Saturday, April 4, 2015

కృష్ణలీలలు

10.1-339-వచనము
అని పలికి నెయ్యంబున నయ్యవ్వ నియ్యకొలిపి క్రీడామనుజబాలకుండైన యీశ్వరుండు తన నోరు దెఱచి ముఖంబుఁ జూపిన
          అలా కృష్ణుడు తల్లిని మెత్తని మాటలతో శాంతింపజేసాడు. సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలామానవ వేషధారి అయిన కృష్ణబాలుడు తన నోరు తెరిచి తల్లి యశోదాదేవికి చూపించాడు.
10.1-339-vachanamu
ani paliki neyyaMbuna nayyavva niyyakolipi kreeDaamanujabaalakuMDaina yeeshvaruMDu tana nOru deRrachi mukhaMbuM~ joopina
          అని = అని; పలికి = చెప్పి; నెయ్యంబున్ = ఇంపుగా; ఆ = ఆ యొక్క; అవ్వన్ = తల్లిని; ఇయ్యకొలిపి = ఒప్పించి; క్రీడా = విలాసార్థము; మనుజ = మానవునిగా అవతరించిన; బాలకుండు = పిల్లవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరుండు = భగవంతుడు; తన = తన యొక్క; నోరున్ = నోటిని; తెఱచి = తెరచి; ముఖంబున్ = ముఖమును; చూపినన్ = చూపించగా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Friday, April 3, 2015

కృష్ణలీలలు

10.1-337-వచనము
అని పలికిన ముగుదతల్లికి నెఱదంట యైన కొడు కిట్లనియె.
10.1-338-శార్దూల విక్రీడితము
అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; నన్నీవుగొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే.
          ఆ ముద్దరాలు అయిన తల్లి యశోదా దేవికి మాయలమారి కృష్ణబాలుడు సమాధానం చెప్తున్నాడు
          అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెర్రివాడినా ఏమిటి మట్టి తినడానికి. నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే. వీళ్ళు చెప్పేమాటలు నమ్మెయ్యద్దు – అని చిన్నికృష్ణుడు, మట్టి ఎందుకు తింటున్నావని బెదిరిస్తున్న తల్లి యశోదమ్మకి చెప్పి నోరు తెరిచి చూపించాడు.
10.1-337-vachanamu
ani palikina mugudatalliki neRradaMTa yaina koDu kiTlaniye.
10.1-338-shaardoola vikreeDitamu
ammaa! mannudinaMga nE shishuvunO? yaaM~koMTinO? veRrRrinO?
nammaM jooDaku veeri maaTalu madin; nanneevugoTTaMga vee
rimmaargaMbu ghaTiMchi cheppedaru; kaadEnin madeeyaasya gaM
dhammaaghraaNamu chEsi naa vachanamul tappaina daMDiMpavE.
          అని = అని; పలికిన = చెప్పుతున్న; ముగుద = ముగ్దయైన; తల్లి = తల్లి; కిన్ = కి; నెఱ = మిక్కలి; దంట = దిట్టదనముగలవాడు; ఐన = అయినట్టి; కొడుకున్ = పుత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          అమ్మా = తల్లీ; మన్నున్ = మట్టిని; తినంగ = తినుటకు; నేన్ = నేను; శిశువునో = చంటిపిల్లాడినా; ఆకొంటినో = ఆకలేసిఉన్నానా; వెఱ్ఱినో = వెర్రివాడినా; నమ్మంజూడకు = నమ్మబోకుము; వీరి = వీరి యొక్క; మాటలున్ = పలుకులను; మదిన్ = మనసునందు; నన్నున్ = నన్ను; నీవున్ = నీవు; కొట్టంగన్ = కొట్టుటకోసము; వీరు = వీరు; ఈ = ఇలాంటి; మార్గమున్ = దారిని; ఘటించి = కూర్చి, కల్పించి; చెప్పెదరు = చెప్పుచున్నారు; కాదేనిన్ = కాకపోయినచో; మదీయ = నా యొక్క; ఆస్య = నోటి; గంధమున్ = వాసనను; ఆఘ్రాణము = వాసనచూచుట; చేసి = చేసి; నా = నా యొక్క; వచనముల్ = మాటలు; తప్పు = అబద్దమైనవి; ఐనన్ = అయినచో; దండింపవే = శిక్షించుము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=40&Padyam=337.0


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Thursday, April 2, 2015

కృష్ణలీలలు


10.1-336-కంద పద్యము
మన్నేటికి భక్షించెదు?
మన్నియమము లేల నీవు మన్నింపవు? నీ
యన్నయు సఖులును జెప్పెద
రన్నా! మన్నేల మఱి పదార్థము లేదే?
     ఏమయ్యా కన్నయ్యా! మట్టెందుకు తింటున్నావు. నే వద్దని చెప్పేవేవి ఎందుకు లెక్క చేయవు. తల అలా అడ్డంగా ఊపకు. అన్న బలరాముడు, స్నేహితులు అందరు చెప్తున్నారు కదా. ఏం ఇంట్లో తినడానికి ఇంకేం లేవా ఏమిటి పాపం.
10.1-336-kaMda padyamu
mannETiki bhakShiMchedu?
manniyamamu lEla neevu manniMpavu? nee
yannayu sakhulunu jeppeda
rannaa! mannEla maRri padaarthamu lEdE?
          మన్ను = మట్టిని; ఏటికిన్ = ఎందుకు; భక్షించెదు = తినెదవు; మత్ = నా యొక్క; నియమములు = ఆంక్షలు, ఆజ్ఞలు; ఏలన్ = ఎందులకు; నీవున్ = నీవు; మన్నింపవు = అనుసరించవు; నీ = నీ యొక్క; అన్నయున్ = అన్నయ్య; సఖులునున్ = స్నేహితలు; చెప్పెదరు = చెప్పుతున్నారు; అన్నా = నాయనా; మన్ను = మట్టి; ఏలన్ = ఎందుకు; మఱి = ఇంకేమి; పదార్థము = తినదగినవస్తువు; లేదే = లేదా ఏమి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Wednesday, April 1, 2015

కృష్ణలీలలు

10.1-335-వచనము
అంత నొక్కనాడు బలభద్రప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు మన్ను దినె నని చెప్పిన యశోద బాలుని కేలు పట్టుకొని యిట్లనియె.
           ఒక రోజున బలరాముడు మొదలైన యాదవ బాలురు కృష్ణుడు మట్టి తిన్నాడు అని యశోదాదేవికి చెప్పారు. అంత ఆ అమాయకపు తల్లి ఆ నెరదంట పాపడిని చెయ్యి పట్టుకొని గదమాయిస్తోంది.
10.1-335-vachanamu
aMta nokkanaaDu balabhadrapramukhulaina gOpakumaarulu vennuMDu mannu dine nani cheppina yashOda baaluni kElu paTTukoni yiTlaniye.
          అంతన్ = అప్పుడు; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; బలభద్ర = బలరాముడు; ప్రముఖులు = మున్నగువారు; ఐన = అయిన; గోప = యాదవ; కుమారులు = పిల్లలు; వెన్నుండు = కృష్ణుడు {వెన్నుడు (వి) - విష్ణువు (ప్ర)}; మన్ను = మట్టిని; తినెను = తిన్నాడు; అని = అని; చెప్పినన్ = చెప్పగా; యశోద = యశోద; బాలుని = పిల్లవానిని; కేలు = చేయి; పట్టుకొని = పట్టుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :