Sunday, November 7, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౦(390)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-821-వ.
ఉండం గనుంగొని; యదియునుంగాక, యొక్కనాఁడు లలితాష్టమీ శశాంకబింబంబులం విడంబించుచు నింద్రనీలరుచినిచయంబు నపహసించు కుటిలకుంతలంబులు నటనంబు సలుపం దనరు నిటలఫలకంబులును, బుష్పచాపుచాపంబు రూపునేపుమాపు భ్రూయుగోపాంతంబులై సౌదామనీదామ రుచిస్తోమంబులై, కర్ణాంతసీమంబులై యంజనంబులతోడ రంజిల్లు నేత్రకంజంబులును, నవమల్లికాముకుళ విభాసిత దంతమరీచికా నిచయోద్దీపిత మందహాసచంద్రికాధవళితంబులును, ముకురోపమితంబులై కర్ణకుండలమణిమరీచి జాలంబులు బెరసి బహుప్రకారంబులఁ బర్వంబొలుచు కపోలపాలికలును, విలసిత గ్రైవేయక ముక్తాఫలహార నిచయంబుల కిమ్ముచూపక మిసమిసని పసగల మెఱుంగులు గిఱికొన మీటినంబగులు ననం బొగడందగి మొగంబులకుం బుటంబులెగయు నుత్తుంగపీనకుచభారంబుల వ్రేఁగు లాఁగలేక తూఁగాడుచుం గరతల పరిమేయంబులగు మధ్యభాగంబులును, ఘనజఘనమండ లావతీర్ణకాంచన కాంచీకలాప కింకిణీకలకల నినాదోల్లసితంబులగు కటిప్రదేశంబులును, సల్లలిత హల్లక పల్లవకాంతుల మొల్లంబులఁ గొల్లలుగొని యభిరామంబులై శోభిల్లు పదపాణితలంబులును, నలసగతులం బదంబులం దనరు మణినూపురంబులు గోపురంబులం బ్రతిస్వనంబు లొలయ మొరయ నలరు చరణారవిందంబులును, రత్నవలయ కంక ణాంగుళీయకాది వివిధ భూషణద్యుతినిచయంబు లుష్ణమరీచి కరనిచయంబుల ధిక్కరింప వెలుంగు కరకంజంబులును, మృగ మద ఘనసార హరిచందనాగరు కుంకుమపంకంబుల భాసురంబులగు వాసనలు నాసారంధ్రంబులకు వెక్కసంబులై పొలయు సౌభాగ్యంబులు గలిగి చైతన్యంబు నొందిన మాణిక్యపుబొమ్మల విధంబున గగన మండలంబు నిర్గమించి, వసుధాతలంబున సంచరించు చంద్రరేఖల చెలువున శృంగారరసంబు మూర్తీభవించిన జగంబుల మోహపఱచు మోహినీదేవతలచందంబున, విల సించు మాధవ వధూసహస్రంబుల సంగతిని సౌదామనీలతయునుం బోలె నొప్పుచుండెడు ద్రుపదరాజనందన విభవంబును రాజసూయ మహాధ్వరోత్సవంబునం జూచి చిత్తంబుత్తలపడ సుయోధనుండు సంతాపానలంబునం గ్రాఁగుచుండె; నంత నొక్కనాఁడు ధర్మనందనుఁడు నిర్మలంబగు సభాభవనంబునకుం జని. 

భావము:
ఒకనాడు మనోహరమైన అష్టమినాటి చంద్రబింబాల వంటి ఫాలభాగములతో; ఇంద్రనీలమణులను మించిన ముంగురులతో; మన్మథుడి ధనుస్సులవంటి కనుబొమ్మలతో; ఆకర్ణాంతములై తళతళ మెరుస్తున్న కాటుకకన్నులతో; విరజాజిమొగ్గల వంటి పలువరుసతో; చిగురు పెదవుల చిరునవ్వు వెన్నెలలతో; కర్ణకుండలాల కాంతులు జాలువారు చక్కని చిక్కని చెక్కిళ్ళతో; ముత్యాలహారములకు సైతం సందీయక మిసమిసలాడు ఉత్తుంగ పయోధరములతో; నకనకలాడు సన్నని నెన్నడుములతో; చిరుగజ్జెల సవ్వడులతో; కూడిన బంగారు ఒడ్డాణములు ప్రకాశించు కటి ప్రదేశాలతో; చిగురుటాకులవంటి అరచేతులతో; ఘల్లుఘల్లున మ్రోగుచున్న కాలి అందియలతో; రతనాల గాజులు, కంకణాలు ఉంగరాలు కాంతులీను కరకమలములతో; సుగంధాలు విరజిమ్ము కస్తూరి పచ్చకర్పూరము మంచిగంధము మైపూతలతో అలరారుతూ; ప్రాణాలతో ఉన్న మాణిక్యపు బొమ్మల చక్కదనాలతో; దివి నుండి భువికి దిగివచ్చిన చంద్రరేఖ తీరున శృంగారరసం మూర్తీభవించిన మోహినీదేవతల వలె విరాజిల్లుతున్న మిక్కిలి సౌందర్యవతు లైన శ్రీకృష్ణుడి సతుల నడుమ; మెరుపు తీగలా ప్రకాశిస్తూ ఉన్న ద్రౌపదీదేవి సౌభాగ్యాన్నీ రాజసూయయాగ మహావైభవాన్నీ చూస్తున్న దుర్యోధనుడు అసూయతో లోలోపల బాధపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మరాజు నిండుకొలువు తీర్చి కూర్చున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=821 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: