Thursday, November 25, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౬(406)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-859-ఉ.
సాత్యకి చండరోషమున సాల్వమహీవరు భూరిసౌభ సాం
గత్య చతుర్విధోగ్రబలగాఢతమఃపటలంబు భాసురా
దిత్యమయూఖపుంజరుచితీవ్రశరంబులఁ జూపి సైనిక
స్తుత్యపరాక్రమప్రకటదోర్బలుఁడై విలసిల్లె భూవరా!
10.2-860-ఉత్సా.
భానువిందుఁ డుద్ధతిన్ విపక్షపక్షసైన్య దు
ర్మాన కాననానలోపమాన చండ కాండ సం
తాన మూన నేసి చూర్ణితంబు చేసెఁ జాప వి
ద్యా నిరూఢి దేవతావితాన మిచ్చ మెచ్చఁగాన్. 

భావము:
ఓ రాజశ్రేష్ఠుడా! సాత్యకి మహారోషంతో సాల్వుడి చతురంగబలాలను, సౌభక విమానము అనే చీకటిని సూర్యకిరణాల వంటి వాడి యైన బాణాలను ప్రయోగించి పటాపంచలు కావించాడు. సైనికులందరు అతని పరాక్రమాన్ని బహువిధాల ప్రశంసించారు. భానువిందుడు విజృంభించి, శత్రుసైన్యం అనే అడవిని తీవ్రమైన దావానలం వంటి తన బాణాలు అసంఖ్యాకంగా వేసి భస్మీపటలం చేసాడు. అతని ధనుర్విద్యా కౌశల్యాన్ని దేవతా సమూహం ప్రస్తుతించింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=860 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: