Friday, November 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౭(407)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-861-ఉత్సా.
చారుదేష్ణుఁ డాగ్రహించి శత్రుభీషణోగ్ర దో
స్సారదర్ప మేర్పడన్ నిశాత బాణకోటిచే
దారుణప్రతాప సాల్వదండనాథమండలిన్
మారి రేఁగినట్లు పిల్కుమార్చి పేర్చి యార్చినన్.
10.2-862-క.
శుకుఁ డా యోధన విజయో
త్సుకమతి బాహాబలంబు సొప్పడ విశిఖ
ప్రకరంబులఁ దను శౌర్యా
ధికుఁ డన విద్వేషిబలతతిం బరిమార్చెన్.
10.2-863-ఉ.
సారణుఁ డేపుమైఁ గదిసి శాత్రవవీరులు సంచలింప దో
స్సార మెలర్పఁ గుంత శర శక్తి గదా క్షురికాది హేతులన్
వారక వాజి దంతి రథవర్గములం దునుమాడి కాల్వురన్
వీరముతోడఁ బంపె జమువీటికిఁ గాఁపుర ముగ్రమూర్తియై. 

భావము:
చారుదేష్ణుడు ఆగ్రహంతో విజృంభించి వాడి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని దండనాథులను సంహరించి సింహనాదం చేసాడు. యోధుడైన శుకుడు యుద్ధవిజయకాంక్షతో చెలరేగి తన భుజబలం విశదం అయ్యేలా శరసమూహంతో శత్రు సేనావ్యూహాన్ని నాశనం చేసాడు. సారణుడు విజృంభించి శత్రువీరులు తన బాహుబలానికి శత్రువులు భయపడేలాగా కుంతాలూ, శక్తులూ, బాణాలూ, గదలూ, కత్తులూ మొదలైన ఆయుధాలతో సాల్వుడి గుఱ్ఱాలను ఏనుగులను రథాలను ధ్వంసం చేసి ఉగ్రస్వరూపుడు అయి శౌర్యంతో సైనికులను సంహరించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=863 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: