Tuesday, November 9, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౨(392)

( సుయోధనుడు ద్రెళ్ళుట) 

10.2-824-వ.
అట్లు సనుదెంచి మయమాయామోహితంబైన సభాస్థలంబు నందు.
10.2-825-క.
సలిలములు లేని ఠావున
వలువలు వెస నెగయఁ దిగిచి వారక తోయం
బులు గల చోటనుం జేలం
బులు దడియఁగఁ బడియె నిజవిభుత్వము దఱుఁగన్
10.2-826-క.
ఆ విధమంతయుఁ గనుఁగొని
పావని నవ్వుటయు నచటి పార్థివులునుఁ గాం
తావలియును యమతనయుఁడు
వావిరిఁ జేసన్నఁ దమ్ము వారింపంగన్. 

భావము:
ఇలా వచ్చిన దుర్యోధనుడు మాయమయమైన మయాసభా మధ్యంలో ప్రవేశించి. ఆ మయాసభలో నీరులేని స్థలంలో కట్టుకున్న దుస్తులు పైకి ఎగగట్టుకుని; నీరున్న స్థలంలో దుస్తులు తడుపుకొని; దుర్యోధనుడు భ్రమకు లోను అయ్యాడు. ఈవిధంగా భ్రమకులోనైన దుర్యోధనుడిని చూసిన భీమసేనుడు నవ్వాడు. అక్కడున్న రాజులూ స్త్రీ జనమూ ధర్మరాజు సైగ చేసి వారిస్తూ ఉన్నా... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=62&Padyam=826 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: