Saturday, November 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౯(389)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-819-చ.
అనిన మునీంద్రుఁ డిట్లను ధరాధిపుతోఁ "గురురాజు పాండు నం
దనులదెసన్ననేక దురితంబులు నిచ్చలుఁ జేయుచుండు నై
నను, నొకనాఁడు పంకరుహనాభ దయాపరిలబ్ధభూరి శో
భనజిత దేవదైత్యనరపాలకరాజ్యరమామహత్త్వమై.
10.2-820-చ.
వెలయు ననూనసంపదల విశ్రుతకీర్తులు మిన్ను ముట్టఁ బెం
పలరిన పాండుభూవరసుతాగ్రజుఁ డంతిపురంబులోన ను
జ్జ్వలమణిభూషణాంశురుచిజాలము బర్వఁ బయోజనాభు ను
త్కలిక భజించుచున్ ఘనసుఖస్థితి భూరిమనోహరాకృతిన్. 

భావము:
ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. “దుర్యోధనుడు పాండవులకు ఎప్పుడూ అపకారమే చేస్తుంటాడు. అయినా శ్రీకృష్ణుని దయచేత కలిగిన దేవ, దానవ, నరులను పాలించే రాజ్య సంపదలను వైభవం కలవాడైన ధర్మరాజు మహదైశ్వర్యంతోనూ విశ్రుత యశస్సుతోనూ శ్రీకృష్ణుని దయవలన ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతఃపురంలో ఉజ్వలమైన రత్నవిభూషణాల వెలుగుల మధ్య బహు మనోజ్ఞంగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని సేవిస్తూ... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=820 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: