Sunday, August 22, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౭(317)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-639-సీ.
అభినవ నిజమూర్తి యంతఃపురాంగనా-
  నయనాబ్జములకు నానంద మొసఁగ
సలలిత ముఖచంద్ర చంద్రికాతతి పౌర-
  జనచకోరముల కుత్సవము సేయ
మహనీయకాంచనమణిమయ భూషణ-
  దీప్తులు దిక్కులఁ దేజరిల్ల
నల్ల నల్లన వచ్చి యరదంబు వెస డిగ్గి;-
  హల కులిశాంకుశ జలజ కలశ
10.2-639.1-తే.
లలితరేఖలు ధరణి నలంకరింప
నుద్ధవుని కరతల మూని యొయ్య నడచి
మహితగతి దేవతాసభామధ్యమునను
రుచిర సింహాసనమునఁ గూర్చుండె నెలమి.
10.2-640-చ.
అతి విభవంబునం దనరి యాత్మతనుద్యుతి తేజరిల్లఁగా
హితులుపురోహితుల్వసుమతీశులుమిత్రులుబాంధవుల్‌బుధుల్‌
సుతులునుమాగధుల్కవులుసూతులు మంత్రులుభృత్యులున్శుభ
స్థితిఁ గొలువంగఁ నొప్పె నుడుసేవితుఁ డైన సుధాంశుఁడో యనన్.
10.2-641-క.
కరుణార్ద్రదృష్టిఁ బ్రజలం
బరిరక్షించుచు వివేకభావకళా చా
తురి మెఱసి యిష్టగోష్ఠిం
బరమానందమున రాజ్యభారకుఁ డగుచున్.

భావము:
అలా బయలుదేరిన శ్రీకృష్ణుడు తన నవమోహనాకారంతో అంతఃపురస్త్రీల కన్నులకు ఆనందాన్ని అందిస్తూ. అందాలు చిందే తన ముఖచంద్రుని వెన్నెల వెలుగులతో పురజనుల నేత్రచకోరాలకు పండుగచేస్తూ, తాను ధరించిన మణిమయ ఆభరణాల కాంతులు నలుదిక్కుల ప్రసరింపజేస్తూ, మెల్ల మెల్లగా రథం దిగి వచ్చాడు. హల, కులిశాది రేఖలతో శుభంకరములు అయిన తన పాదముద్రలు భూమి మీద అలంకారాలుగా వేస్తూ, ఉద్ధవుని చేతిని ఊతగా గ్రహించి గంభీరంగా నడుస్తూ దేవతాసభ సుధర్మసభ మధ్యన ఉన్న మణిమయ సింహాసనం మీద ఆసీనుడైయ్యాడు. శ్రీకృష్ణుడు తన శరీరకాంతులు నలుగడలా ప్రసరిస్తుండగా, హితులూ, పురోహితులూ, రాజులూ, మిత్రులూ, చుట్టాలూ, పెద్దలూ, కుమారులూ, స్తుతిపాఠకులూ, కవులూ, మంత్రులూ, సేవకులూ, అందరూ తనను సేవిస్తూ ఉండగా నక్షత్రాల నడుమ విరాజిల్లే చంద్రుడిలా మహవైభవంతో ప్రకాశించాడు. శ్రీకృష్ణుడు దయతో కూడిన చూపులతో ప్రజలను పరిపాలిస్తూ, వివేక చాతుర్యంతో ఆత్మీయులతో ప్రీతిగా మాటలాడుతూ, ఆనందంగా రాజ్యభారాన్ని వహించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=641

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: