Monday, November 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౯(409)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-867-సీ.
ఒకమాటు నభమునఁ బ్రకటంబుగాఁ దోఁచు-
  నొకమాటు ధరణిపై నొయ్య నిలుచు
నొకమాటు శైలమస్తకమున వర్తించు-
  నొకపరిఁ జరియించు నుదధినడుమ
నొక్క తోయంబున నొక్కటియై యుండు-
  నొక్కెడఁ గనుఁగొనఁ బెక్కు లగును
నొకమాటు సాల్వసంయుక్తమై పొడసూపు-
  నొక తోయ మన్నియు నుడిగి తోఁచు
10.2-867.1-ఆ.
నొక్కతేప కొఱవి యుడుగక త్రిప్పిన
గతి మహోగ్రవృత్తిఁ గానవచ్చు
మఱియుఁ బెక్కుగతుల నరివరుల్‌ గలఁగంగఁ
దిరిగె సౌభకంబు ధీవరేణ్య!
10.2-868-వ.
ఇవ్విధంబున సౌభకంబు వర్తించుటం జేసి యదుసైన్యంబులచే దైన్యంబు నొందిన నిజసైన్యంబుల మరలం బురికొల్పి సాల్వుం డప్పుడు. 

భావము:
పరీక్షన్మహారాజా! ఆ సౌభకవిమానం తన మాయా ప్రభావంతో ఒకమారు ఆకాశంలో కనపడుతుంది; ఒకమారు భూమి మీద నిలబడుతుంది; ఒకమారు కొండశిఖరం మీద తిరుగుతుంది; ఒకమారు సముద్రమధ్యంలో విహరిస్తుంది; ఒకసారి ఒక్కటిగా, మరుక్షణంలో అనేక రూపాలతో ప్రత్యక్షమవుతుంది; ఒకతూరి సాల్వుడితో కూడి చూపట్టుతుంది; ఒకమారు ఏమీ లేకుండా కనపడుతుంది; ఒకమారు కొఱవి తిప్పినట్లుగా భయంకరంగా దర్శనమిస్తుంది; ఈ విధంగా ఆ విమానం శత్రువులు కలవరపడేటట్లు పెక్కువిధాలుగా తిరిగింది.ఇలా సౌభకవిమానం విజృంభించేసరికి అంతకు ముందు యాదవసైన్యంవల్ల భీతిచెందిన తన సైన్యాల్ని సాల్వుడు మళ్ళీ పురిగొల్పి యుద్ధోన్ముఖులను చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=867 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: