Saturday, November 20, 2021
శ్రీకృష్ణ విజయము - ౪౦౨(402)
( యదుసాల్వ యుద్ధంబు)
10.2-848-మ.
హరిరింఖారథనేమి సద్భటపదవ్యాఘట్టనోద్ధూత దు
స్తరధూళీపటలప్రభూత నిబిడధ్వాంతప్రవిధ్వంస కృ
త్కర శాతాసి గదాది హేతిరుచు లాకాశంబు నిండన్ వియ
చ్చర దృక్కుల్ మిఱుమిట్లు గొల్ప సమరోత్సాహంబు సంధిల్లఁగన్.
10.2-849-చ.
తలకొని సైనికుల్ గవిసి తార్కొని పేర్కొని పాసి డాసి యం
కిలి గొనకెమ్ములమ్ములఁ బగిల్చి నొగిల్చితరేతరుల్ తలల్
నలియఁగ మొత్తి యొత్తి నయనంబులు నిప్పులు రాల లీల నౌఁ
దలలు లలాటముల్ ఘనగదాహతి నొంచి కలంచి పోరఁగన్.
10.2-850-వ.
అయ్యవసరంబునం బ్రద్ముమ్నుండు గనుంగొని.
భావము:
గుఱ్ఱాల గిట్టల తాకిడికి, రథచక్రాల ఒరిపిడికి, భటుల పాదఘట్టనలకు లేచిన ధూళి ఆకాశం అంతా నిండి చీకట్లు వ్యాపించాయి. ఆ చీకట్లను పోగొడుతూ సైన్యం చేతులలోని కత్తులు గదలు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశ విహారుల చూపులకు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశం నిండా వ్యాపించాయి. ఇరు పక్షాల సైన్యాలు పూని ఒకరి నొకరు ఎదిరించి బాణ వర్షాలు కురిపించి మర్మస్థానాలను చీల్చేస్తు, క్రోధంతో కన్నులనుండి నిప్పురవ్వలు రాలగా పెద్ద పెద్ద గదలతో తలలపై బాదుకుంటూ, భయంకరంగా పోరాడారు. అలా భీకరంగా పోరుసాగుతున్న సమయంలో అదంతా వీక్షిస్తున్న ప్రద్యుమ్నుడు...
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=849
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment