Tuesday, August 31, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౪(324)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-660-వ.
“దేవా! విశ్వనిర్మాణకర్తవై మాయివై సకల కార్యోత్పాదనాదిశక్తి యుక్తుండవై పావకుండు దారువులందు నంతర్హితప్రకాశుండై యున్న చందంబున వర్తించుచున్న నీదు దురత్యయంబయిన మాయాశతంబులఁ బెక్కుమాఱులు పొడగంటి నిదియు నాకు నద్భుతంబుగా; దదియునుంగాక నీ సంకల్పంబున జగంబుద్భవంబై భవత్పరతంత్రంబు నగు; నట్టి నీ కిష్టంబైన వస్తువు సాధుతరంబుగాఁ దెలియ నెవ్వండు సమర్థుం? డే పదార్థంబు ప్రమాణమూలంబునం దోఁచు నదియును లోకవిచక్షణుండ వైన నీదు రూపంబు; మఱియును ముక్తి మార్గంబు నెఱుంగక సంసార పరవశులైన జీవుల మాయాంధకారంబు నివర్తింపఁజేయ సమర్థంబగు; నీ దివ్యలీలావతారంబులం గలుగు కీర్తియను ప్రదీపంబు ప్రజ్వలింపఁజేసి కృపసేయుదట్టి నీకు నమస్కరించెద; నదిగావున నీ ప్రపంచంబున నీ యెఱుంగని యర్థంబు గలదె?” యని కృష్ణునకు నారదుం డిట్లనియె.

భావము:
“శ్రీకృష్ణభగవాన్! నీవు జగత్తు సృష్టించేవాడవు; మాయా మయుడవు; సర్వకార్యాలూ నిర్వర్తించే శక్తి సంపన్నుడవు. అరణికఱ్ఱలో అగ్ని అంతర్లీనంగా ప్రకాశించే రీతిన నీవు ప్రవర్తిస్తుంటావు. గుర్తింపసాధ్యంకాని నీ అశేషమాయా విశేషాలను ఎన్నోమార్లు కన్నాను. నీ సంకల్పంతోటే ఈ ప్రపంచం పుడుతుంది. నీకు లోబడి ఉంటుంది. ఈ లోకంలో నీకిష్టమైన వస్తువేదో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. ప్రమాణమూలంగాతోచే పదార్థాలన్నీ నీ రూపాలే. నీ రూపం ముక్తిసాధనరహస్యం తెలుసుకోలేక సంసారంలోపడి మాయాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిని సముద్ధరించడానికి సమర్థమైనది. నీ దివ్యలీలావతారాల కీర్తిని ప్రదీప్తం జేస్తూ ముక్తిమార్గాన్ని అనుగ్రహిస్తూ ఉంటావు. అలాంటి నీకు నమస్కరిస్తున్నాను. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం లేదు కదా.” అని నారదుడు తిరిగి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=660

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :


No comments: