Monday, May 4, 2015

కృష్ణలీలలు

10.1-386-వచనము
అప్పు డా యవ్వయు గోపికలును వెఱంగుపడిరి; తదనంతరంబ
10.1-387-ఆటవెలది
ఒడలఁ జెమట లెగయ నుత్తరీయము జాఱ
వీడి యున్న తుఱుము విరులు రాలఁ
గట్టరాని తన్నుఁ గట్టెద నని చింతఁ
గట్టుకొనిన తల్లిఁ గరుణఁ జూచి.
10.1-388-కంద పద్యము
బంధవిమోచనుఁ డీశుఁడు
బంధింపఁ బెనంగు జనని పాటోర్చి సుహృ
ద్బంధుఁడు గావున జననీ
బంధంబునఁ గట్టుపడియెఁ బాటించి నృపా!
          ఆప్పుడు ఆ వింతను, పిల్లాణ్ణి చూసి యశోదా, గోపికలూ నివ్వెరపోయారు.
          పడుతున్న శ్రమకు యశోద శరీరమంతా చమటలు పట్టాయి. కొప్పు వదులైపోయి పువ్వులు రాలిపోయాయి. అలా కట్టటానికి శక్యంకాని తనను కట్టాలనే పట్టుదలతో తల్లి పడుతున్న తంటాలు చూసి నల్లనయ్య జాలి పడ్డాడు.
          ఓ పరీక్షిన్మహారాజా!  భగవంతుడు, భవబంధాలను తొలగించి మొక్షాన్ని ప్రసాదించేవాడు అయిన కృష్ణబాలుడు. ఇప్పుడు ఆయన కన్నతల్లి కష్టం చూడలేక అలా త్రాడుకి కట్టుపడిపోయాడు. అతడు ఆప్తులైన వారికి ఆత్మబంధువు గదా!  
10.1-386-vachanamu
appu Daa yavvayu gOpikalunu veRraMgupaDiri; tadanaMtaraMba
10.1-387-aaTaveladi
oDalaM~ jemaTa legaya nuttareeyamu jaaRra
veeDi yunna tuRrumu virulu raalaM~
gaTTaraani tannuM~ gaTTeda nani chiMtaM~
gaTTukonina talliM~ garuNaM~ joochi.
10.1-388-kaMda padyamu
baMdhavimOchanuM~ DeeshuM~Du
baMdhiMpaM~ benaMgu janani paaTOrchi suhRi
dbaMdhuM~Du gaavuna jananee
baMdhaMbunaM~ gaTTupaDiyeM~ baaTiMchi nRipaa!
          అప్పుడు = ఆ సమయమునందు; అవ్వయున్ = తల్లి; గోపికలునున్ = గోపికలు; వెఱంగుపడిరి = ఆశ్చర్యపోయిరి; తదనంతరంబ = ఆ తరువాత.
          ఒడలన్ = ఒంటినిండా; చెమటల్ = చెమట; ఎగయన్ = ఎగజిమ్మగా; ఉత్తరీయమున్ = కొంగు; జాఱన్ = జారిపోగా; వీడి = వదులైపోయి; ఉన్న = ఉన్నట్టి; తుఱుమున్ = జుట్టుముడినుండి; విరులు = పువ్వులు; రాలన్ = రాలిపోతుండగా; కట్టరాని = లోబడజేసుకొననశక్యమైన; తన్నున్ = అతనిని; కట్టెదను = కట్టివేసెదను; అని = అనెడి; చింతన్ = విచారము; కట్టుకొనిన = మూటగట్టుకొనిన; తల్లిన్ = తల్లిని; కరుణన్ = దయతో; చూచి = చూసి.
          బంధ = సంసారబంధములను; విమోచనుడు = తొలగిచువాడు; ఈశుడు = బాలకృష్ణుని; బంధింపన్ = కట్టివేయుటకు; పెనంగు = పెనగులాడుచున్నట్టి; జనని = తల్లి; పాటున్ = శ్రమను; ఓర్చి = సహించి; సుహృత్ = ఆప్తులకు; బంధుడు = బంధువు; కావునన్ = కనుక; జననీ = తల్లి యొక్క; బంధంబునన్ = బంధింపబడుటకు; కట్టుపడియెన్ = కట్టుబడిపోయెను; పాటించి = పూని; నృపా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Sunday, May 3, 2015

కృష్ణలీలలు

10.1-384-వచనము
ఇట్లు గ్రద్దన నా ముద్దియ ముద్దులపట్టి యుదరంబు గట్టనడరుచుఁ జతురంబుగఁ జక్క నొక్కత్రాడు చుట్టిన నది రెండంగుళంబులు కడమపడియె; మఱియు నొక్క బంధంబు సంధించి వలగొనిన నంతియ కొఱంతయయ్యె; వెండియు నొక్కపాశంబు గూర్చి పరివేష్టించిన వెల్తిఁజూపె; నిట్లు.
10.1-385-కంద పద్యము
తజ్జనని లోఁగిటం గల
రజ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్
బొజ్జ దిరిగి రా దయ్యె జ
గజ్జాలము లున్న బొజ్జఁ గట్టన్ వశమే?
          ఇలా తన ముద్దుల కొడుకును కట్టటానికి ఒక త్రాడు తెచ్చి నడుంచుట్టూ చుట్టబోయింది. అది 2 అంగుళాలు తక్కువైంది. మరోత్రాడు జతచేసినా అదే 2 అంగుళాలు తక్కువైంది. మరొక్క త్రాడు ముడేసినా అంతే తక్కువైంది.
          ఆ యమ్మ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ వరుసగా కలిపినా అంతే వెలితి ఉండిపోయింది. ముజ్జగములూ దాగి ఉన్న ఆ చిరుబొజ్జను కట్టటం ఎవరి తరం?
10.1-384-vachanamu
iTlu graddana naa muddiya muddulapaTTi yudaraMbu gaTTanaDaruchuM~ jaturaMbugaM~ jakka nokkatraaDu chuTTina nadi reMDaMguLaMbulu kaDamapaDiye; maRriyu nokka baMdhaMbu saMdhiMchi valagonina naMtiya koRraMtayayye; veMDiyu nokkapaashaMbu goorchi parivEShTiMchina veltiM~joope; niTlu.
10.1-385-kaMda padyamu
tajjanani lOM~giTaM gala
rajjuparaMparalaM~ grammaRran sutuM~ gaTTan
bojja dirigi raa dayye ja
gajjaalamu lunna bojjaM~ gaTTan vashamE?
          ఇట్లు = ఈ విధముగ; గ్రద్దనన్ = చటుక్కున; ఆ = ప్రసిద్దురాలైన; ముద్దియ = ముద్దరాలు; ముద్దుల = గారాల; పట్టిన్ = పుత్రుని; ఉదరంబున్ = కడుపును; కట్టన్ = కట్టివేయుటకు; అడరుచున్ = పూనుచు; చతురంబుగన్ = నేర్పుగా; చక్కన్ = సరిగా; ఒక్క = ఒకానొక; త్రాడున్ = తాడు; చుట్టినన్ = చుట్టగా; అది = ఆతాడు; రెండు = రెండు (2); అంగుళంబులున్ = అంగుళములు; కడమ = తక్కువ; పడియెన్ = అయ్యెను; మఱియున్ = ఇంకను; ఒక్క = ఒకానొక; బంధంబున్ = తాడు; సంధించి = కలిపి, ముడివేసి; వలగొనినన్ = చట్టుతిప్పగా; అంతియన్ = అంతే; కొఱంత = తక్కువ; అయ్యెన్ = పడినది; వెండియున్ = ఇంకను; ఒక్క = ఒకానొక; పాశంబున్ = తాడు; కూర్చి = ముడివేసి; పరివేష్టించినన్ = చుట్టుతిప్పినను; వెల్తి = తక్కువగుట; చూపెన్ = కనబడెను; ఇట్లు = ఈ విధముగ.
          తత్ = ఆ; జనని = తల్లి; లోగిటన్ = ఇంటిలో; కల = ఉన్నట్టి; రజ్జు = తాళ్ళ; పరంపరలన్ = సమూహములచే; క్రమ్మఱన్ = మరల; సుతున్ = పుత్రుని; కట్టన్ = కట్టబోగా; బొజ్జ = కడుపు; తిరిగి = చుట్టుతిరిగి; రాదు = అందనిది; అయ్యెన్ = అయినది; జగజ్జాలములున్ = ఎల్లలోకములు; ఉన్న = లోనున్న; బొజ్జ = కడుపును; కట్టన్ = కట్టివేయుట; వశమే = శక్యమా, కాదు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Saturday, May 2, 2015

కృష్ణలీలలు

10.1-383-కంద పద్యము
చిక్కఁడు సిరికౌగిలిలోఁ
జిక్కఁడు సనకాదియోగిచిత్తాబ్జములం
జిక్కఁడు శ్రుతిలతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్
         ఆ లీలా గోపాలకృష్ణుడు సామాన్యమైనవాడా కాదు. లక్ష్మీదేవి కౌగిటలోను చిక్కలేదు, సనకసనందాది మహార్షుల చిత్తాలకు చిక్కలేదు. ఉపనిషత్తులకు చిక్కలేదు. ఆహా! అంతటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు.
భక్తపరాధీనుడు గనుక తల్లి యనే మిషచే తనకు అంతరంగ భక్తురాలు గనుక యశోదచేతికి చిక్కాడు.
10.1-383-kaMda padyamu
chikkaM~Du sirikaugililOM~
jikkaM~Du sanakaadiyOgichittaabjamulaM
jikkaM~Du shrutilatikaavaLiM~
jikke nataM~Du leelaM~ dalli chEtan RrOlan
            చిక్కడు = చిక్కుకొనడు; సిరి = లక్ష్మీదేవి యొక్క; కౌగిలి = రెండు చేతుల నడుమ; లోన్ = అందును; చిక్కడు = దొరకడు; సనక = సనకుడు {సనకాది - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులు అనెడి ఆది యోగులు}; ఆది = మున్నగు; యోగి = యోగుల; చిత్త = మనసులనెడి; అబ్జములన్ = పద్మముల నైనను; చిక్కడు = కట్టుబడడు; శ్రుతి = వేదము లనెడి; లతికా = తీగల; ఆవళిన్ = సమూహమున కైనను; చిక్కెను = దొరికెను; అతడు = అట్టివాడు; లీలన్ = అవలీలగా, మాయతో; తల్లి = తల్లి యొక్క; చేతన్ = చేతిలో; ఱోలన్ = రోటికి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Friday, May 1, 2015

కృష్ణలీలలు

10.1-380-కంద పద్యము
ఱోలను కట్టుపడియు న
బ్బాలుఁడు విలసిల్లె భక్త పరతంత్రుండై
యాలాన సన్నిబద్ద వి
శాలమదేభేంద్రకలభ సమరుచి నధిపా!
            పరీక్షిన్మహారాజా! బాలగోపాలుడు భక్తుల వశంలో ఉండే వాడు గనుక తను రోటికి కట్టిబడిపోయి ఉన్నాడు. దానికి అతడు ఏమాత్రం బిక్కమొగం వేయలేదు. పైగా కట్టుకొయ్యకు కట్టబడిన గున్న ఏనుగు వలె హుందాగా వెలిగిపోతున్నాడు.
10.1-380-kaMda padyamu
RrOlanu kaTTupaDiyu na
bbaaluM~Du vilasille bhakta parataMtruMDai
yaalaana sannibadda vi
shaalamadEbhEMdrakalabha samaruchi nadhipaa!
          ఱోలను = రోటికి; కట్టుపడియున్ = కట్టివేయబడి; ఆ = ఆ; బాలుడు = బాలకృష్ణుడు; విలసిల్లెన్ = ఒప్పెను; భక్త = భక్తులకు; పరతంత్రుండు = లోబడునట్టివాడు; ఐ = అయ్యి; ఆలాన = ఏనుగుకట్టుకొయ్యకు; సత్ = మిక్కిలి; నిబద్ధ = కట్టివేయబడినట్టి; విశాల = అధికమైన; మద = మదించిన; ఇభ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠము; కలభ = గున్నతో; సమ = సమానమైన; రుచిన్ = ప్రకాశముతో; అధిపా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :