Thursday, November 18, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౧(401)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-846-వ.
చని యా గోవిందనందన స్యందనంబుం బలసందోహంబునుం దలకడచి, యదు సైన్యంబులు సాల్వబలంబులతోడం దార్కొని బెరయునప్పుడు దేవదానవ సంకులసమర విధంబునం దుములం బయ్యె; నయ్యెడ.
10.2-847-మ.
వితతజ్యాచయ టంకృతుల్‌, మదజలావిర్భూతశుండాల ఘీం
కృతు, లుద్యద్భటహుంకృతుల్,‌ మహితభేరీభాంకృతుల్,‌ భీషణో
ద్ధతనిస్సాణధణంకృతుల్,‌ ప్రకటయోధవ్రాతసాహంకృతుల్‌,
కుతలంబున్, దివి నిండ మ్రోసె రిపుసంక్షోభంబుగా భూవరా! 

భావము:
ఈ విధంగా యాదవసైన్యం ప్రద్యుమ్నుని రథాన్నిదాటి ముందుకు పోయి సాల్వుడి సైన్యాలను ఎదిరించింది. అప్పుడు రెండు పక్షాల బలాలకు జరిగిన బాహాబాహీ సంకుల సమరం దేవదానవ యుద్ధంలాగ కనబడసాగింది. ఓ పరీక్షిన్మహారాజా! ఆ సంకుల సమరంలో విస్తారమైన అల్లెత్రాళ్ళ టంకారాలు, మదగజాల ఘీంకారాలు, భటుల హూంకారాలు, భేరీ భాంకారాలు, వీరుల దురహంకారాలు, శత్రుసంక్షోభంగా భూమ్యాకాశాలు నిండాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=847 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: