Sunday, November 21, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౪(404)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-854-చ.
పదిపది యమ్ములన్ మనుజపాలవరేణ్యుల నొంచి రోషముం
గదురఁగ మూఁడుమూఁడు శితకాండములన్ రథదంతివాజులం
జదియఁగ నేసి యొక్కొక నిశాతశరంబున సైనికావలిన్
మదము లడించి యిట్లతఁ డమానుషలీలఁ బరాక్రమించినన్.
10.2-855-క.
దుర్మానవహరు నద్భుత
కర్మమునకు నుభయ సైనికప్రకరంబుల్‌
నిర్మలమతి నుతియించిరి
భర్మాచలధైర్యు విగతభయుఁ బ్రద్యుమ్నున్. 

భావము:
ప్రద్యుమ్నుడు పదేసి బాణాలు చొప్పున వేసి, సాల్వుడి మిత్రులైన రాజశ్రేష్ఠులను నొప్పించాడు. మూడేసి బాణాలు వేసి రథ, గజ, అశ్వాలను పడగొట్టాడు ఒక్కొక్క బాణం ప్రయోగించి సైనికులను చిందరవందర చేసాడు. ఇలా ప్రద్యుమ్నుడు ఎదురులేని విధంగా పరాక్రమించాడు. అలా మేరుపర్వతం అంత ధైర్యంతో ప్రద్యుమ్నుడు నిర్భయంగా అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించగా, తిలకించిన ఉభయ సైన్యాలు ప్రస్తుతించాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=855 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: