Friday, August 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౯(309)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-615-వ.
ఇట్లు కనుంగొనుచుం జనుచుండ నొక్కయెడ నమ్మునీంద్రునకు ముకుందుండు ప్రత్యుత్థానంబు చేసి “మునీంద్రా! సంపూర్ణకాము లయిన మిమ్ము నపూర్ణకాములమైన మేమేమిటఁ బరితృప్తి నొందఁ జేయంగలవారము? భవదీయదర్శనంబున నిఖిలశోభనంబుల నందెద” మని ప్రియపూర్వకంబుగాఁ బలికిన నా నందనందను మాటలకు నానంద కందళిత హృదయారవిందుండును, మందస్మిత సుందర వదనారవిందుండును నగుచు నారదుండు వెండియుఁ జనిచని.
10.2-616-క.
అనఘాత్ముఁడు గనుఁగొనె నొక
వనితామణిమందిరమున వనకేళీ సం
జనితానందుని ననిమిష
వినమితచరణారుణారవిందు ముకుందున్.
10.2-617-క.
పరమేష్ఠిసుతుఁడు గనె నొక
తరుణీభవనంబు నందుఁ దను దాన మనోం
బురుహమునఁ దలఁచుచుండెడి
నరకాసురదమనశూరు నందకుమారున్.

భావము:
ఈవిధంగా వాసుదేవుని కనుగొంటూ వెళుతూ ఉన్న నారదుడిని కృష్ణుడు ఒక ఇంటిలో గౌరవించి “నారద మునీంద్రా! ఏ కోరికలూ లేని మిమ్ములను కోరికలు కల మేము ఏవిధంగా సంతృప్తి పరచగలం మీ దర్శనంతో సమస్త శుభాలనూ పొందుతాము.” అని ప్రీతి పూర్వకంగా పలికాడు. కృష్ణుడి మాటలకు మన స్ఫూర్తిగా సంతోషించి చిరునవ్వు నవ్వుతూ నారదుడు ముందుకు సాగిపోయాడు. పుణ్యాత్ముడైన నారదుడు ఒక స్త్రీరత్నం ఇంటిలో జలకేళి సలుపుతూ ఆనందిస్తున్న దేవతలచే నమస్కరింపబడు పాదాలు గలవానిని, ముకుందుడిని చూసాడు. నారదుడు మరొక తరుణీమణి ఇంటిలో తనలో తనను చూసుకుంటూ యోగనిష్ఠలో ఉన్న నరకాసురుని సంహరించిన శ్రీకృష్ణుడిని దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=617

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: