Sunday, May 11, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 284

తరణంబులు

11-15-క.

తరణంబులు భవజలధికి
హరణంబులు దురితలతల కాగమముల కా
భరణంబు లార్తజనులకు
శరణంబులు, నీదు దివ్యచరణంబు లిలన్‌.
          ఓ శ్రీకృష్ణా! భూలోకంలో నీ దివ్యమైన శ్రీచరణాలు సంసారసాగరాన్ని దాటించే తెప్పల వంటివి. పాపాలనే పాశాలను హరించునవి. ఆగమాలకు ఆభరణాలైనవి. ఆర్తు లైన వారికి శరణు వొసంగెడివి.
విశ్వామిత్ర, వసిష్ఠ, నారదాది మహర్శులు వచ్చి దర్శించి ద్వారకానగరంలో దివ్యంగా కొలువున్న వాసుదేవుని ప్రార్తిస్తున్నారు.
11-15-ka.
taraNaMbulu bhavajaladhiki
haraNaMbulu duritalatala kaagamamula kaa
bharaNaMbu laartajanulaku
SaraNaMbulu, needu divyacharaNaMbu leelan.
          తరణంబులు = దాటించెడి తెప్పలు; భవ = సంసార; జలధి = సముద్రమున; కిన్ = కు; హరణంబులు = హరించెడివి; దురిత = పాపాలు అనెడి; లతలు = తీవెల; కిన్ = కు; ఆగమములు = వేదాల; కిన్ = కు; ఆభరణంబులు = అలంకారములు; ఆర్త = ఆర్తులైన; జనులు = వారి; కున్ = కు; శరణంబులు = రక్షించునవి; నీదు = నీ యొక్క; దివ్య = దివ్యమైన; చరణంబు = పాదములు; ఇలన్ = భోలోకములో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Saturday, May 10, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 283

సరసిజనిభహస్తా


10.1-1791-మా.
సరసిజనిభహస్తా! సర్వలోకప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢకీర్తీ!
పరహృదయవిదారీ! భక్తలోకోపకారీ!
గురుబుధజనతోషీ! ఘోరదైతేయశోషీ!
          కమలాలతో సమానమైన కరములు గలవాడ! ఎల్లలోకాలలోను ఎన్నదగిన శ్రేష్ఠుడ! సాటిలేని మంగళ స్వరూపుడ! స్వచ్ఛమైన వన్నెకెక్కిన కీర్తి గలవాడ! శత్రువుల గుండెలను భేదించువాడ! భక్త సమాజ మంతటికి మేలు చేయువాడ! పెద్దలను పండితులను సంతోషపరచువాడ! భయంకరులైన రాక్షసులను నశింపజేయువాడ!
ఇది దశమస్కంధ ప్రథమభాగాంత ప్రార్థన.
10.1-1791-maa.
sarasijanibhahastaa! sarvalOkapraSastaa!
nirupama Subhamoortee! nirmalaarooDhakeertee!
parahRdayavidaaree! bhaktalOkOpakaaree!
gurubudhajanatOshee! ghOradaitaeyaSOshee!
          సరసిజ నిభ హస్తా = శ్రీరామా {సరసిజ నిభ హస్తుడు - సరసిజ (పద్మము) నిభ (వంటి) హస్తుడు (చేతులు కలవాడు), శ్రీరాముడు}; సర్వ లోక ప్రశస్తా = శ్రీరామా {సర్వ లోక ప్రశస్తుడు - సర్వ (సమస్తమైన) లోక (లోకములలోను) ప్రశస్తుడు (శ్లాఘింపబడువాడు), శ్రీరాముడు}; నిరుపమ శుభ మూర్తీ = శ్రీరామా {నిరుపమశుభమూర్తి - నిరుపమ (సాటిలేని) శుభ (మేళ్ళు కలిగించెడి) మూర్తి (ఆకృతి కలవాడు), శ్రీరాముడు}; నిర్మ లారూఢ కీర్తీ = శ్రీరామా {నిర్మ లారూఢ కీర్తి - నిర్మల (పరిశుద్ధ మైన) ఆరూఢ (నిలక డైన) కీర్తి (కీర్తి కలవాడు), శ్రీరాముడు}; పర హృదయ విదారీ = శ్రీరామా {పర హృదయ విదారి - పర (విరోధుల) హృదయ (గుండెలను) విదారి (చీల్చెడి వాడు), శ్రీరాముడు}; భక్త లో కోపకారీ = శ్రీరామా {భక్త లో కోపకారి - భక్తులను లోక (ఎల్లరకు) ఉపకారి (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు}; గురు బుధ జన తోషీ = శ్రీరామా {గురు బుధ జన తోషి - గురు (గొప్ప) బుధ (ఙ్ఞానము కల) జన (వారికి) తోషి (సంతోషము కలిగించు వాడు), శ్రీరాముడు}; ఘోర దైతేయ శోషీ = శ్రీరామా {ఘోర దైతేయ శోషి - ఘోర (క్రూర మైన) దైతేయ (రాక్షసులను) శోషి (నశింపజేయు వాడు), శ్రీరాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Friday, May 9, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 282

అంగవ్రాతములో


7-188-శా.
అంగవ్రాతములోఁ జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శే
షాంగ శ్రేణికి రక్ష చేయు క్రియ నీ యఙ్ఞుం గులద్రోహి దు
స్సంగుం గేశవ పక్షపాతి నధముం జంపించి వీరవ్రతో
త్తుంగ ఖ్యాతిఁ జరించెదం గులము నిర్దోషంబు గావించెదన్.
          ఈ ప్రహ్లాదుడు మూర్ఖుడు, వంశనాశకుడు, చెడు సావాసాలు పట్టిన వాడు, కేశవ పక్షపాతంతో ఉన్నాడు. శరీరంలో చెడిపోయిన భాగాన్ని కత్తిరించి తొలగించి వైద్యుడు మిగతా దేహానికి రక్షణ చేకూర్చుతాడు. అలాగే వీడిని చంపించి మహావీరు డను కీర్తితో తిరిగుతాను. నా వంశాన్ని పవిత్రం చేసుకొంటాను.
లోకంలో అన్ని శాస్త్రాలు చదివాను శ్రీహరే విశ్వ కర్త భర్త అని చెప్తున్న కొడుకు గురించి హిరణ్యకశిపుడు అంటున్న మాటలు యివి.
7-188-Saa.
aMgavraatamulO@M jikitsaku@MDu dushTaaMgaMbu khaMDiMchi Sae
shaaMga SraeNiki raksha chaeyu kriya nee ya~@MnuM guladrOhi du
ssaMguM gaeSava pakshapaati nadhamuM jaMpiMchi veeravratO
ttuMga khyaati@M jariMchedaM gulamu nirdOshaMbu gaaviMchedan.
          అంగ = అవయవముల; వ్రాతము = సముదాయము; లోన్ = అందు; చికిత్సకుడు = వైద్యుడు; దుష్ట = పాడైన; అంగంబున్ = అవయమును; ఖండించి = కత్తిరించివేసి; శేష = మిగిలిన; అంగ = అవయవముల; శ్రేణి = సముదాయమున; కిన్ = కు; రక్ష = శుభమును; చేయు = చేసెడి; క్రియన్ = విధముగ; ఈ = ఈ; అజ్ఞున్ = తెలివితక్కువానిని; కుల = వంశమునకు; ద్రోహిన్ = ద్రోహము చేయువానిని; దుస్సంగున్ = చెడు సావాసము చేయువానిని; కేశవ = నారాయణుని {కేశవుడు - కేశి యను రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు}; పక్షపాతిన్ = పక్షము వహించు వాని; అధమున్ = నీచుని; చంపించి = సంహరింప జేసి; వీర = శౌర్యవంతమైన; వ్రత = కార్యములను చేసెడి నిష్ఠచే; ఉత్తుంగ = అత్యధికమైన; ఖ్యాతిన్ = కీర్తితో; చరించెదన్ = తిరిగెదను; కులము = వంశము; నిర్దోషము = కళంకము లేనిదిగా; కావించెదన్ = చేసెదను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, May 8, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 281

పాంచాలీకబరీవికర్షణ

1-177-శా.
పాంచాలీ కబరీవికర్షణమహాపాప క్షతాయుష్కులం
జంచద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి
ప్పించెన్ రాజ్యము ధర్మపుత్త్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁ జే
యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్రప్రభావంబునన్.
          నిండుసభలో ద్రుపదరాజనందన జుట్టు పట్టుకు లాగిన మహాపాప ఫలితంగా దుర్మదాంధులైన ధృతరాష్ట్రనందనుల ఆయుష్షులు క్షీణించాయి. వారలందరినీ నందనందనుడైన గోవిందుడు కరుక్షేత్రయుద్ధంలో చంపించి, ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు. విజయభేరి మ్రోయించి మహేంద్రవైభవంతో మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు. ధర్మరాజుకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెప్పించాడు.
ప్రాస అక్షరంగా పూర్ణానుస్వరం ముందున్న చకారం ప్రయోగింపబడింది. నిండుసభలో చేసిన అకృత్యం వదలిపెట్టదు కదా మరి.
1-177-Saa.
paaMchaalee kabareevikarshaNamahaapaapa kshataayushkulaM
jaMchadgarvula dhaartaraashTrula naniM jaMpiMchi gOviMdu@M Di
ppiMchen raajyamu dharmaputtrunaku@M galpiMchen mahaakhyaati@M jae
yiMchen moo@MDu turaMgamaedhamulu daevaeMdraprabhaavaMbunan.
పాంచాలీ = ద్రౌపది యొక్క; కబరీ = జుట్టును; వికర్షణ = పట్టుకొని తోసివేసిన; మహా = ఘోరమైన; పాప = పాపము వలన; క్షత = క్షీణించిన; ఆయుష్కులన్ = ఆయుస్సు గల వారిని; చంచత్ = చెలరేగిన; గర్వులన్ = గర్వముతో నున్న వారిని; ధార్తరాష్ట్రులన్ = ధృతరాష్ట్ర పుత్రులను; అనిన్ = యుద్ధమున; చంపించి = చంపించి; గోవిందుఁడు = కృష్ణుడు; ఇప్పించెన్ = ఇప్పించెను; రాజ్యమున్ = రాజ్యమును; ధర్మపుత్రుడు = యుధిష్ఠురున {ధర్మపుత్రుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; కున్ = కి; కల్పించెన్ = కలిగించెను; మహా = గొప్ప; ఖ్యాతిన్ = కీర్తిని; చేయించెన్ = చేయించెను; మూఁడు = మూడు; తురంగమేధములు = అశ్వమేధయజ్ఞములు; దేవేంద్ర = దేవేంద్రుని; ప్రభావంబునన్ = వైభవముతో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~