Wednesday, November 3, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౬(386)

( శిశుపాలుని వధించుట ) 

10.2-810-వ.
అట్లు నారాయణపరాయణులై దేవసమాన ప్రకాశప్రభావంబుల సకలనరనారీలోకంబు లనర్ఘ్యరత్నమయభూషణ మాల్యానులేపనంబులు ధరించి పరమానంద భరితాత్ములై యెప్పియుండి; రంత.
10.2-811-చ.
సునిశితభక్తిఁ దన్మఖముఁ జూడఁగ వచ్చిన యట్టి దేవతా,
ముని, ధరణీసురప్రకర, భూవర, విడ్జన, శూద్రకోటి య
జ్జనవరచంద్రుచే నుచిత సత్కృతులం బరితోషచిత్తులై
వినయముతోడ ధర్మజుని వీడ్కొని పోవుచుఁ బెక్కుభంగులన్.
10.2-812-చ.
హరిచరణాంబుజాతయుగళార్చకుఁడై పెనుపొందు పాండుభూ
వరసుత రాజసూయమఖ వైభవమున్ నుతియించుచున్, సమా
దరమున నాత్మభూముల కుదారత నేఁగిరి; ధర్మసూనుఁడున్
సరసిజనేత్రుఁ దా ననుపఁజాలక యుండు మటంచు వేఁడినన్. 

భావము:
ఆ విధంగా మిక్కిలి విలువైన రత్నమయభూషణాలు గంధమాల్యాదులు ధరించి, దేవతలలా ప్రకాశిస్తూ, నారాయణపరాయణులై నగరంలోని స్త్రీపురుషులు అందరూ ఆనందంగా ఉన్నారు. అలా తను చేసిన రాజసూయయాగాన్ని భక్తితో చూడడానికి వచ్చిన దేవతలు, మునులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు అందరిని ధర్మజుడు సముచిత రీతిలో సత్కరించాడు. వారందరు సంతృప్తి చెంది సంతోషంతో సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతూ యజ్ఞానికి విచ్చేసిన వారంతా శ్రీకృష్ణభక్తుడు పాండురాజ సుతుడు అయిన ధర్మరాజు కావించిన రాజసూయ యాగం వైభవాన్ని పొగుడుతూ తమ తమ స్థలాలకు వెళ్ళారు. ధర్మజుడు శ్రీకృష్ణుడిని వదలలేక ఇంకా కొన్ని రోజులు ఉండమని ప్రార్థించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=812 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: