Saturday, November 20, 2021
శ్రీకృష్ణ విజయము - ౪౦౩(403)
( యదుసాల్వ యుద్ధంబు)
10.2-851-మ.
అనయంబుం గలుషించి సౌభపతి మాయాకోట్లు చంచచ్ఛరా
సన నిర్ముక్త నిశాత దివ్యమహితాస్త్రశ్రేణిచేఁ దత్‌క్షణం
బున లీలాగతి నభ్రగుల్ మనములన్ భూషింప మాయించె న
వ్వనజాతాప్తుఁడు భూరి సంతమసమున్ వారించు చందంబునన్
10.2-852-వ.
మఱియును.
10.2-853-చ.
అతిరథికోత్తముం డన నుదంచితకాంచనపుంఖ పంచ విం
శతివిశిఖంబులన్నతని సైనికపాలుని నొంచి యుగ్రుఁడై
శత శతకోటికోటినిభసాయకముల్ పరఁగించి సాల్వభూ
పతి కకుదంబు నొంచి లయభైరవుకైవడిఁ బేర్చి వెండియున్.
భావము:
సాల్వుడు కలుషాత్ముడై పన్నిన అనంత మాయాజాలాలను వీక్షించాడు. వీరావేశంతో విజృంభించి, సూర్యుడు తన కిరణాలతో కారుచీకట్లను పటాపంచలు చేయునట్లు, ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రాలతో ఆ మాయాజాలాన్ని ఛేదించాడు. గగనచరులు అతని పరాక్రమం చూసి పొగిడారు. అనంతరం గొప్ప అతిరథుడి వలె ప్రద్యుమ్నుడు ఇరవైఐదు వాడి బాణాలతో సాల్వుడి సైన్యాధిపతిని నొప్పించాడు. పిడుగుల్లాంటి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని మూపు పగలగొట్టాడు. లయకాలపు భైరవుడి లాగ విజృంభించాడు. అటుపిమ్మట....
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=853
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment