Tuesday, July 15, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 352

ఘన యమనానదీ

10.1-665-సీ.
ఘన యమునానదీ కల్లోల ఘోషంబు;
 సరసమృదంగఘోషంబు గాఁగ
సాధుబృందావనచరచంచరీక గా;
 నంబు గాయక సుగానంబు గాఁగ
కలహంస సారస కమనీయమంజు శ;
 బ్దంబులు తాళశబ్దములు గాఁగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది;
 జనులు సభాసీనజనులు గాఁగ
తే.
పద్మరాగాది రత్నప్రభాసమాన
మహితకాళియ ఫణిఫణామండపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్యనైపుణమునఁ బేర్చి నృత్య మాడె.
          ఆ మహానది యమునలో కదిలే తరంగాల ధ్వనులు, చక్కటి మృదంగ వాయిద్యంలా పలుకుతుండగా; ఆ బృందావనంలో తిరుగాడే తుమ్మెదల మధుర సంగీతం, గాయకుల సొంపైన గానంలా వినబడుతుండగా; కలహంసలు సారస పక్షులు చేస్తున్న శ్రావ్యమైన శబ్దాలు, మంజుల తాళధ్వనుల అందాలు సంతరించుకోగా;  ఆకాశం నుండి చూస్తున్న దేవతలు గంధర్వులు మున్నగు వారంతా సభాసీనులైన ప్రేక్షకులై యుండగా; కెంపులు మొదలైన నవరత్నాల ప్రకాశంతో తులతూగే ఆ కాళియుని పాముపడగలనే విశాల మండపం మీద బాలకృష్ణుడు అనే కలువల వంటి కన్నులు గల ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి బహుళ నైపుణ్యముల అతిశయాన్ని ప్రకాశింపజేస్తూ నాట్యం చేశాడు.
పరమాద్భుతమైన ఈ రత్నగుళికలాంటి ఈ పద్యం వింటుంటే “పద్మరాగాది” వద్దకు వచ్చే సరికి మన కిట్టయ్య చేసే కాళియమర్థనం కళ్ళకుకట్టినట్టు కనబడుతు ఉంటుంది.
10.1-665-see.
ghana yamunaanadee kallOla ghOShaMbu;
 sarasamRidaMgaghOShaMbu gaa@Mga
saadhubRiMdaavanacharachaMchareeka gaa;
 naMbu gaayaka sugaanaMbu gaa@Mga
kalahaMsa saarasa kamaneeyamaMju sha;
 bdaMbulu taaLashabdamulu gaa@Mga
divinuMDi veekShiMchu divija gaMdharvaadi;
 janulu sabhaaseenajanulu gaa@Mga
tE.
padmaraagaadi ratnaprabhaasamaana
mahitakaaLiya phaNiphaNaamaMDapamuna
naLinalOchana vikhyaata nartakuMDu
nityanaipuNamuna@M bErchi nRitya maaDe.
          ఘన = గొప్ప; యమునా = యమున అనెడి; నదీ = నదియొక్క; కల్లోల = పెద్దఅలల; ఘోషంబు = పెద్దధ్వని; సరస = రసయుక్తమైన; మృదంగ = మద్దెల; ఘోషంబు = ధ్వని; కాగ = అగుతుండగ; సాధు = చక్కని; బృందావన = బృందావనము నందు; చర = మెలగెడి; చంచరీక = తుమ్మెదల; గానంబు = పాట; గాయక = గాయకుల; సు = మంచి; గానంబున్ = పాటలు; కాగన్ = అగుచుండగ; కలహంస = కలహంసల; సారస = బెగ్గురుపక్షుల; కమనీయ = మనోజ్ఞ మైన; మంజు = ఇంపైన; శబ్దంబులు = ధ్వనులు; తాళ = పక్కతాళము వేయు వారి; శబ్దములు = ధ్వనులు; కాగన్ = అగుచుండగ; దివి = ఆకాశము; నుండి = నుండి; వీక్షించు = చూచెడి; దివిజ = దేవతలు; గంధర్వ = గంధర్వులు; ఆది = మొదలైన; జనులు = ప్రజలు; సభ = సభ యందు; ఆసీన = కూర్చున్న; జనులు = వారు; కాగన్ = అగుచుండగ; | పద్మరాగ = కెంపులు; ఆది = మొదలైన; రత్న = రత్నములచేత; ప్రభాసమాన = మిక్కలి వెలుగుచున్న; మహిత = గొప్ప; కాళియ = కాళియుడు అనెడి; ఫణి = పాము; ఫణా = పడగ లనెడి; మండపమునన్ = వేదికపైన; నళినలోచన = పద్మాక్షుడు, కృష్ణుడు; విఖ్యాత = ప్రసిద్ధుడైన; నర్తకుండు = నృత్యము చేయువాడు; నిత్య = శాశ్వత మైన; నైపుణమునన్ = నేర్పుచేత; పేర్చి = అతిశయించి; నృత్యము = నాట్యములు; ఆడెన్ = చేసెను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, July 14, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 351

శామంతికా

10.1-799-క.
శామంతికా స్రగంచిత
సీమంతవతీ కుచోష్ణ జిత శీతభయ
శ్రీమంతంబై గొబ్బున
హేమంతము దోఁచె; మదనుఁ డేఁచె విరహులన్.
          ఇంతలో శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసింది. చేమంతి పూలు ధరించిన పూబంతుల చనుబంతల వేడిమిచే చలి భయాన్ని జయించారు కాని. వియోగులను మన్మథుడు వేధించాడు.
బహుచక్కని ఋతు వర్ణన సాధించిన చమత్కార పద్య మిది. ప్రబంధ లక్షణాలలో ఋతువర్ణన ఒకటి.
10.1-799-ka.
SaamaMtikaa sragaMchita
seemaMtavatee kuchOshNa jita Seetabhaya
SreemaMtaMbai gobbuna
haemaMtamu dO@Mche; madanu@M Dae@Mche virahulan.
          శామంతికా = చేమంతి పూల; స్రక్ = దండచేత; అంచిత = అలంకరింపబడిన; సీమంతవతీ = పాపటలు కలిగిన స్త్రీల; కుచ = పాలిండ్ల; ఉష్ణ = వేడిచేత; జిత = జయింపబడిన; శీత = చలివలని; భయ = భయము అనెడి; శ్రీమంతంబు = సంపదలు కలిగినవారు; ఐ = అయ్యి; గొబ్బున = తటాలున; హేమంతము = చలికాలము; తోచెన్ = కనబడెను; మదనుడు = మన్మథుడు; ఏచెన్ = బాధించెను, పీడించెను; విరహులన్ = విరహము కలవారు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~