Wednesday, November 10, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౩(393)

( సుయోధనుడు ద్రెళ్ళుట) 

10.2-827-వ.
దామోదరానుమోదితులయి మహారవంబుగాఁ బరిహాసంబులు చేసిన సుయోధనుండు లజ్ఞావనతవదనుండై కుపితమానసుం డగుచు నయ్యెడ నిలువక వెలువడి నిజపురంబునకరిగె; నయ్యవసరంబున ధీవిశాలు రైన సభాసదులగు నచ్చటి జనంబుల కోలాహలంబు సంకులంబైన నజాతశత్రుండు చిత్తంబున విన్ననై యుండె; నప్పుండరీకాక్షుండు భూభార నివారణకారణుం డగుటంజేసి దుర్యోధను నపహాసంబునకుం గాదనండయ్యె; నంత.
10.2-828-క.
హరి ధర్మసుతుని వీడ్కొని
తరుణీ హిత బంధుజన కదంబము గొలువం
బరితోషమునఁ గుశస్థల
పురమునకుం జనియె మోదమున నరనాథా! 

భావము:
కృష్ణుడి ఆమోదంతో అక్కడున్న రాజులు స్త్రీ జనము భీముడితోపాటు పెద్దగా పకపకా నవ్వారు. మయసభలో తనకు జరిగిన ఘోరమైన అవమానానికి సిగ్గుపడి దురాగ్రహంతో దుర్యోధనుడు తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సభాసదుల వేళాకోళంతో కూడిన కోలాహలాన్ని చూసిన ధర్మరాజు చిన్నపోయాడు. భూభారాన్ని నివారించడానికి అవతారం ధరించిన శ్రీకృష్ణుడు దుర్యోధనునికి జరిగిన అవమానాన్ని ఖండించ లేదు. ఓ మహారాజా! ఆ తరువాత కృష్ణుడు ధర్మరాజును వీడ్కొని భార్యాబిడ్డలు, బంధుజనులు సేవిస్తుండగా సంతోషంగా కుశస్థలికి ద్వారకానగరానికి వెళ్ళాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=62&Padyam=828 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: