Monday, August 23, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౮(318)

( భూసురుని దౌత్యంబు )

10.2-642-వ.
ఇవ్విధంబునం బ్రతిదివసంబును నుండు నవసరంబున నొక్కనా డపూర్వదర్శనుం డైన భూసురుం డొక్కరుండు సనుదెంచి సభా మధ్యంబునం గొలువున్న ముకుందునిం బొడగని దండప్రణామం బాచరించి వినయంబునఁ గరములు మొగిచి యిట్లనియె.
10.2-643-క.
"కంజవిలోచన! దానవ
భంజన! యోగీంద్రవిమలభావలసద్బో
ధాంజన! దీప్తినిదర్శన!
రంజితశుభమూర్తి! కృష్ణ! రాజీవాక్షా!
10.2-644-తే.
అవధరింపు; జరాసంధుఁ డతుల బలుఁడు
దనకు మ్రొక్కని ధారుణీధవుల నెల్ల
వెదకి తెప్పించి యిరువదివేల నాఁకఁ
బెట్టినాఁడు గిరివ్రజపట్టణమున.

భావము:
వాసుదేవుడు ఇలా సంతోషంగా రోజులు గడుపుతుండగా, ఒకనాడు కొత్త బ్రాహ్మణుడు ఒకడు వచ్చి సభామధ్యంలో కొలువుతీరి ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. నమస్కారం చేసి, వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు. “రాజీవలోచనా! రాక్షససంహారా! యోగీశ్వర హృదయ రంజనా! తేజోనిధీ! దివ్యమంగళ విగ్రహా! శ్రీకృష్ణా! అనుగ్రహించు. దయచేసి నా విన్నపములు వినుము. అతి బలవంతుడైన జరాసంధుడు తనకు లోబడి ఉండని రాజులను అందరినీ వెదకి వెదకి తెప్పించి మరీ తన రాజధాని గిరివ్రజపురంలో కారాగారాలలో బంధించాడు. అలా ఇప్పటికి ఇరవైవేల మంది వరకూ రాజులు బంధీలుగా ఉన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=52&Padyam=644

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: