvivEkaM bagu chittaMbuna niTlaniye.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :