Tuesday, November 2, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౫(385)

( శిశుపాలుని వధించుట ) 

10.2-807-ఆ.
అంత ధర్మతనయుఁడభినవమృదుల దు
కూల సురభికుసుమమాలికాను
లేపనములు రత్నదీపితభూషణా
వళులు దాల్చి వైభవమున నొప్పె.
10.2-808-వ.
అంత నవభృథస్నానానంతరంబున మరలి చనుదెంచి,
10.2-809-ఉ.
పాండుతనూభవాగ్రజుఁడు, పాండుయశోనిధి, భాసమాన మా
ర్తాండనిభుండు యాజక, సదస్య, మహీసుర, మిత్ర, బంధు, రా
ణ్మండలిఁ బూజ సేసి బుధమాన్యచరిత్రుడు వారి కిచ్చెనొం
డొండ దుకూలరత్న కనకోజ్జ్వలభూషణముఖ్యవస్తువుల్‌. 

భావము:
ధర్మరాజు సరిక్రొత్త మృదువైన నూతనవస్త్రాలు, పరిమళ భరితమైన పూలమాలలు, అనులేపనాలు ధరించి; రత్నాలతో ప్రకాశిస్తున్న ఆభరణాలను అలంకరించుకుని, అత్యంత వైభవంగా ప్రకాశించాడు. అవభృథస్నానానంతరం ధర్మరాజు ఇంద్రప్రస్థ పట్టణానికి తిరిగి వచ్చి యజ్ఞం చేయించిన వారిని యజ్ఞ కార్యాన్ని పర్యవేక్షించిన వారినీ సభాసదులైన బ్రాహ్మణులను, బంధుమిత్రులను, రాజులను పాడవులలో అగ్రజుడు, నిర్మలయశస్వి, సూర్య తేజోవంతుడు, పండితమాన్యుడు అయిన ధర్మరాజు సత్కరించాడు. వారందరికీ పట్టువస్త్రాలు, సువర్ణ రత్న భూషణాలు మున్నగువాటిని బహుమానంగా ఇచ్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=809 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: